ఇకపై ఊరికి ఒక సచివాలయం ఉండదు
ప్రస్తుతం ఉన్న సచివాలయాల సంఖ్య తగ్గనుంది. ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గుతుంది.
ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల సంఖ్యను తగ్గించనుంది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక సచివాలయం ప్రస్తుతం ఉంది. ఇకపై 2500 మంది జనాభాకు ఒక సచివాలయం మాత్రమే ఉంటుంది. అంటే కొన్ని చిన్న గ్రమాల్లో సచివాలయాలు వుండవు. ఉదాహరణకు ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని రాచకొండ గ్రామ పంచాయతీ పరిధిలో రాచకొండ, వెంకటరెడ్డి పల్లె, రాచకొండ ఉమ్మడివరం, సుద్దకురవ తాండా గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి గ్రామంలోనూ సచివాలయం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం రేషనలైజేషన్ చేపట్టి నందున రెండు గ్రామాల్లో మినహా రెండు గ్రామాల్లో సచివాలయాలు వుండే అవకాశం లేదు. రాచకొండ, సుద్దకురవ తాండా ల్లో నాలుగు నుంచి ఐదు వందల లోపు మాత్రమే జనాభా ఉంటుంది. ఇలా సచివాలయాల సంఖ్య వేలల్లో తగ్గుతుంది.
ఆర్టీజీఎస్ కేంద్రాలుగా మారే అవకాశం
రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) కేంద్రాలుగా సచివాలయాలను వాడుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రజల సమస్యల పరిష్కారం ఏమో కాని లెక్కలు చూసే కేంద్రాలుగా మారిపోతాయి. ప్రస్తుతం ఏదైనా సమస్యపై వెళ్లిన వారితో మాట్లాడి వారి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. ఇకపై అది కూడా వారు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. గతంలో మాదిరి ప్రతి ప్రభుత్వ విభాగానికీ ఒక ఉద్యోగి ఉండే అవకాశం లేదు. వాస్తవానికి ఆర్టీజీఎస్ కేంద్రం చేసే పని వివరాలు సేకరించి ప్రభుత్వం వద్ద పెట్టడం. ఈ పనిని ఇప్పటికే ప్రణాళికా శాఖ చేస్తోంది. అన్ని జిల్లా కార్యాలయాల నుంచి రిపోర్టులు తీసుకుని అందులో ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది. లేదంటే ప్రోగ్రెస్ ఎందుకు తగ్గింది అనే రిపోర్టు తయారు చేసి కలెక్టర్ వద్ద పెడతారు. తాజా లెక్కల వివరాలు కావాలంటే కలెక్టర్లకు ప్రణాళిక శాఖ ఇస్తుంది. రానున్న రోజుల్లో ప్రణాళిక శాఖను రద్దు చేసే దిశగా ప్రభుత్వ పోకడ ఉంది.
మల్టీపర్పస్ ఉద్యోగులుగా సచివాలయ సిబ్బంది
ఇప్పటి వరకు ఒక్కో ప్రభుత్వ విభాగానికి సచివాలయంలో ఒక్కో కార్యదర్శి లేదా అసిస్టెంట్ ఉన్నారు. ప్రధానమైన రెవెన్యూ, పంచాయతీ రాజ్, వ్యవసాయం, విద్య, సంక్షేమ శాఖలు, వైద్యం, ఇంజనీరింగ్ శాఖలు, పశువైద్యశాఖ, భూమి సర్వే విభాగం సర్వేయర్ ఇలా మొత్తం పది మంది ఉన్నారు. ఇకపై అలా కాకుండా ఒక్కో సచివాలయంలో మల్టీపర్పస్ వర్కర్స్ గా పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సంక్షేమ, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గా ఒక్కరే ఉన్నారు. అలాగే మిగిలిన మరికొన్ని శాఖల విధులు కూడా వారే నిర్వహించాల్సి ఉంటుంది. మల్టీపర్పస్ సిబ్బందిలో రెవెన్యూ కార్యదర్శి, హెల్త్ అసిస్టెంట్, సర్వేయర్, ఇంజనీరింగ్, వ్యవసాయ అసిస్టెంట్స్, పశు సంవర్థక శాఖ కార్యదర్శి, విద్యత్ పంపిణీ కార్యదర్శి ఉంటారు.
టెక్నాలజీ పై శిక్షణ
ప్రస్తుతం సచివాలయాల్లో ఉన్న ఉద్యోగులకు టెక్నికల్ లాలెడ్జ్ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. కంప్యూటర్ పై శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయించింది. భవిష్యత్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాబోతోంది. అందువల్ల అటువంటి సాఫ్ట్ వేర్ పై శిక్షణ అవసరమని సీఎం చంద్రబాబు భావించారు. డ్రోన్ టెక్నాలజీపై కూడా ఉద్యోగులు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. డేటా ప్రాసెసింగ్ ఉద్యోగికి కూడా ఈ శిక్షణ అవసరమని సీఎం సచివాలయ అధికారులకు చెప్పారు.
జనాభా ప్రాతిపదికన సచివాలయాలు వద్దు
జనాభా ప్రాతిపదికన సచివాలయాలను రేషనలైజేషన్ చేయాలనే ఆలోచన మంచిది కాదని సామాజిక కార్యకర్తలు, నాయకులు అభిప్రాయ పడుతున్నారు. చిన్న గ్రామం పేరుతో అక్కడ సచివాలయం లేకుండా చేస్తే ఐదు కిలో మీటర్ల దూరంలోని సచివాలయానికి వెళ్లాలంటే ఇబ్బందులు తప్పవు. అందువల్ల గ్రాయంలో ఒక్క సచివాలయమైనా తప్పకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రానాయక్ అభిప్రాయ పడ్డారు.