అన్న పాఠశాలను తనిఖీ చేసిన చెల్లెలు
x

అన్న పాఠశాలను తనిఖీ చేసిన చెల్లెలు

ఈ సంఘటన కడప జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.


స్వయానా తన అన్న పని చేస్తున్న పాఠశాలను చెల్లెలు తనిఖీ చేశారు. ఈ అరుదైన సంఘటన కడప జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా పెద్దముడియం మండల పరిధిలోని పెద్దపసుపుల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా ఎస్‌ జరీనా బేగం పని చేస్తున్నారు. పెద్దపసుపుల పాఠశాల క్లస్టర్‌ కాంప్లెక్స్‌ గా కూడా ఉంది. ఇటీవల జరిగిన బదిలీల్లో పెద్దపసుపుల కాంప్లెక్స్‌ పరిధిలోని ఉలవపల్లె మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఏకోపాధ్యాయుడుగా అమీర్‌ బాషా చేరారు.

కాగా అమీర్‌ బాషా , జరీనా బేగంలు స్వయాన అన్నా చెల్లెళ్లు. వీరిద్దరు జమ్మలమడుగు పట్టణానికి చెందిన దివంగత ప్రముఖ విశ్రాంత తెలుగు పండింట్, కవి, సీనియర్‌ జర్నలిస్ట్‌ అయిన విద్వాన్‌ కమాల్‌ సాహేబ్‌ సంతానం. క్లస్టర్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయురాలి హోదాలో చెల్లెలు జరీనా బేగం గురువారం మధ్యాహ్నం అన్న అమీర్‌ భాషా పని చేస్తున్న ఉలవపల్లె ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనంకు సంబంధించిన రికార్డులు, విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టిక తదితర రికార్డులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ ఎం అమీర్‌ బాషా, సీనియర్‌ ఉపాధ్యాయుడు సర్దార్‌ మొహిద్దీన్, సిఎంఆర్టి వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో పెద్దపసుపుల కాంప్లెక్స్‌ పరిధిలోని కొత్తపల్లె, మేడిదిన్నె, చిన్నపసుపుల తదితర పాఠశాలలను కూడా జరీనా బేగం తనిఖీ చేశారు.

Read More
Next Story