మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు మళ్లీ కొనసాగుతుందా..దర్యాప్తు ముగిసిందని చెప్పిన సీబీఐ తదపరి దర్యాప్తు తిరిగి ప్రారంభిస్తుందా.. ఇవే అనుమానాలు ఇప్పుడు చోటుచేసుకుంటున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈకేసులో తదుపరి దర్యాప్తు అవసరమో లేదో చెప్పాలని సీబీఐని నిర్దేశించింది. దర్యాప్తులో నిందితులను కస్టోడియల్ విచారణ చేయాలో వద్దో కూడా చెప్పాలని పేర్కొంది. ఎంత మంది నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న విషయాన్నీ చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.మరి ఇప్పుడు సీబీ కోర్టుకు ఏమి చెబుతుందన్నది ఆసక్తిగా మారింది.మరోవైపు కోర్టు, వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు నెర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ విచారణాధికారి రామ్‌సింగ్‌పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని వెల్లడించింది. చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే వారిపై కేసు పెట్టారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వాదన
అంతకుముందు జస్టిస్ M.M.సుందరేశ్, జస్టిస్ N.K. సింగ్ ధర్మాసనం ఎదుట కేసు విచారణ జరిగింది. కడప ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందు వల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు. హత్య కేసులో మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు.సూత్రధారులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందని సిద్ధార్థ లూథ్రా సుప్రీంకు విన్నవించారు.అవినాష్ రెడ్డే వివేకా హత్యలో మాస్టర్ మైండ్ అని ధర్మాసనానికి తెలిపారు.నిందితులు సాక్ష్యులను బెదిరించడమే కాకుండా సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని వాదన వినిపించారు.సునీత దంపతులతోపాటు సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పైనా కేసు పెట్ిన విషయాన్ని లూధ్రా గుర్తుచేశారు.
సీబీఐ వాదన
అనంతరం సీబీఐ తరఫు వాదనలను సీబీఐ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వినిపించారు. నిందితుల బెయిల్ రద్దు చేయాలని సుప్రీంను కోరారు. నిందితులను కాలపరిమితి లేకుండా జైలులో ఉంచడం మంచిది కాదని కానీ హత్య జరిగిన తీరు చూస్తే నిందితులకు 5 సంవత్సరాలు జైలు శిక్ష చాలా తక్కువే అనిపిస్తోందని తెలిపారు. కేసులో ఆధారాలు చెరిపేయడం, సాక్ష్యాధారాలు లేకుండా చేయడం నిరూపితమైందని చెప్పారు. ముందు గుండె పోటు అని తర్వాత రక్తపు వాంతులు అని ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. నిందితులు హత్య అని తెలియకుండా అన్ని విధాలా ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇవన్ని దర్యాప్తులో పూర్తిగా బయటపడ్డాయని స్పష్టం చేశారు.అప్రూవర్‌గా ఉన్న దస్తగిరిని బెదిరించినట్లు సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.అన్ని సాక్ష్యాలను ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ కోర్టుకు అందించారు.కేసు తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.