ప్రపంచమంతా మనవైపే చూస్తోంది
x

ప్రపంచమంతా మనవైపే చూస్తోంది

ఐఐటీ మద్రాసులో ఆలిండియా రీసెర్చ్‌ స్కాలర్స్‌ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.


ఇటీవల అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు హిందీ గురించి, తమళనాడు హిందీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, భాష మీద రాజకీయాలు తగదని పరోక్షంగా తమిళనాడు రాజకీయాలపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ త్రిభాష విధానంపైన, హిందీ మీద చేసిన వ్యాఖ్యలు కూడా తమిళనాడులో పెద్ద సంచలనంగా మారాయి. పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ తమిళనటుడు దళపతి విజయ్‌తో పాటు తమిళనాడు రాజకీయ వర్గాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఈ నేపథ్యంలో సీఎం చద్రబాబు నాయుడు శుక్రవారం ఐఐటీ మద్రాసు కార్యక్రమంలో పాల్గొనడం, అక్కడి మర్యాదలను పొందడం, ఆసక్తికరంగా మారింది.

ఐఐటీ మద్రాసు ఆలిండియా రీసెర్చ్‌ స్కాలర్స్‌ సమ్మిట్‌లో శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఐఐటీ మద్రాసు ఉందన్నారు. చదువులో కానీ, పరిశోధనల్లో కానీ తక్కిన సంస్థల కంటే ఐఐటీ మద్రాసు అగ్ర స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా మనవైపే చూస్తోందని, రానున్న రోజుల్లో భవిష్యత్‌ అంతా భారతీయులదే అని, ఆ నమ్మకం తనకు ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఐఐటీ మద్రాసు ఆధ్వర్యంలోని స్టార్‌టప్‌లు దాదాపు 80 శాతం విజయవంతం అవుతున్నాయని, ఐఐటీ మద్రాసు స్టార్టప్‌ అగ్నికుల్‌ మంచి ఫలితాలను సాధించిందన్నారు. ఐఐటీ మద్రాసు ఆఫ్‌ లైన్‌ కోర్సులతో పాటు ఆన్‌లైన్‌ కోర్సులను కూడా అందిస్తోందన్నారు. ఐఐటీ మద్రాసుకు రావడం తన అదృష్టంగా భావిస్తున్నాని, గతంలో ఓ సారి రావాల్సి ఉన్నా రాలేకపోయానన్నారు. అంతేకాకుండా ఐఐటీ మద్రాసులో దాదాపు 40 శాతం తెలుగు వారే ఉన్నారని అన్నారు. భారత దేశ విద్యారంగంలో ఐఐటీల రూపకల్పన, ఆ సంస్థల ఏర్పాటు ఓ గొప్ప నిర్ణయమన్నారు. గతంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు భారత దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేశాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న రష్యా రాజకీయ సంస్కరణలతో అనేక దేశాలు విడిపోతే.. చైనా మాత్రం ఆర్థిక సంస్కరణల ద్వారా ఎంతో ప్రగతిని సాధించిందన్నారు. తద్వారా ప్రపంచంలోనే చైనా రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు.
ఆర్థిక సంస్కరణల అనంతరం మన భారత దేశం కూడా అభివృద్ధిబాట పట్టిందన్నారు. ఇంగ్లీషు భాషను ఇక్కడ వదిలేసి, దేశంలోని వనరులను తీసుకెళ్లి పోయారని అన్నారు. కమ్యూనికేషన్‌ రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్, వీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు గుత్తాధిపత్యంగా ఉండేవని, ఆర్థిక సంస్కరణల అనంతరం కమ్యూనికేషన్‌ రంగంలో ప్రైవేటు సంస్థలెన్నో వచ్చాయన్నారు. ఇలా కమ్యూనికేషన్‌ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు రావడం ఒక గేమ్‌ ఛేంజర్‌ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచం అంతా భారత దేశం వైపే చూస్తోందని చెబుతూ మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌తో తన అనుబంధాన్ని పంచుకున్నారు. బిల్‌గేట్స్‌ను తాను కలుస్తానని మొదట ఆయన ఆపాయింట్‌మెంట్‌ అడిగినప్పుడు రాజకీయ నాయకులతో సంబంధం లేదని, కలవరని చెప్పారని చెప్పారు. అయితే ఆయనను కలవాలనే ఏకైక లక్ష్యంతో వారిని ఒప్పించి, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ తీసుకున్నానని తెలిపారు. అయితే నాడు తనకు బిల్‌గేట్స్‌కు జరిగిన 45 నిముషాల సమావేశంలో నాడు ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ సంస్థను ఏర్పాటు చేయాలని బిల్‌గేట్స్‌ను అడిగానని, దానికి బిల్‌గేట్స్‌ ఒప్పుకున్నారని తెలిపారు. ఇప్పుడు అదే మైక్రోసాఫ్ట్‌ సంస్థకు ఓ తెలుగు వ్యక్తి సీఈవోగా ఉన్నారని, ఇది మనందరికీ గర్వకారణమన్నారు. సాంకేతిక పరంగా భారత దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇదే స్పీడ్‌ కొనసాగితే ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. 2014 నాటికి పదో స్థానంలో ఉన్న భారత దేశ ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు ఐదో స్థానానికి చేరిందని చెప్పారు. భారత దేశానికి అనేక వనరులు ఉన్నాయని, అందులో మనవ వనరులు, జనాభా ఓ గొప్ప వరమన్నారు. అంతా కలిసి కష్టపడి పని చేస్తే ప్రపంచంలోనే ఇండియా అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు.
Read More
Next Story