దొరపొగాకు రైతుకు కేంద్రం పొగ
x

దొరపొగాకు రైతుకు కేంద్రం 'పొగ'

సిగరెట్ల ధర పెంచి మా కడుపు కొడతారా? రోడ్డెక్కిన పొగాకు రైతులు


“మమ్మల్ని పొగాకు సాగు చేయమన్నారు, అనుమతులు ఇచ్చారు, బ్యారన్ కి(పొగాకును క్యూరింగ్ చేసే ఏరియా) ఎంత సాగు చేయాలో చెప్పారు, ఇప్పుడేమో పన్నులు పెంచాం, పంటను కొంటే కొంటాం లేకుంటే లేదంటే ఎలా? సాగుచేసి మేము చేతులు కాల్చుకోవాల్నా? పన్నులు పెంచినా నష్టం మాకే... ధర పడిపోయినా బాధా మాకేనా? మాకెందుకు వేస్తున్నారు ఈ శిక్ష” అని ప్రశ్నించారు ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన బి. రాములయ్య అనే పొగాకు రైతు.

కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై విధించిన భారీ పన్నులతో తమ జీవితాలు గుల్లవుతాయని ఆంధ్రప్రదేశ్‌ పొగాకు రైతులు వాపోతున్నారు. పంట సాగు పూర్తయి పొగాకు మార్కెట్ కు వచ్చే దశలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తమకు తలపోటేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రైతుల జీవనోపాధికి భంగం కలగకుండా రెవెన్యూ-పన్నుల విధానాలను మార్చాలని డిమాండ్ చేస్తూ పొగాకు సాగు చేసే కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల రైతులు రోడ్డెక్కారు. రాస్తా రోకోలు, ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు.
గత నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, సిగరెట్ల పొడవు ఆధారంగా వెయ్యి సిగరెట్లకు రూ.2,050 నుంచి రూ.8,500 వరకు ఎక్సైజ్ డ్యూటీని నోటిఫై చేసింది. ఈ కొత్త పన్నులు 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
దీనివల్ల సిగరెట్ట పొడవును బట్టి రేట్లు పెరుగుతాయి. ఉదాహరణకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ సైజు సిగరెట్ ప్రస్తుతం ఒక్కొక్కటి రిటైల్ గా రూ.18 ఉంటే ఫిబ్రవరి తర్వాత అది రూ.60,70 మధ్య ఉంటుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఇప్పుడు పది సిగరెట్ల ప్యాకెట్ రూ.180 ఉంటే మున్ముందు 720 రూపాయలవుతుంది.

ఇది సిగరెట్లలో ఉపయోగించే ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా (FCV) పొగాకు రైతులపై వివక్షేనని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్స్ (FAIFA) ఆరోపించింది.
కిలో ప్రాతిపదికన సిగరెట్లపై విధించే పన్నులు రకరకాలుగా ఉన్నాయని FAIFA తెలిపింది. బీడీలపై విధించే పన్నుల కంటే 50 రెట్లు ఎక్కువగా సిగరెట్ల వినియోగంపై పడనుంది.
“FCV పొగాకు ఆధారిత తుది ఉత్పత్తులపై ఒక్కో డోస్‌కు రూ.6కిపైగా పన్ను ఉంటుంది. అదే సమయంలో బీడీలు, చూయింగ్ టొబాకో ఉత్పత్తులపై ఒక్కో డోస్‌కు ఒక పైసా కూడా పన్ను లేదు,” అని FAIFA వెల్లడించింది.
ఈ నోటిఫికేషన్‌ను Chewing Tobacco, Jarda Scented Tobacco and Gutkha Packing Machines (Capacity Determination and Collection of Duty) Rules, 2026 కింద జారీ చేశారు. ఇదే సమయంలో GST పరిహార సెస్ ముగింపు తేదీగా ఫిబ్రవరి 1ను ప్రభుత్వం ప్రకటించింది. అదే తేదీ నుంచి కొత్త పొగాకు పన్నుల విధానం అమలులోకి రానుంది.
పన్నుల పెంపుపై FAIFA తీవ్ర అభ్యంతరం...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని పొగాకు రైతులను ప్రాతినిధ్యం వహిస్తున్నFAIFA ఈ పన్నుల పెంపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వం ఇచ్చిన రెవెన్యూ-న్యూట్రల్ పన్నుల హామీలకు విరుద్ధమని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 పొగాకు సాగు విస్తీర్ణం...
ఇండియన్ టొబాకో బోర్డు 2025-26 పంట కాలానికి పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని సుమారు 142 మిలియన్ కిలోలుగా నిర్ణయించింది. ఇది 2024-25 సీజన్‌లోని 167 మిలియన్ కిలోల లక్ష్యంతో పోలిస్తే సుమారు 18% తగ్గినట్టు.

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లో వర్జీనియా పొగాకు సాగుకు ప్రధాన కేంద్రాలు. 2025-2026 రబీ సీజన్ (అక్టోబర్/నవంబర్ నుంచి ఫిబ్రవరి/మార్చి వరకు)లో 2.45 లక్షల ఎకరాలలో పొగాకు సాగయింది.
సిగరెట్ల తయారీలో ఉపయోగించే ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా (FCV) పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. వర్జీనియా పొగాకును బ్యారన్లలో కాల్చి (క్యూరింగ్) నాణ్యతను బట్టి వర్గీకరిస్తారు. రాజమండ్రిలోని ICAR–సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CTRI) రైతులకు పరిశోధన, సాంకేతిక సలహాలు, విస్తరణ సేవలు అందిస్తోంది.
జాతీయ స్థాయిలో పాత్ర
భారతదేశ మొత్తం పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామి. ప్రపంచంలో ప్రధాన పొగాకు ఎగుమతి దేశాల్లో ఇండియా ఒకటి. పొగాకు సాగు, క్యూరింగ్, వేలం వ్యవస్థల ద్వారా లక్షలాది కుటుంబాలకు జీవనాధారం. అయితే ఇటీవలి కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాలు, పర్యావరణ ప్రభావంతో పొగాకు సాగు మనుగడపై నీలినీడలు అలుముకున్నాయి.
ప్రభుత్వ నిర్ణయం పెద్ద షాక్...
రైతుల జీవనోపాధి ఖర్చుపై భారీ పన్నుల పెంపు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అని రైతు సంఘాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. పన్నుల పెంపుతో రిటైల్ ధరలు పెరిగి, చట్టబద్ధ సిగరెట్ల వినియోగం తగ్గే ప్రమాదం ఉందని ఏపీ రైతు సంఘం హెచ్చరించింది. దీని ప్రభావం దేశీయంగా పండే పొగాకు డిమాండ్‌పై పడుతుందని, ఫలితంగా పంట మార్కెట్లో అధిక నిల్వలు ఏర్పడే పరిస్థితి తలెత్తవచ్చని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ అన్నారు.
FAIFA అంచనాల ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద అక్రమ సిగరెట్ మార్కెట్‌గా మారింది. పన్నుల కారణంగా ధరలు పెరిగితే, చట్టబద్ధ ఉత్పత్తులు ఖరీదవుతాయి. అక్రమ ఉత్పత్తులతో ధర వ్యత్యాసం మరింత పెరుగుతుందని హెచ్చరించింది. మొత్తం వినియోగంలో దాదాపు 26 శాతం అక్రమ ఉత్పత్తులేనని తెలిపింది. దీని వల్ల అమలు చర్యలు బలహీనపడతాయని, ప్రభుత్వ ఆదాయానికి కూడా నష్టం కలుగుతుందని పేర్కొంది.
ఒత్తిడిలో టుబాకో రంగం...
గత పదేళ్లుగా FCV పొగాకు ఉత్పత్తి పెద్దగా పెరగలేదని FAIFA గణాంకాలు చెబుతున్నాయి. 2013–14లో వేలం ద్వారా విక్రయించిన పొగాకు పరిమాణం 315.95 మిలియన్ కిలోలు కాగా, 2023–24లో అది 304.21 మిలియన్ కిలోలకు తగ్గిపోయింది. సాగు విస్తీర్ణం కూడా 2013–14లో 2,21,385 హెక్టార్ల నుంచి 2023–24లో 1,22,257 హెక్టార్లకు తగ్గింది.
దీని వల్ల వ్యవసాయం, వేలం వ్యవస్థల్లో కలిపి సుమారు 3.5 కోట్ల పనిదినాలు (మాన్-డేస్) నష్టం జరిగినట్లు FAIFA అంచనా వేసింది.
ఇన్‌పుట్ ఖర్చులు (ఉత్పత్తి వ్యయం) పెరగడం రైతుల కష్టాలు పెరిగాయి. 2025 ప్రారంభం నుంచి ఎరువుల ధరలు 15 శాతం పెరిగాయి. డై-అమ్మోనియం ఫాస్ఫేట్ ధరలు 23 శాతం పెరిగాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ కూలీల నోటిఫైడ్ వేతనాలు 7 శాతం పెరిగాయి.
ఈ పరిస్థితుల దృష్ట్యా, ఎక్సైజ్ డ్యూటీని వెనక్కి తీసుకోవాలని, రైతులకు మద్దతు ఇచ్చేలా రెవెన్యూ-న్యూట్రల్ పన్నుల విధానాన్ని అమలు చేయాలని, అక్రమ రవాణాను నిరుత్సాహపరిచే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుడు జమలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ధర పడితే నష్టం మాకేగా?
పన్నుల పెంపు వల్ల తుది ఉత్పత్తుల ధరలు పెరిగి, అమ్మకాలు తగ్గుతాయని రైతులు భయపడుతున్నారు. దాని ప్రభావం నేరుగా పొగాకు కొనుగోళ్లపై పడుతుందని, చివరికి నష్టమంతా రైతులకే పరిమితం అవుతుందని పల్నాడు జిల్లాకు చెందిన రైతు బత్తిన కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం పరిధిలోని టుబాకో బోర్డు అనుమతించిన మేరకు పంట సాగు చేసినా అమ్ముకోబోయే సమయానికి ఏదో ఒక సమస్య తెచ్చి పెట్టి రైతులకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు.

భారతదేశంలో పొగాకు పన్నుల విధానం ఏపీ, కర్ణాటకల FCV పొగాకు రైతులకే ఎక్కువ భారంగా మారిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
గత సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన GST 2.0పై రైతులు నమ్మకం పెట్టుకున్నారు. రిటైల్ ధరపై 40 శాతం GST విధిస్తామని, మొత్తం పన్ను భారాన్ని మార్చబోమని చెప్పిన హామీపై ఆధారపడి పొగాకు సాగుకు పూనుకున్నామని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా భారీ పన్నుల పెంపు ప్రకటించడం రైతుల జీవనాధారాలపై నేరుగా దెబ్బ అని రైతు నాయకుడు కేవీవీ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతుల సమస్య ఇప్పుడు జాతీయ స్థాయి చర్చగా మారింది. రాష్ట్రంలో పొగాకు సాగు విస్తీర్ణం తగ్గుతున్నప్పటికీ, FCV పొగాకు మీద పన్నుల భారం పెరుగుతుండటమే ఈ ఆందోళనకు కేంద్రంగా మారింది.
Read More
Next Story