వైజాగ్‌ అయోధ్య రాముడి కథ కంచికి..!
x
భక్తుల్లేకుండా కనిపిస్తున్న అయోధ్య నమూనా ఆలయం

వైజాగ్‌ అయోధ్య రాముడి కథ కంచికి..!

విశాఖ బీచ్‌ రోడ్డులో అయోధ్య రాముడి పేరుతో దోపిడీకి బ్రేకు పడింది.


అయోధ్యలో రామ మందిరాన్ని పోలిన నమూనా ఆలయాన్ని విశాఖ సాగరతీరంలో ఏర్పాటు చేసిన నిర్వాహకుల దూకుడుకు కళ్లెం పడింది. వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న ఈ అయోధ్య రాముడి కథ కంచికి చేరింది. గరుడ గ్రూపు పేరిట ఆర్కే బీచ్‌ రోడ్డులో పార్క్‌ హోటల్‌ వెనక ఈ నమూనా ఆలయాన్ని తీర్చిదిద్దారు. మే 22 నుంచి భక్తులకు బాల రాముడి దర్శనానికి ఒక్కొక్కరికి రూ.50 టిక్కెట్టు ధర నిర్ణయించారు. దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించారు. దీంతో భక్తజనం బాల రాముడిని చూడడానికి పోటెత్తేవారు. రోజుకు వేల సంఖ్యలో జనం రావడంతో నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ సంపాదన మొదలెట్టారు. వారాంతాల్లోను, సెలవు రోజుల్లోనూ బీచ్‌ రోడ్డులో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరేవి. ఇక్కడ ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ఇలా అడ్డగోలుగా ఆదాయం వచ్చి పడడంతో నిర్వాహకులు మరింత అత్యాశకు పోయి ఈనెల 29న సీతారాముల కల్యాణం జరిపించాలని నిర్ణయించారు. ఈ కల్యాణానికి భద్రాచలం నుంచి ఆస్థాన పండితులను తీసుకొస్తున్నామని, కల్యాణంలో పాల్గొనే దంపతులకు రూ.2,999 టిక్కెట్టు ధర నిర్ణయించారు. ఈ సంగతిని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈనెల 9న జరిగిన సింహాచలం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు తెలిసేలా ఐదు వేల పోస్టర్లను, 250కి పైగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిని విశాఖ నగరమంతటా అతికించారు. ఈ సీతారాముల కల్యాణానికి భద్రాచలం ఆస్థాన పండితులు వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై నాలుగు రోజుల క్రితం ఆ దేవస్థానం ఈవో సీరియస్‌గా స్పందించడంతో ఈ దోపిడీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తమ దేవస్థానం నుంచి వైజాగ్‌ అయోధ్య నమూనా ఆలయంలో సీతారాముల కల్యాణానికి ఎవరూ రావడం లేదని, తమ పేరు చెప్పి సొమ్ము వసూలు చేస్తున్న నిర్వాహకులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని విశాఖ సీపీ, త్రీటౌన్‌ ఎస్‌హెచ్‌వో, దేవదాయశాఖ ఉన్నతాధికారులకు ఈవో ఫిర్యాదు చేశారు.


ఖాళీగా ఉన్న బారికేడ్లు

తొలుత పోలీసుల మీనమేషాలు..
భద్రాచలం దేవస్థానం ఈవో ఫిర్యాదుపై పోలీసులు తొలుత మీనమేషాలు లెక్కించారు. అయోధ్య నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసిన వారిలో బీజేపీ నేత ఒకరున్నారన్న ప్రచారం ఉంది. దీంతో పోలీసులు కేసు నమోదులో తాత్సారం చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.. కానీ ఎవరినీ అరెస్టు చేయలేదు. ‘విశాఖలో నమూనా అయోధ్య రామమందిరం నిర్వాహకులపై భద్రాచలం ఈవో ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నాం. ముగ్గురిపై కేసు రిజిస్టరు చేశాం. అన్ని కోణాల్లో విచారించి త్వరలో తగిన చర్యలు తీసుకుంటాం. పోస్టర్స్, బ్యానర్స్, పాంప్లెట్స్, సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన పోస్టులను పరిశీలిస్తాం. నిందితుల వివరణనూ తీసుకుంటాం. వాస్తవాలనూ తెలుసుకుంటాం.’ అని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ శుక్రవారం మీడియాకు చెప్పారు.

సీతారాముల కల్యాణం టిక్కెట్టు రూ.2,999గా ముద్రించిన టిక్కెట్టు

టిక్కెట్టు రద్దు చేసి.. అపై మూసివేసి..
పోలీసులు కేసు నమోదుతో నిర్వాహకులు అయోధ్య నమూనా ఆలయంలోకి వెళ్లేందుకు వసూలు చేస్తున్న రూ.50 టిక్కెట్టును శుక్రవారం నుంచి రద్దు చేశారు. దీంతో ఆలయంలో బాలరాముడిని దర్శించుకునేందుకు అందరినీ ఉచితంగా పంపించారు. అక్కడ బారికేడ్లనూ తొలగించారు. రాత్రి వేళ వెలుగులు జిమ్మే విద్యుద్దీపాలను తీసేశారు. కేవలం బాలరాముడు కనిపించేలా మాత్రమే లైట్లను ఉంచారు. ఇన్నాళ్లూ బౌన్సర్లతో హంగామా చేయించిన నిర్వాహకులు పత్తా లేకుండా పోయారు. వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసి శుక్రవారం భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. శనివారం అయోధ్య రాముడి సెట్‌ (రెప్లికా)ను మూసివేశారు. దీంతో రెండు నెలలపాటు సాగిన దోపిడీకి తెరపడినట్టయింది. వివాదానికి కేంద్రబిందువైన 29న జరిగే సీతారామ కల్యాణం కూడా రద్దయింది. ఈ అయోధ్య రెప్లికాకు ఆగస్టు రెండో తేదీ వరకు అనుమతి ఉన్నప్పటికీ వారం రోజులు ముందే మూతపడింది. దీని నిర్వాహకులు హైదరాబాద్‌లోని ఓ కేంద్ర మంత్రిని కలిసి ఈ వివాదంలె తమకు అండగా నిలవాలని కోరినా ఫలితం లేకపోవడంతో విధిలేక ఈ సెట్‌ను మూసివేశారని తెలుస్తోంది.
దుర్గా ప్రసాద్‌ మోసం చేశాడు..
విశాఖలోని ఆయోధ్య ఆలయ నమూనా వివాదం నేపథ్యంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరానికి చెందిన గణేష్‌ అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. నిర్వాహకుల్లో ముఖ్యుడైన వంగలపూడి దుర్గా ప్రసాద్‌.. కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్‌లో రామమందిరం సెట్‌ ఏర్పాటు చేస్తున్నానని చెప్పి రూ.లక్షలు వసూలు చేసి పత్తా లేకుండా పోయాడని తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు. అందులో తానెలా మోసపోయిందీ వివరించాడు. దీనిపై కాకినాడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. దుర్గాప్రసాద్‌పై కాకినాడ పోలీసులు కూడా ఎలాంటి చర్యలు చేపడ్తారో చూడాలి.
Read More
Next Story