18మందిని మింగిన ఈ ఫార్మా కంపెనీ లోగుట్టు ఇదీ! ఫ్యాక్టరీ ఎవరిదంటే?
విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా (Escientia) ఫార్మా కంపెనీ మూలాలు అమెరికాలో తేలాయి. ఈ కంపెనీ పెట్టింది మనవాళ్లేనని తేలింది.
ఊపిరి నింపాల్సిన ఫార్మా కంపెనీలు ఊపిరి తీస్తున్నాయి. ప్రాణాలు కాపాడాల్సిన ఔషధాలు ప్రాణాలకు మీదకు తెస్తున్నాయి. విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా (Escientia) ఫార్మా కంపెనీ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 18కి చేరింది. మరో ముగ్గురు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకో 40 మంది వరకు 60 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో పోరాడుతున్నారు. ఈనేపథ్యంలో అసలీ కంపెనీ ఎవరిదనే దానిపై అటు అధికారులు ఇటు ప్రజలు ఆరా తీస్తున్నారు. కంపెనీ యజమానులెవరనే దాన్ని తొవ్వితీస్తోంది సోషల్ మీడియా.
చిత్రమేమంటే 18మంది పొట్టనబెట్టుకున్న ఈ ఫార్మా కంపెనీ మూలాలు కూడా అమెరికాలోనే ఉన్నాయి. దీన్ని పెట్టింది అమెరికాలో స్థిరపడిన తెలుగువారు. అమెరికాలో ఓ కంపెనీ పెట్టాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వీరు విశాఖపట్నం సెజ్ లో ఇంత హడావిడిగా అరకొర జాగ్రత్తలతో ఎలా పెట్టారనేది ఇప్పుడు అమెరికాలోనూ చర్చనీయాంశంగా ఉంది. ఇటువంటి ప్రమాదమే అమెరికాలో జరిగి ఉంటే ఉన్న ఆస్తులు అమ్మినా బయటపడకపోగా మరికొన్నేళ్లు జైళ్లలో గడపాల్సి వచ్చేది.
ఇదీ ఈ కంపెనీ చరిత్ర...
ఈ కంపెనీ డైరెక్టర్లు లింక్డెన్ లో పెట్టిన వివరాల ప్రకారం ఎసెన్షియా ఫార్మా, బయోటెక్ కంపెనీ 2007లో అమెరికాలో ప్రారంభమైంది. ఆధునిక సైన్స్, ఇంజనీరింగ్ ఔషధాల తయారీలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా మందులు తయారు చేస్తోంది. ప్రాసెసింగ్ లో మంచి పేరుంది. ఫార్మాస్యూటికల్ తయారీలో అనుభవం ఉంది. మందుల్ని తయారు చేయడంతో పాటు పంపిణీ చేసే కట్టుదిట్టమైన వ్యవస్థలూ ఉన్నాయి. బోలెడన్ని బయో కంపెనీలతో సత్ సంబంధాలు ఉన్నాయి. అమెరికన్ టెక్నాలజీ ఆధారిత భాగస్వామి. ఆ టెక్నాలజీ సాయంతోనే ఔషధాలు తయారు చేస్తోంది. డాక్టర్ యాదగిరి రెడ్డి పెండ్రి తన కుటుంబ సభ్యుడైన మరో వ్యక్తితో కలిసి ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నారు. 15 ఏళ్లుగా కంపెనీని విశ్వవ్యాప్తంగా చేశారు. సరికొత్త ఔషధాల తయారీ రంగంలో భాగస్వామిగా ఉన్నారు. కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ గా కిరణ్ రెడ్డి పెండ్రి ఉన్నారు. వ్యాపార లావాదేవీలను ఈయన చూస్తుంటారని చెబుతారు. ఇప్పుడు శ్రీనివాసరావు కోరాడ సీఎఫ్ఓగా ఉన్నారు.
కనెక్టికట్ లో ప్రధాన కార్యాలయం...
అమెరికాలోని కనెక్టికట్ స్టేట్ సౌత్ విండ్సర్ లో ఎసెన్షియా గ్లోబల్ ఆఫీసు, పరిశోధన, ప్రయోగశాలలు ఉన్నాయి. దీని బ్రాంచీలు హైదరాబాద్, విశాఖపట్నం (అచ్యుతాపురం సెజ్)లో ఉన్నాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలు, తయారీ యూనిట్లు ఇక్కడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఔషధ తయారీ యూనిట్ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైందని చెబుతున్నారు. ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీలో నూతన ఆవిష్కర్తలను ఇక్కడ చేస్తుంటారట. మనుషులపై ప్రయోగాలు చేసి సరికొత్త మందులు కనిపెడుతుంటారు. మనుషుల జీన్ ను బట్టి మందులు (వ్యక్తిగత జెనోమిక్స్) వంటి 21వ శతాబ్దపు రోగాలకు మందులు ఈ సంస్థ తయారీ చేస్తుంది.
భద్రతకు పెద్ద పీటంటే ఇదేనా...
ఆటోమేషన్ తో పాటు భద్రత, పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్నట్టు కూడా కంపెనీ ప్రొఫైల్ లో ఉంది. జాతీయ భద్రతా ప్రమాణాలు పాటించకపోతే అమెరికాలో ఏమి జరుగుతుందో అనుభవజ్ఞులైన కంపెనీ నిర్వాహకులకు తెలియని కాదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అరకొర సౌకర్యాలున్నా ఆ కంపెనీకి పడే జరిమానా అంతా ఇంత కాదు. అందుకే చాలా కార్పొరేట్ సంస్థలు తమ కార్యాలయాలను, రీసెర్చ్ యూనిట్లను అమెరికాలో పెట్టుకుని తయారీ పనిని పేద దేశాలైన ఇండియా వంటి చోట్ల ఏర్పాటు చేస్తుంటాయి. ఇటువంటి ప్రాంతాలలో పనోళ్లు చాలా చౌవకగా దొరుకుతారు. ప్రభుత్వాలు స్థలాలు ఇస్తాయి. కాణీ ఖర్చు లేకుండా కనీస వసతులు కల్పిస్తాయి. అదే అమెరికాలో అయితే ప్రతిదీ కొనుక్కోవాల్సిందే. కమర్షియల్ ఏరియాలో నువ్వు కొనుక్కున్న భవంతిలో కరెంటు వైరు మార్చినా మామూలు దానికన్నా మూడింతల ఖరీదు కట్టాల్సిందే. అందుకే పేదసాద దేశాలలో పరిశ్రమలు పెడుతుంటారు. మనకు చాలా ఉదారంగా ఉపాధి చూపుతున్నట్టు చెబుతుంటారు. ఒకవేళ ఇక్కడ ప్రాణాలు పోయినా పెద్ద ఖరీదు కట్టాల్సిన పని ఉండదు. ( ఉదాహరణ యూనియన్ కార్బైడ్ కేసే నిదర్శనం. 30 ఏళ్లు దాటినా ఈ కేసులో బాధితులకు ఇంకా పరిహారం అందలేదు. అదే అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చిన ఘటనలో బాధితులందరికీ మూడేళ్లలోపు పరిహారం అందింది. అట్లుంటది మరి). ఇప్పుడు చచ్చిపోయిన మనోళ్లకి ఎప్పుడు పరిహారం అందుతుందో చూడాలి. సుమారు 22 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి మరో 22 కోట్ల రూపాయల షేర్లు అమ్మి మొత్తం 42 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం సెజ్ లో నామమాత్రపు ధరకి 40 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది. ఈవేళ మార్కెట్ రేటు దానికి ఐదింతలు అయింది.
భద్రతకు అంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఘనంగా చెప్పుకున్న ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఫ్యాక్టరీలో ఇటీవలి కాలంలో రెండు స్వల్ప ప్రమాదాలు జరిగాయి. అయితే అవేవీ బయటకు రాలేదు. ఇంటర్మీడియట్ కెమికల్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలను (ఏపీఐ) ఉత్పత్తి చేసే ఈ ఫ్యాక్టరీ 2019 ఏప్రిల్ లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) అచ్యుతాపురం సెజ్ లో ఉంది.
ప్రస్తుతం జరిగిన ప్రమాదంపై దర్యాప్తు జరుగుతుందని, తొందర్లో బాధితులందరికీ న్యాయం చేస్తామని అటు ముఖ్యమంత్రి మొదలు ఇటు కార్మిక శాఖ మంత్రి వరకు అందరూ చెబుతున్నా ప్రమాదం జరిగినపుడు హడావిడి చేసే బదులు కనీసం అప్పుడప్పుడైనా భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయని కార్మిక శాఖాధికారులు ఎందుకు తనిఖీ చేయరని ప్రశ్నించారు మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది ఎం.శేషగిరిరావు. దట్టమైన పొగ కారణంగా రెస్క్యూ టీమ్‌లు ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి ప్రవేశించలేకపోతున్నాయని కార్మిక శాఖ మంత్రి వి. సుభాష్ తెలిపారు.
ఈ కంపెనీ డైరెక్టర్లు ఎవరంటే...
అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఏర్పాటైన ఎసెన్షియా సంస్థకు యాదగిరి ఆర్ పెండ్రి వ్యవస్థాపక ఛైర్మన్ కమ్ సీఇవో. ఇప్పుడు అంటే 2021 మార్చి ఒకటి నుంచి శ్రీనివాసరావు కోరాడ సీఎఫ్ఓగా ఉన్నారు. 2013 ఫిబ్రవరి 27 నుంచి యాదగిరి ఆర్ పెండ్రి డైరెక్టర్, పెండ్రి కిరణ్ రెడ్డి, 2023 జూలై ఆరు నుంచి వివేక్ వసంత్ సావే, 2020 నవంబర్ 18 నుంచి దండు చక్రధర్, 2023 జూలై 6 నుంచి అజిత్ అలెగ్జాండర్ జార్జ్ డైరెక్టర్లుగా ఉన్నారు. వీళ్లందరూ వేర్వేరు కంపెనీలలో కూడా డైరెక్టర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. అజిత్ అలెగ్జాండర్ జార్జ్ అమెరికలో పుట్టిన భారతీయుడని సమాచారం.
గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే...
ఎసెన్షియా లైఫ్ సైన్సెస్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్, కార్పొరేట్ అడ్మినిస్ట్రేషన్, రీసెర్చ్ లేబరోటరీ కనెక్టికట్ లో ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 250 నట్ మెగ్ రోడ్ సౌత్, సౌత్ విండ్సర్, కనెక్టికట్-06074-3499, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. మందులు పంపిణీ చేసే కార్పొరేట్ ఆఫీసు- కెండల్ స్క్వేర్, కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. హైదరాబాద్ జినోమ్ వ్యాలీ ఐకేపీ నాలెడ్జ్ పార్క్ లోలో రీసెర్చ్ స్టేషన్, టెక్నాలజీ డెవలప్మెంట్ లాబ్స్ ఉన్నాయి. ఏపీలోని విశాఖపట్నం అచ్యుతాపురంలోని ఏపీ స్పెషల్ ఎకనమిక్ జోన్ లో ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇప్పుడీ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది.
Next Story