
సీఐటీయూ మహాసభల్లో మాట్లాడుతున్న ప్రకాష్‌రాజ్
అన్యాయాలపై పోరాటమే కార్మికులకు సరైన దారి!
నేటి సమాజంలో శ్రామికులు బతికే పరిస్థితి లేదని సినీ నటుడు ప్రకాష్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు జరుగుతున్న అన్యాయాలపై కార్మికులు పోరాటం చేయడం ఒక్కటే సరైన మార్గమని గుర్తించాలని సినీ నటుడు ప్రకాష్‌రాజ్ అన్నారు. విశాఖ బీచ్‌రోడ్డులోని ఏయూ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వారం రోజులపాటు జరగనున్న సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన తన ప్రసంగంలో ఏమన్నారంటే?
అబద్ధం మాట్లాడడానికే ధైర్యం కావాలి..
ఎవరికైనా అబద్ధం మాట్లాడడానికే ధైర్యం కావాలి. నిజం మాట్లాడడానికి కాదు.
నేటి పాలకులు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. చెమట చుక్కకు ఓటమి లేదని శ్రామికవర్గంలో సామెత ఉండేది. కానీ నేడు శ్రామికులు బతికే పరిస్థితి లేదు. ఒకప్పుడు అన్ని రాజకీయ పార్టీలు వాల్ల బలం చూపించడానికి రౌడీలను పెంచి పోషించారు. ఆ తర్వాత రౌడీలు చెప్పినట్టు వారు నడవాల్సి వచ్చింది. దేశాన్ని కార్పొరేట్లకు అమ్మేస్తున్నారు. ప్రైవేటైజేషన్ అన్నది మార్పు కాదు.. చేతులు మారడమే. సీఐటీయూ అంటే కార్మికులకు ఒక నమ్మకం.. ఒక భరోసా.. కార్మికుల కోసం ఉవ్వెత్తున పోరాటం చేస్తోంది. ఇలాంటి మహాసభలకు నన్ను రమ్మని ఆహ్వానిస్తే ఒక గౌరవంగా భావించాను.
మహాసభలను ఢంకా మోగించి ప్రారంభిస్తున్న ప్రకాష్‌రాజ్
చావుకంటే ముందు చనిపోకూడదు..
చావు సహజం. కానీ చావడంకంటే ముందు మనం చావకూడదు. మన సిద్ధాంతం, చైతన్యం చనిపోకూడదు. ఒక పక్షిని పంజరంలో పెడితే అది పాడేది స్వాతంత్య్రపు స్వేచ్ఛ పాటే.. విశాఖలో ఉద్యమాలకు అవసరం ఉన్న ప్రాంతం. ప్రభుత్వాల వారు ఇప్పటికే అమ్ముడుపోయారు. మీడియా కూడా అమ్ముడు పోయింది. పాలకులు మనువాదాన్ని అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. మన భారతదేశం ఒక సరోవరమైతే అందులో కనిపించని బ్రహ్మరాక్షసులున్నారు. అందులో ఆరెస్సెస్ అనే కమలం పువ్వుతో పోరాడాలి. వారు కనిపించరు. బీజేపీ రూపంలో ఉంటారు. కంటికి కనిపించే ప్రభుత్వాల వెనక ఆరెస్సెస్ వారే ఉన్నారు.
వచ్చే తరాలు తప్పు చేసే వారిని క్షమించవచ్చు గాని మౌనంగా ఉన్న వారిని మాత్రం క్షమించవు. నేను మౌనంగా ఉండను. ఉండలేను’ అని తన ప్రసంగాన్ని ముగించారు ప్రకాష్‌రాజ్.
శ్రామిక ఉత్సవ్ వేదికపై ప్రముఖుల ఐక్యతారాగం
కార్మికుల ఉపాధి తీస్తున్నారు..
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కర్మాగారాల్లో కార్మికుల ఉపాధిని తీస్తున్నాయని ఆరోపించారు. ‘వీరికి మనుగడ లేకుండా చేసేందుకు కుట్రలు, దాడులు చేస్తున్నాయి. కార్మిక చట్టాల్లో మార్పులు చేసి లేబర్ కోడ్లను తెచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికే తప్ప కాపాడ్డానికి పాలకులు సిద్ధంగా లేరు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన రైతు చట్టాలను ఉపసంహరించ లేదు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయలేదు. వ్యవసాయ ఉత్పత్తులను అదానీ, అంబానీ చేతుల్లో పెట్టారు. ఈ మహాసభల్లో ఆయా రాష్ట్రాల్లో కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు సల్పడానికి శ్రీకారం చుడతాం. ఒకప్పుడు సందేశాత్మక సినిమాలు వచ్చేవి. ఇప్పుడు డబ్బే ప్రధానంగా వస్తున్నాయి. శ్రామిక వర్గ ఆటా పాటా కనుమరుగవుతున్నాయి. ప్రకాష్‌రాజ్‌లో ఒక అభ్యుదయ వాది. ఆయన రాజ్యాంగానికి కట్టుబడే సెక్యులరిస్టు’ అని పేర్కొన్నారు.
శ్రమ అవార్డును అందుకుంటున్న తెలకపల్లి రవి
తెలకపల్లి రవికి శ్రమ అవార్డు ప్రదానం..
కార్యక్రమంలో సీనియర్ సంపాదకుడు తెలకపల్లి రవికి శ్రమ అవార్డును ప్రకాశ్‌రాజ్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, స్టార్ మేకర్ సత్యానంద్, ఉత్సవ్ కమిటీ కన్వీనర్ రమాప్రభ, లీడర్ సంపాదకుడు వీవీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
వారం రోజుల పాటు శ్రామిక ఉత్సవ్..
శ్రామిక సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలు శనివారం నుంచి జనవరి 2 వరకు (వారం రోజుల పాటు) జరగనున్నాయి. విశాఖలోని ఏయూ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో శ్రామిక ఉత్సవ్ పేరిట దీనిని నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రజలను ఆలోచింపజేసే 12 రకాల వైజ్ఞానిక ప్రదర్శనలు, లక్షకు పైగా టైటిళ్లతో పుస్తక మహోత్సవం ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1500 మంది కళాకారులు పాల్గొంటున్నారు. కేరళకు చెందిన కథాకళి, మోహిని అట్టం, గుజరాత్‌కు చెందిన గరా నృత్యం వంటి కళారూపాలను ప్రదర్శిస్తారు. ఇంకా ఫోటో ఎగ్జిబిషన్, కార్టూన్ ప్రదర్శన, షార్ట్ ఫిలిం వేదిక, సాహిత్య సదస్సులు, మానవ శరీర నిర్మాణం (అనాటమీ)పై అవగాహన కల్పించే స్టాళ్లను ఏర్పాటు చేశారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల్లో చైతన్యం నింపేలా ప్రత్యేక దేశభక్తి గీతాలు, నృత్యరూపకాలు, నాటికల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
రోజుకో థీమ్‌తో కార్యక్రమాలు..
సాంస్కృతిక వేదికపై రోజూ ఒక ఒక ప్రత్యేక థీమ్‌తో కార్యక్రమాలు చేపడ్తున్నారు. సెక్యులరిజం, సామాజిక న్యాయం, లింగ సమానత్వం, డ్రగ్స్ వ్యతిరేక పోరాటం, కార్మిక, కర్షక ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, విద్య, వైద్యం, ఉపాధి హక్కులు వంటి కీలకాంశాలపై చర్చలు జరుపుతారు. ఈ మహాసభలకు ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్న, గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, నటీనటులు రోహిణి, మాదాల రవి, సత్యారెడ్డి, సినీ దర్శకులు బాబీ, రాజమురుగన్, అట్టాడ సృజన్ తదితరులు వివిధ రోజుల్లో ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.
Next Story

