ఉపాధ్యాయుడి రాక్షస దండన!
x
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి నరేష్‌

ఉపాధ్యాయుడి రాక్షస దండన!

విశాఖపట్నంలో మానవత్వం మరిచిన ఓ టీచర్‌ అమానుషంగా ప్రవర్తించి ఎనిమిదో తరగతి విద్యార్థి చేయి విరగ్గొట్టాడు.


పిల్లలకు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే రాక్షసులుగా మారుతున్నారు. తాము చదువు చెప్పే అయ్యవార్లమన్న సంగతిని మరచి విలన్ల అవతారం ఎత్తుతున్నారు. ఇటీవల కాలంలో బడి పిల్లలపై తరచూ దాష్టీకాలకు పాల్పడుతున్నారు. అదుపు తప్పి దండనలకు దిగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి రాక్షసుడిలా మారాడు. ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవను నిలువరించాల్సింది పోయి ఏకంగా ఆ విద్యార్థి చేయినే విరగ్గొట్టాడు.


స్కూలు ప్రిన్సిపాల్‌ను నిలదీస్తున్న విద్యార్థి తండ్రి ఆదినారాయణ

విశాఖపట్నం మధురవాడలోని శ్రీతనుష్‌ అనే ప్రైవేటు పాఠశాలలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి తండ్రి ఆదినారాయణ కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం ఈ స్కూలులో ఎనిమిదో తరగతి చదువుతున్న నరేష్, మరో విద్యార్థి చిన్నపాటి తగాదా పడుతుండగా ఆ సమయంలో పాఠం చెబుతున్న సోషల్‌ టీచర్‌ మోహన్‌ వెళ్లి నరేష్‌పై చేయి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా నరేష్‌ను ఇనుప బల్లపై వేసి చితకబాదుతూ పిడిగుద్దులు గుద్దాడు. ఇంతజరిగినా స్కూలు యాజమాన్యం పట్టించుకోలేదు.


విద్యార్థి నరేష్‌ చేయి విరిగిన ఎక్స్‌ రే

బాధతో ఏడ్చుకుంటూ ఇంటికెళ్లిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. జరిగిన విషయాన్ని ఆ బాలుడు తన అమ్మానాన్నలకు చెప్పడంతో నగరంలోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు నరేష్‌ ఎడమ చేతి ఎముకతో పాటు మరో రెండు చోట్ల కూడా ఎముకలు విరిగాయని చెప్పారు. దీంతో గురువారం బాధిత విద్యార్థి తల్లిదండ్రులు, మరికొందరు పిల్లల తల్లిదండ్రులు ఆ ప్రైవేటు స్కూలుకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. పిల్లలను చదువు కోసం పంపిస్తే ఎముకలు విరగ్గొడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడిపై దాడి చేసిన సోషల్‌ ఉపాధ్యాయుడు మోహన్‌ను రప్పించాలని డిమాండ్‌ చేశారు.


స్కూలు ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థి తల్లిదండ్రులు

అయితే అప్పటికే ఆ టీచర్‌ పరారీలో ఉన్నాడని చెప్పడంతో మరింత ఆగ్రహోదగ్రులయ్యారు. అనంతరం ఆ స్కూలు ఎదుట ఆందోళన చేపట్టారు. విద్యార్థి చేయి విరగ్గొట్టిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఎంఈవో అనురాధ స్కూలుకు చేరుకుని ఘటన వివరాలను తెలుసుకున్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న పీఎం పాలెం పోలీసులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పిల్లల తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు. ఈ ఘటనపై పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయుడు విద్యార్థి చేయి విరగ్గొట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read More
Next Story