మొంథా తుపాను బాధిత రైతుల పరిస్థితి దారుణం: వైఎస్ జగన్
x
రైతుతో మాట్లాడుతున్న మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

మొంథా తుపాను బాధిత రైతుల పరిస్థితి దారుణం: వైఎస్ జగన్

చంద్రబాబు లండన్‌లో, లోకేష్ ముంబైలో మ్యాచ్ చూస్తున్నారు. పెడనలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో విమర్శలు.


మొంథా తుపాను వల్ల పంటలు మునిగిపోయి ఆర్థిక నష్టానికి గురైన రైతులను పరామర్శించేందుకు పెడన, పెనమలూరు, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పర్యటన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. తుపాను బారిన పడిన 25 జిల్లాల్లోని 15 లక్షల ఎకరాల పంటల నష్టానికి పరిహారం ఇవ్వకుండా రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.


తుపాను వల్ల గింజరాలిన వరి కంకులు పరిశీలిస్తున్న మాజీ సీఎం జగన్

ప్రభుత్వ నిర్లక్ష్యం, మోసాలు

రామరాజుపాలెం, ఆకుమర్రు లాకు ప్రాంతాల్లో నేలకొరిగిన వరి పొలాలను పరిశీలించిన జగన్, రైతులతో మాట్లాడి వారి ఆవేదనలు విన్నారు. "కాసేపట్లో మొంథా తుపాను ప్రభావం 25 జిల్లాల్లో కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల పంటలు నాశనమయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పంట నష్ట పరిహారం, ఇన్సూరెన్స్, పెట్టుబడి సబ్సిడీలు ఏవీ రైతులకు అందలేదు" అని ఆయన ఆరోపించారు. పంట నష్టం పరిశీలనపై కృష్ణా కలెక్టరేట్ అక్టోబర్ 30న జారీ చేసిన ఆర్డర్‌ను జగన్ 'అసాధ్యమైనది' అని విమర్శించారు. "ఒకే రోజులో (అక్టోబర్ 31 వరకు) నష్టపోయిన పంటల వివరాలు, సోషల్ ఆడిట్ పూర్తి చేయాలని ఆదేశించారు. రిపోర్టులు సమర్పించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది ఫీల్డ్‌లో పరిశీలించకుండా కవరప్ చేయడమే" అని అని జగన్ అన్నారు.

వైఎస్సార్సీపీ పాలనతో పోలిక...

ముఖ్యమంత్రిగా తన కాలంలో పంట నష్ట వివరాల సేకరణకు కలెక్టర్లకు నిధులు కేటాయించి 10 రోజుల సమయం ఇచ్చామని, తప్పులు జరిగితే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించామని జగన్ గుర్తు చేశారు. "సీఎం తాను పరిశీలించి రైతులతో మాట్లాడే వారు. రైతులకు విశ్వాసం ఏర్పడింది. ఇప్పుడు అది పోయింది" అని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 85 లక్షల మంది రైతులకు ఉచిత పంట బీమా అమలు చేశామని, ఇప్పుడు 19 లక్షల మందికి మాత్రమే పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలు, సబ్సిడీలను రద్దు చేసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.


తుపాన్ కు పాడైన వరి గురించి జగన్ కు వివరిస్తున్న పెడన వైఎస్సార్సీపీ ఇన్ చార్జ్ రాము

ముఖ్యమంత్రి, ఆయన కుమారుడిపై విమర్శలు

రైతులు కష్టాల్లో ఉంటున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్‌లో పర్యటించారని, మంత్రి నారా లోకేష్ ముంబైలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. "పంట నష్టం వివరాలు సేకరణ అంటే ఏమిటో చంద్రబాబు తెలుసా? అధికారులు పొలాలకు వెళ్లి పరిశీలించాలి" అని ఆయన అన్నారు. గత 18 నెలల్లో 16 తీవ్ర వాతావరణ ఘటనలు జరిగినా ప్రభుత్వం రైతులకు సహాయం చేయలేదని ఆరోపించారు.

రైతులకు భరోసా

పంట నష్టాన్ని న్యాయమైన పరిశీలన చేయడం ద్వారా తగిన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. పర్యటన సమయంలో భారీ గా ఎదురొచ్చిన రైతులు, మహిళలు ఘనంగా స్వాగతం చేశారు. పోలీసులు ర్యాలీలు, సమావేశాలకు అనుమతి ఇవ్వకపోవడంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటన ద్వారా రైతుల సమస్యలు ప్రజల ముందుంచి, కూటమి ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచాలనే జగన్ నిర్ణయించారు.

Read More
Next Story