
సమ్మె వల్ల కార్మికులు బతికిపోయారు - లేకుంటే అగ్నికి బలయ్యేవారు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎంత మేరకు నష్టం జరిగిందనేదానిపై ఆరా తీస్తున్నారు.
గత కొద్ది రోజులుగా కార్మికులు సమ్మెకు దిగిన కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమ్మెకు దిగకుండా ఉండి ఉంటే ఆ సమయంలో కార్మికులు విధుల నిర్వహణలో ఉండి ఉండేవారు, చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో భారీగానే ప్రాణనష్టం వాటిల్లి ఉండేది.
శుక్రవారం తెల్లవారుజామున విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. తక్షణమే రంగంలోకి దిగారు. మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటన జరిగిన సమయంలో కార్మికులు విధుల్లో లేక పోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. సమ్మె కారణంగా కార్మికులు విధులకు హాజరు కాలేదు. అయితే అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందనే కారణాలపై స్పష్టత రావలసి ఉంది.
మరో వైపు ఎంత మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందనే దానిపై అంచనా వేసే పని అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు సమ్మెలో ఉన్నారు. వేతనాలు చెల్లింపులు, పదవీ విరమణలు, కార్మికుల సమస్యలు, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ తదితర సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు దిగారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలనే డిమాండ్లతో కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
Next Story