నేతన్నలు కార్మికులు కాదు..కళాకారులు
x

నేతన్నలు కార్మికులు కాదు..కళాకారులు

మంగళగిరిలో ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కార్‌ నడుస్తోందని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు.


అందరూ చేనేతలను కార్మికులని అంటారు.. కానీ చేనేత కార్మికులు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూశాను.. దారానికి రంగు దగ్గర నుంచి మగ్గాలపై చీర నేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు.. అద్భుతమైన డిజైన్స్‌ రూపొందిస్తారు.. అందుకే నేతన్నలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సందర్భంగా పిలుస్తున్నాను.. అంటూ మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు.

మంగళగిరి ఆటోనగర్‌ లోని వీవర్‌ శాల వద్ద నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు కలిసి మంత్రి నారా లోకేష్‌ పాల్గొన్నారు. ముందుగా వీవర్‌ శాలలో ఏర్పాటుచేసిన చేనేత ఉత్పత్తుల స్టాళ్లను, వీవర్‌ శాలలో మగ్గాలు, చేనేత వస్త్రాలను మంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ‘జై చేనేత’ అంటూ మంత్రి నారా లోకేష్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
2019లో 21 రోజుల ముందు టీడీపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చా. 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. కానీ మంగళగిరి పట్టణం నాకు ఆనాడు 7వేల మెజార్టీ ఇచ్చింది. ఆనాడే నిర్ణయించాను.. చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని. ఓడిపోయిన మొదటి రోజు బాధ.. ఆవేదన కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ.. ఆవేదన నాలో కసి పెంచింది. ఐదేళ్లు ఇక్కడే పనిచేసి ప్రజలకు దగ్గర కావాలని నిర్ణయించుకున్నా అని లోకేష్‌ పేర్కొన్నారు.
చేనేతల ఇబ్బందులు స్వయంగా చూసి వీవర్‌ శాల ఏర్పాటుచేయడం జరిగింది. ఈ రోజు డిజైన్‌ ల దగ్గర నుంచి ఆధునిక మగ్గాలు, టాటా తనేరా సంస్థతో ఒప్పందం, మార్కెట్‌ లింకేజీ చేసి చేనేత సోదరులకు ఆదాయం 30 శాతం పెంచామన్నారు.
యువగళం పాదయాత్రలో ప్రొద్దుటూరు, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడలో నేను చేనేతలను నేరుగా కలుసుకున్నా. వారు పడుతున్న ఇబ్బందులు చూశా. మంగళగిరి చేనేత కళాకారుల వస్త్రాలను పెద్దఎత్తున ప్రమోట్‌ చేస్తున్నాం. కుటుంబపరంగా మేం పెళ్లికి వెళితే అక్కడ మేం ఇచ్చే చీర కూడా మంగళగిరి చేనేత చీరేనని, ప్రధాని, ఇతర రాష్ట్ర, జాతీయ నేతలను కలిసినప్పుడు ఇచ్చేది మంగళగిరి చేనేత శాలువానే అని చెప్పారు. బ్రాహ్మణి మంగళగిరి చేనేత చీర కట్టిన తర్వాత చాలా వైరల్‌ అయిందన్నారు. కేంద్రం ఒప్పుకోకపోతే చేనేత వస్త్రాలపై జీఎస్టీ రిబేట్‌ ఇస్తామని చెప్పా. త్రిఫ్ట్‌ ఫండ్‌ తిరిగి ఏర్పాటుచేస్తామని చెప్పా. చేనేత భరోసా కింద ప్రతి చేనేతకు ఏడాదికి రూ.25వేలు ఆర్థిక సాయం అందిస్తామని ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. స్వర్ణకారులకు ఎప్పుడూ లేనివిధంగా కార్పోరేషన్‌ ఏర్పాటుచేస్తామని చెప్పామన్నారు.
మంగళగిరిలో ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కార్‌ నడుస్తోంది. కేంద్రంలో ప్రధాని మోడీ గారు, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు గారు, మంగళగిరి గల్లీల్లో మీ లోకేష్‌ అని పేర్కొన్నారు. మంగళగిరి దయ వల్ల రాష్ట్రం మొత్తానికి ఒక జోవో వచ్చింది. మొదటి విడతలో వెయ్యి కోట్ల విలువైన భూమిని 3వేల కుటుంబాలకు గౌరవంగా బట్టలు, పసుపు, కుంకుమ పెట్టి పట్టాలు అందించామన్నారు.
చంద్రబాబు గారి సహకారంతో 31 కమ్యూనిటీ హాల్స్‌ నిర్మిస్తున్నాం. మోడల్‌ లైబ్రరీ పనులు జరుగుతున్నాయి. మంగళగిరి–తెనాలి రోడ్డు నిర్మించాం. నాలుగు లేన్ల రోడ్‌ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. మంగళగిరి పట్టణంలో మహాప్రస్థానం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 100 స్మశానాలు అభివృద్ధి చేస్తున్నాం. 46 పార్కులు, స్మార్ట్‌ బస్‌ షెల్టర్స్, తాడేపల్లి వంతెన, వంద పడకల ఆసుపత్రి, తాడేపల్లి ఫ్లడ్‌ ప్రొటెక్షన్‌ వాల్, మోడల్‌ ఫిష్‌ మార్కెట్, మోడల్‌ రైతు బజార్, భూగర్భ డ్రైనేజ్, వాటర్, పవర్, గ్యాస్‌ ప్రాజెక్ట్, జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ పార్క్, నిడమర్రు రైల్వేగేట్‌ దగ్గర బ్రిడ్జ్, ఎయిమ్స్, మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి చేస్తున్నాం. దేవాలయం వద్ద ఉచితంగా రెండు ఈవీ బస్సులను నడిపిస్తున్నామన్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పద్మశాలీ నాయకులకు మీరు రాష్ట్రస్థాయి గుర్తింపు అందించారు. నందం అబద్దయ్య గారిని పద్మశాలీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ గా, తమ్మిశెట్టి జానకమ్మ గారిని టీటీడీ బోర్డు మెంబర్‌ గా, చిల్లపల్లి శ్రీనివాసరావు ఏపీఎస్‌ఎమ్‌ఐడీసీ ఛైర్మన్‌ గా, కందుల నాగార్జునను పద్మశాలీ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ గా నియమించినట్లు లోకేష్‌ తెలిపారు. చేనేత సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడి, పద్మశాలీల గుండెల్లో ప్రగడ కోటయ్య దేవుడిలాంటి వ్యక్తి అని, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎంను కోరుతున్నట్లు చెప్పారు. టిడ్కో హౌసింగ్‌ లో 6 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న పార్క్‌ కు ప్రగడ కోటయ్య పేరు పెట్టాలని నిర్ణయించామని, ఆ పార్క్‌లో ప్రగడ కోటయ్య విగ్రహాన్ని కూడా ఏర్పాటుచేస్తున్నామని లోకేష్‌ తెలిపారు.
Read More
Next Story