ఇకపై ఊరికి ఒక స్కూలు ఉండదు!
x

ఇకపై ఊరికి ఒక స్కూలు ఉండదు!

సమూహాల పేరుతో ఊరిలో ఉండే స్కూలును లేకుండా చేస్తోంది ప్రభుత్వం.


ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి. విద్య ద్వారానే సమాజంలోని రుగ్మతలను రూపు మాపొచ్చు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవచ్చు. పేదరికం లేని సమాజాన్ని చూడొచ్చు. అనేవి నినాదాలకు పరిమితం అవుతున్నాయా? అనే సందేహాలు ప్రస్తుతం ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. బ్రిటీష్ పాలకులు ప్రజలను చదువుకోకుండా చేశారు. అప్పట్లో డబ్బులు ఉన్న వారు మాత్రమే చదువుకునే వారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత స్వాతంత్ర్యం తెచ్చిన మహా భాగ్యం స్వేచ్ఛ. సమానత్వం. ఇప్పుడిప్పుడే అది సాధ్యమవుతుందనే కలలు కంటున్నారు ప్రజలు. ఆ కలలు కల్లలుగానే పాలకుల నిర్ణయాలు చేస్తాయా? అనే సందేహాలు విద్యావంతుల నుంచి సైతం వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు హైస్కూలు విద్యను అభ్యసించాలంటే కనీసం 10 నుంచి 20 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సిందే. ఇప్పుడు అందుబాటులోకి హైస్కూల్స్ వచ్చాయి. ప్రతి ఊరికీ ఒక స్కూలు వచ్చింది. విద్యార్థులతో సంబంధం లేకుండా సింగిల్ టీచర్ స్కూలు ఉన్నా చాలని ప్రజలు భావిస్తున్నారు. ఈ తరుణంలో సమూహాలుగా విద్యాలయాలు అనే ఆలోచన తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది.

సింగిల్ టీచర్ స్కూల్స్ ఉండవు

ఇప్పటి వరకు చాలా సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. ఒక్కో పల్లెటూరులో 100 కుటుంబాలు ఉన్నాయనుకుంటే పిల్లలు కనీసం 50 మంది వరకు ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని ఊళ్లలో 50 ఇళ్లు మాత్రమే ఉంటే అక్కడ పది నుంచి 20 మంది పిల్లలు ఉంటారు. ఒక వేళ కుటుంబాలు తక్కువున్నా పిల్లలు ఎక్కవ ఉండే అవకాశం కూడా ఉంది. జనాభాను బట్టి పిల్లల సంఖ్యను నిర్థారించే అవకాశం లేదు. అందువల్ల ప్రతి గ్రామానికీ ఒక స్కూలు తప్పకుండా ఉండాలి. అలా ఉంటేనే చదువుకునే అవకాశం పిల్లలకు ఉంటుంది. అలా కాకుండా పంచాయతీకి ఒక స్కూలు ఉంటే సరిపోతుందనుకుంటే పిల్లల చదువులకు కష్టాలు తోడైనట్లే.

కిలో మీటరు దూరం ఉండేలా...

కిలో మీటరు లోపు ఒకటి కంటే ఎక్కవ ఉన్న స్కూళ్లను ఒక చోటకు తీసుకు రావాలనే ఆలోచన ప్రభుత్వం చేసింది. అందుకు సమ్మతిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒక పంచాయతీలో ఒక స్కూలు ఉంటే బాగుంటుందనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. ఒక పంచాయతీలో నాలుగైదు ఊళ్లు కూడా ఉంటున్నాయి. ఉదాహరణకు ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని రాచకొండ పంచాయతీలో నాలుగు గ్రామాలు ఉన్నాయి. రాచకొండ, వెంకటరెడ్డిపల్లె, ఆర్ ఉమ్మడివరం, సుద్దకురవ తాండా గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు ఒక దాని నుంచి ఒకదానికి కిలో మీటరు దూరం ఉంటుంది. అంటే రాచకొండ గ్రామం నుంచి ఆర్ ఉమ్మడి వరం గ్రామానికి మూడు కిలో మీటర్లు ఉంటుంది. వెంకటరెడ్డిపల్లె గ్రామానికి ఒకటిన్నర కిలో మీటరు ఉంటుంది. సుద్దకురవ గ్రామానికి రెండు కిలో మీటర్లు ఉంటుంది. ఈ గ్రామాల్లోని అన్ని స్కూళ్లను ఒక చోటకు చేరిస్తే మిగిలిన మూడు గ్రామాలకు ఇబ్బంది గానే ఉంటుంది.

మా హయాంలో వాగులు దాటి వెళ్లాం..

మేము చదువుకునే రోజుల్లో రాచకొండ నుంచి హైస్కూలు చదువుకు వెళ్లాలంటే పది కిలో మీటర్ల దూరంలోని నాయుడుపాలెం గ్రామం వెళ్లి చదువుకోవాలి. అప్పట్లో కాలిబాట మాత్రమే ఉండేది. రాచకొండ నుంచి నాయుడు పాలెం ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చే వాళ్లం. కొందరికి సైకిళ్లు ఉన్నాయి. మరి కొందరికి సైకిళ్లు కూడా లేవు. కాలినడక తప్పదు. పుస్తకాల మోత. అన్నం క్యారియర్ కూడా మోసుకెళ్లాలి. పెద్ద చెరువు వాగు దాటాల్సి వచ్చేది. అప్పుడప్పుడూ వాగు తీవ్రంగా పారేది. వర్షం వచ్చినా, వాగు పారినా ఆ రోజు స్కూలుకు వెళ్లటం చాలా కష్టం. మానేసే వాళ్లం అని రాచకొండ గ్రామానికి చెందిన రైతు నారు వెంకటరెడ్డి తన అనుభవాన్ని చెప్పారు. ఇప్పుడు ప్రతి ఊరికీ ఒక స్కూలు వచ్చింది. తిరిగి పాత రోజుల్లోకి నేతలు ఎందుకు తీసుకెళుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే తప్పకుండా పిల్లలు చాలా మంది స్కూలు మానేస్తారన్నారు.

40 నుంచి 50 ఉపాధ్యాయులు ఒకే చోట ఉండే విధంగా..

ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించే విద్యా సముదాయాల్లో ఒకే చోట కనీసం 40 నుంచి 50 మంది ఉపాధ్యాయులు ఉంటారు. అంటే కనీసం వెయ్యి మందికి తగ్గకుండా విద్యార్థులు ఉంటారు. గ్రామాల్లో 10 నుంచి 15 పాఠశాలలు, పట్టణాల్లో 8 నుంచి 10 పాఠశాలలను ఒక చోటుకు తీసుకొచ్చే విధంగా విధానం తయారైంది. సవరించిన పాఠశాలపై 64 అభ్యంతరాలు వచ్చాయని, ఆ అభ్యంతరాలను పరిష్కరించినట్లు విద్యాశాఖ చెబుతోంది. అన్ని స్కూళ్లను మెర్జ్ చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న భవనాలకు అదనంగా భవనాలు నిర్మించాల్సి ఉంటుంది. ఎక్కువ డబ్బులు పెట్టి అదనపు తరగతి గదులు నిర్మించే బదులు ఎక్కడి స్కూళ్లు అక్కడే ఉంచి పర్యవేక్షణ పెంచితే విద్యార్థులు మంచి విద్యను అభ్యసించేందుకు వీలు ఉంటుందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

మెయింటెనెన్స్ కష్టమనే పేరు చెప్పి...

ఒక్కో ఊరికి ఒక్కో స్కూలు ఉండటం వల్ల మెయింటెనెన్స్ ఖర్చు పెరిగి పోతోందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు వేల కోట్లు ప్రభుత్వం అప్పులు చేసి పప్పులు, బెల్లాల మాదిరి పేదల పేరు చెప్పి ఉచిత పంపిణీలు చేసిన ప్రభుత్వం భావి భారత పౌరులకు మంచి విద్యను అందించే విషయంలో మెయింటెనెన్స్ గురించి ఆలోచించడం ఏమిటనే ప్రశ్న కూడా పలువురి నుంచి వస్తోంది. ఒక ఆయా, అటెండర్ పోస్టు తప్ప అక్కడ సౌకర్యాలు ఏముంటాయి. ప్రభుత్వం కొన్ని స్కూల్లకు మంచినీటి సౌకర్యం కూడా సరిగా కల్పించటం లేదు. స్టాఫ్ విషయానికొస్తే పెద్దగా మార్పు ఏమీ ఉండదు. అలాంటప్పుడు మెయింటెనెన్స్ పేరుతో స్కూలే ఆ ఊరిలో లేకుండా చేయడం ఏమిటనే ప్రశ్న పలువురిని వేధిస్తోంది.

మాట్లాడని ఉపాధ్యాయ సంఘాలు

ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల వారిని ‘ఫెడరల్’ ప్రతినిధి ప్రశ్నిస్తే వారి నుంచి వస్తున్న సమాధానం ఒక్కటే, ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ప్రభుత్వం ఆలోచించి అందుకు సంబంధించిన సర్వేను పూర్తి చేసింది. మేము కోరేది ఒక్కటే సకాలంలో ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వాలి. సముదాయంలో ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి జీతాలు ఇచ్చే పవర్స్ హెచ్ఎం కు ఇవ్వాలంటున్నారు. విద్యార్థులను ఒక చోటుకు చేర్చే విధానం ప్రభుత్వం చేపట్టింది కాబట్టి అలా వద్దనే అధికారం మాకు లేదంటున్నారు. ప్రభుత్వం తీసుకునే విధానంలో మంచీ చెడుల గురించి మేము చెప్పేదేమీ ఉండదంటున్నారు.

గతానికి ఇప్పటికి తేడా ఏమిటి?

గతంలో కొన్ని స్కూళ్లలో ఒక తరగతిలో ఉండే విద్యార్థుల సంఖ్య మరీ తక్కువగా ఉంటే వారిని వేరే స్కూలుకు మార్చారు. దాని వల్ల మరికొన్ని క్లాసుల్లో కూడా విద్యార్థల సంఖ్య తగ్గింది. విద్యార్థుల్లో ఉండే స్నేహం కాస్త దూరం కావడంతో స్కూలు మానేసిన పిల్లలు ఉన్నారు. పిల్లలు బాగా తగ్గారని అందరు పిల్లలను మరొక స్కూలుకు మార్చి ఆ స్కూలును శాశ్వతంగా మూసి వేశారు. అక్కడ ఉన్న ఒకరిద్దరు టీచర్లను వేరే స్కూల్లకు మార్చారు. దీని వల్ల కొన్ని ఊళ్లకు స్కూళ్లు లేకుండా పోయాయి. అయితే ఇప్పుడు ఆ మాట కాకుండా ఏకంగా ఒక చోట నుంచి మరో చోటకు స్కూలును మార్చేస్తున్నారు.

Read More
Next Story