హతవిధీ.. రుషికొండ ప్యాలెస్‌ శిథిలమవుతోంది!
x
కూలిన స్లాబు పైకప్పు వద్ద పవన్‌ కల్యాణ్‌

హతవిధీ.. రుషికొండ ప్యాలెస్‌ శిథిలమవుతోంది!

విశాఖ రుషికొండపై వందల కోట్ల రూపాయలు పోసి నిర్మించిన కలల సౌధం శిథిలమవుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈ ప్యాలెస్‌ను సందర్శించిప్పుడు ఇది వెలుగు చూసింది.

రుషికొండ ప్యాలెస్‌.. రెండేళ్ల నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరిది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విశాఖ సాగరతీరంలోని రుషికొండపై అందాల సౌధాన్ని నిర్మించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను సైతం దాని ఛాయలకు రాకుండా ఆ నిర్మాణాన్ని పూర్తి చేశారు. పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్టులను తొలగించి రూ.453 కోట్లు వెచ్చించి ఈ ప్యాలెస్‌ను అత్యంత సుందరంగా కట్టారు. విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిగా చేసి,ఈ రాజప్రాసాదం నుంచి పాలన సాగించాలన్న లక్ష్యంతో దీనికి రూపకల్పన చేశారు. అయితే అనుకున్నది ఒకటి.. అయిందొకటి అన్నట్టు 2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలవడంతో జగన్‌ సీఎం పదవిని కోల్పోయారు. వైసీపీ స్థానంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రుషికొండ ప్యాలెస్‌ కథాకమామిషు ఏమిటో తెలుసుకోవడానికి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లు తొలిసారిగా ఏడాది క్రితం అందులోకి అడుగు పెట్టారు. ఇంద్ర భవనాన్ని తలపించే ఆ కట్టడాలను చూసి వీరు కళ్లు తేలేశారు. ఈ భవన సముదాయాన్ని ఏం చేయాలన్న దానిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్, పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్‌లు అప్పట్లోనే చెప్పారు. దీనిపై ప్రజలు, నిపుణులు, మేథావుల అభిప్రాయాన్ని కూడా తీసుకుంటామన్నారు. ప్రజల సందర్శనకు అనుమతించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. కానీ ఏడాదిగా ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదు. అటువైపు ఎవరూ తొంగి చూడనూ లేదు.


కాన్ఫరెన్స్‌ హాలులో కూలిన సీలింగ్‌ పెచ్చులను చూస్తున్న పవన్‌

శిథిల స్థితికి చేరిన ప్యాలెస్‌..

సేనతో సేనాని కార్యక్రమానికి విశాఖ వచ్చిన పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం ఉదయం రుషికొండ ప్యాలెస్‌కు జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని వెళ్లారు. ఆ ప్రాంగణమంతా కలియదిరిగారు. ఆయా నిర్మాణాలను నిశితంగా పరిశీలించారు. తనకొచ్చిన సందేహాలను పర్యాటకశాఖ అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. అలా ఒక్కో బ్లాకును సందర్శిస్తున్న సమయంలో పవన్‌కు అప్పటి సీఎంవోకు కేటాయించిన బ్లాకులో రెండు మూడు చోట్ల శ్లాబుల పెచ్చులు ఊడి పడిపోయిన వైనాన్ని చూసి షాకయ్యారు. ఇన్ని కోట్లు వెచ్చించి నిర్మాణం అప్పుడే పెచ్చులూడడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ప్యాలెస్‌ నిర్మాణ నాణ్యతను పరీక్షించి నివేదించాలని అధికారులను ఆదేశించారు.

ఓ గదిలో పెచ్చులూడిన సీలింగ్‌

ఈ దుస్థితికి కారణమెవరు?
రుషికొండ ప్యాలెస్‌ ఈ దుస్థితికి చేరుకోవడానికి కారణం ఎవరన్నది చర్చనీయాంశమవుతోంది. కూటమి పాలకులు ఏడాది నుంచి ఈ భవన సముదాయాన్ని ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారే తప్ప ఇప్పటివరకు సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. దీనిపై పూర్తిస్థాయి సమీక్ష కూడా నిర్వహించలేదు. దీని నిర్వహణకు నెలకు దాదాపు రూ.కోటి ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేశారు. నిర్వహణ లేమితో లోపల భవనాల పరిస్థితి ఎలా ఉందో కూడా పరిశీలించలేదు. అలా పరిశీలించి ఉంటే శ్లాబుల పెచ్చులూడిపోతున్న విషయం తెలిసుండేది. ఇలా నిర్లక్ష్యంతో రూ.వందల కోట్లు వెచ్చించిన ఈ కలల సౌధాన్ని గాలికొదిలేశారు. కూటమి ప్రభుత్వం కనీస నిర్వహణను చేపట్టినా ఈ ప్యాలెస్‌కు ఈ గతి పట్టి ఉండేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రుషికొండ ప్యాలెస్‌ను పరిశీలిస్తున్న పవన్‌

దేనికెంత ఖర్చు చేశారు? పవన్‌
రుషికొండ ప్యాలెస్‌ సందర్శన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆ భవనంలోని ఓ కాన్ఫరెన్స్‌ హాలులో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్,, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టూరిజం అధికారులతో సమావేశమయ్యారు. ఈ భవన నిర్మాణంలో దేనికెంత ఖర్చు చేశారు? అని పర్యాటక శాఖ అధికారులను అడిగారు. ‘తొలుత హరిత రిసార్ట్సు అభివృద్ధి పేరిట దీనిని కూలగొట్టారు. ఆ తర్వాత 9.88 ఎకరాల్లో ఏడు భవనాల నిర్మాణానికి సీఆర్‌జెడ్‌ అనుమతిచ్చింది. కానీ 14 వేల అడుగుల్లో నాలుగు (విజయనగర, కళింగ, గజపతి, వెంగీ) బ్లాకులు నిర్మించారు. తొలి, మలి దశలకు రూ.164 కోట్లు మంజూరు చేశారు. ఆ తర్వాత దశల వారీగా రూ.543 కోట్లు వెచ్చించారు. ఇందులో ఇంటీరియర్, ఫర్నిచరు, అత్యాధునిక సదుపాయాలు, సౌకర్యాలు, ల్యాండ్‌ స్కేపింగ్, సబ్‌ స్టేషన్‌ వంటి వాటికి ఖర్చు చేశారు’ అని పర్యాటకశాఖ అధికారులు పవన్‌కు వివరించారు.

రుషికొండ ప్యాలెస్‌ను పరిశీలిస్తున్న పవన్‌

ఆదాయం వచ్చే మార్గాలు చెప్పండి..
రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేయాలన్న దానిపై సత్వరమే నిర్ణయం తీసుకోకపోతే భవనాలకు నష్టం వాటిల్లుతుందని పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. పర్యాటకుల తాకిడికంటే ఆదాయం వచ్చే మార్గాలను సూచిస్తే దానిని సీఎంకు నివేదించవచ్చని జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పారు. ‘దీనిపై ఓ తీర్మానం చేయాలి. ఈ ప్యాలెస్‌ను అమ్మకూడదు. ఎవరికీ తనఖాలు పెట్టకూడదు. ఇందులో ఎగ్జిబిషన్లు, మీటింగ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కాన్ఫరెన్సులు (మైస్‌ డెస్టినేషన్‌)గా కింద చేయాలన్న ప్రతిపాదన ఉంది. దీనిపై సీఎంకు ప్రతిపాదనలు సమర్పిద్దాం. రిసార్ట్సు ఉన్నప్పుడు పర్యాటక శాఖకు ఏడాదికి రూ.ఏడెనిమిది కోట్ల ఆదాయం వచ్చేది. పర్యాటక సీజను ముగియక ముందే డిసెంబరు నాటికి దీనిని వినియోగంలోకి తేవాలి. రూ.453 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ ప్యాలెస్‌లో పెచ్చులూడి పడిపోవడం బాధాకరం. ఒక ప్రైవేటు వ్యక్తి రూ.453 కోట్ల ఒక పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం ఆశిస్తాడు అనే కోణంలో ఆలోచించాలి. దీని నాణ్యతపై సేఫ్టీ ఆడిట్‌ చేయించాలి. కేవలం నాలుగు బ్లాకుల నిర్మాణానికే రూ.453 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన మూడు బ్లాకులకు మరో రూ.300 కోట్లు ఖర్చు చేసేవారేమో? ఈ రుషికొండ ప్యాలెస్‌ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించారు’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. అంతకుముందు రుషికొండ ప్యాలెస్‌లో ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో ఫోటోలు దిగారు.
Read More
Next Story