రైతులకు కన్నీరు మిగిల్చిన ‘కారం’ పంట
మిర్చి రైతులకు ఏపీలో ఈ ఏడాది గిట్టుబాటు ధర దక్కలేదు. లక్షల టన్నులు గుంటూరు మిర్చి యార్డులో మిర్చి బస్తాలు పేరుకు పోయాయి.
ఆంధ్రప్రదేశ్ లో పండు మిర్చి, ఎండు మిర్చి ధరలు బాగా తగ్గాయి. గత సంవత్సరంతో పోలిస్తే కనీసంగా 40 శాతం వరకు అమ్మకాలు తగ్గాయని రైతులు చెబుతున్నారు. వ్యాపారులు కూడా ఈ విషయం ధృవీకరిస్తున్నారు. గత సంవత్సరం 5.93 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు కాగా ఈ సంవత్సరం 3.53 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. దిగుబడి దాదాపు 5.14 లక్షల టన్నుల్లో వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. హార్టీ కల్చర్ డిపార్ట్ మెంట్ వారి అంచనా ప్రకారం ఐదు లక్షల టన్నుల పైన దిగుబడి వచ్చినట్లు లెక్కలు వేశారు. మిర్చి పంటకు రకరకాల తెగుళ్లు కూడా ఈ సంవత్సరం ఎక్కువగానే వచ్చాయి. తెగుళ్ల కారణంగా మిర్చిలో నాణ్యత లోపించినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
గత సంవత్సరం మిర్చికి మంచి ధర వచ్చింది. క్వింటా మిర్చి రూ. 20వేల వరకు పలికింది. కొంత మంది ఇంకా ఎక్కువ ధర వస్తుందని ఆశతో రైతులు కోల్డ్ స్టోరేజీల్లో మిర్చిని దాచారు. గత సీజన్ నుంచి ఈ సీజన్ కు సుమారు 50 శాతం ధరలు పడిపోయాయి. దిగుబడులు తగ్గటంతో పాటు ధరలు కూడా పతనం కావడంతో మిర్చి రైతులు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. తేజ రకం మిర్చి కోత కూలీ క్వింటాకు ఎంత లేదన్నా మూడే వేల వరకు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. ఇక కోత కూలీనే కాకుండా పెట్టుబడి ఖర్చులు కలుపుకుంటే క్వింటాకు 7వేల రూపాయల వరకు తేజ రకానికి ఖర్చవుతోంది. వ్యాపారులు తేజ రకం మిర్చిని ప్రస్తుతం మార్కెట్లో క్వింటా పది వేల రూపాయలకు మంచి కొనుగోలు చేయడం లేదు. గ్రేడ్ ఏ రకం మిర్చికి ప్రస్తుతం రూ. 12వేలకు మించి రావడం లేదు.
వర్షాల కారణంగా కాయల్లో నాణ్యత లోపించింది. నాణ్యత తక్కువగా ఉన్నాయనే షాకు చూపించి క్వింటా మిర్చి మంచి రకాలు అయినప్పటికీ రూ. 4 నుంచి 5 వేలకు మించి కొనుగోలు చేయడం లేదని ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం రాచకొండ గ్రామానికి చెందిన నారు వెంకటరెడ్డి వాపోయారు. గత సంవత్సరం క్వింటాకు రూ. 20వేలు రాకుంటే రైతులకు మిగిలేది అప్పులేదన్నారు. అదే గ్రామానికి చెందిన తోంట్ల బంగారురెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం ధరలు మొదటి కంటే రెండో సారి తగ్గటంతో కోల్డ్ స్టోరేజీలో మిర్చిని ఉంచాము. క్వింటాకు ఖర్చు రూ. 1,400 ల వరకు వచ్చింది. ఎనిమిది నెలల తరువాత అమ్ముదామన్నా ధర సగానికి సగం తగ్గిపోయిందని, ప్రస్తుతం వచ్చిన పంటను కోల్డ్ స్టోరేజీలో ఉంచాలంటే ఖాళీలు కూడా లేవని స్టోరేజీ పాయింట్ వారు చెబుతున్నారన్నారు. కొన్ని క్వింటాళ్లయిన అమ్మితేనే కోత కూలీ, పురుగు మందుల అప్పులు తీరుతాయని, అవి తీర్చకుంటే అప్పులు ఇచ్చిన వారు రోజూ ఇంటికి వచ్చి వేధిస్తున్నట్లు చెప్పారు. ఎప్పుడు అమ్ముతావని ప్రతి రోజూ ఒకటే పోడు పెడుతున్నారని వాపోయారు.
లాభాల సంగతి అటుంచి పండించిన పంటను వ్యాపారులు కొనుగోలు చేస్తే అదే పదివేలని పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామానికి చెందిన గోరంట్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తాను రెండెకరాలు మాత్రమే మిరప వేశానని, పది క్వింటాళ్ల మిర్చి కోస్తే అవి కొనే వారు మార్కెట్లో లేకుండా పోయారన్నారు. క్వింటా రూ. 5వేలకు ఇస్తే కొంటామని వ్యాపారులు చెబుతున్నారని, రెండు రోజులుగా మిర్చి యార్డులోనే ఉన్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం గండేపల్లి గ్రామానికి చెందిన బెల్లంకొండ వెంకటసుబ్బారావు మాట్లాడుతూ గత సంవత్సరం నాలుగు ఎకరాల్లో మిర్చి సాగు చేశా. క్వింటా రూ. 14000లకు అమ్మా, కొన్ని బస్తాలు కోల్డ్ స్టోరేజీలో ఉంచా. ధర రాలేదు. వాటిని ప్రస్తుతం క్వింటా రూ. 9వేలకు అమ్మా, అప్పులు తీరలేదు. ఈ సంవత్సరం కాయకోసి అమ్ముదామంటే భయం అవుతోంది. కొన్ని బస్తాలు ఇంటి వద్దే ఉన్నాయని తెలిపారు. ఇలా ఏ రైతును కదిలించినా కంట కన్నీరు పెడుతున్నారు. ధరలు లేకపోవడం, పెట్టుబడులు పెరగటంతో దిక్కుతోచని స్థితికి చేరారు. రైతుల ఆత్మహత్యకు ఊరకే రావని, ఇటువంటి పరిస్థితులు అందుకు దారితీస్తాయని తెలిపారు.
ఆకుముడుత, బొబ్బెర, నల్లి, జెమినీ వైరస్, కొమ్ముకుళ్లు తెగుళ్లు సోకాయి. ఒక్కసారిగా మూడు, నాలుగు రకాల తెగుళ్లు వ్యాపించడంతో చెట్టంతా ముడుచుకుపోయి దిగుబడి తగ్గింది. పైగా సీజన్ ప్రారంభం నుంచే తుఫాన్ ల ప్రభావం కారణంగా కాయల్లో పెరుగుదల లేకుండా పోయింది. బాగా వచ్చిన కాయలు కూడా సరైన రంగు, కారం లేకుండా పోవడంతో ధర పాతాళాన్ని చూసింది. ఎకరాకు రైతులు పెట్టుబడి ఖర్చుల కింద కనీసంగా రూ. 1.50 లక్షలు ఖర్చు చేశారు. తీరా అమ్మే సరికి క్వింటా రూ. 4వేల నుంచి ప్రారంభమవుతోందని గుంటూరు జిల్లా కాకానికి చెందిన నల్లదిమ్మె వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ గ్రేడ్ మిర్చి ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో రూ. 11,883 లు పడుతోంది. ఇక కాస్త తాలు వచ్చినా, రంగు మారినా మంచి మిర్చే అయినా క్వింటా ధర రూ. 4వేలకు మించడం లేదు. నాలుగు నుంచి పదివేల లోపులో వివిధ గ్రేడ్స్ కింద వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది క్వింటా ధర దాదాపు రూ. 20వేల వరకు అమ్మింది. దీంతో రైతులు చాలా మంది చివరి కాపు ధర తగ్గిందని, తరువాత అమ్ముకుందామని కోల్డ్ స్టోరేజీల్లో పెట్టారు. ఆ నిల్వ ఉన్న కాయ సుమారు 30 లక్షల క్వింటాళ్ల వరకు ఉన్నట్లు వ్యాపారుల అంచనా.
ఇక ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న మిర్చి పంట కూడా భారీగానే ఉంది. దీంతో ధర పూర్తిగా పడిపోయింది. కనీస ధర క్వింటా రూ. 15,000లు లేనిది బతికే పరిస్థితులు లేవని రైతులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బత్తిని నరసింహారావు ‘ది ఫెడరల్’ తో మాట్లాడుతూ మిర్చి పంట రైతులను బాగా దెబ్బతీసిందని, ఎకరా మిర్చి అమ్మితే రూ. 70 నుంచి 80వేల వరకు మాత్రమే వస్తున్నాయని, పెట్టుబడులు లక్షన్నర వరకు అయినట్లు తెలిపారు. అమ్మకం జరగకుండా మార్కెట్లో నే ఉంచడం వల్ల పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు అప్పు ఇచ్చిన వ్యాపారులు తమను పీక్కు తింటున్నారని, ఈ బాధలు భరించలేక పోతున్నామని రైతులు వాపోతున్నారు.
మార్కెట్లో ఈ సంవత్సరం ధరలు క్వింటాకు మూడు నుంచి ఐదు శాతం తగ్గినట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం ప్రధాన పరిశోధకురాలు డాక్టర్ వై రాధ తెలిపారు. 2024 నవంబరు, డిసెంబరులో సాధారణ మిరప రకాలు క్వింటా అంచనా ధర రూ. 14,200 నుంచి 16,200 వరకు ఉందని, ప్రత్యేక రకాలు రూ. 14,500 నుంచి 17,600 వరకు ఉన్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ధరలు సగానికి సగం పడిపోవడం బాధాకరమన్నారు. ఇందుకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గాయని వ్యాపారులు చెప్పటం సరైంది కాదని, రైతులకు సకాలంలో గిట్టుబాటు ధర చెల్లించాలని రాధ కోరుతున్నారు. మార్కెట్ అంచనా ధరలు ఒక్కసారిగా తారుమారైనట్లు ఆమె తెలిపారు.