
పల్నాడు ఆశాకిరణం అమూల్య
అమూల్య... ఎవరు? ఎందుకు ఈ బాలిక వార్తల కెక్కింది? కలెక్టర్ ఈమెను ఎందుకు సత్కరించారు? ఒక పేద కుటుంబానికి చెందిన అమూల్య సాధించిన విజయం ఏమిటి?
మనం ఎన్నో కథలు చదువుతుంటాం. ఆ తరువాత మరిచిపోతాం. ఈ కథ చదివిన తరువాత మరిచిపోలేము. ఏదో ఒకటి ఈ కుటుంబానికి చేస్తే బాగుంటుంది అని పిస్తుంది. అందుకే కలెక్టర్ స్పందించారు. వేములపాటి అమూల్యను అభినందించారు. అంతే కాదు పేద కుటుంబమైనందున ఆ కుటుంబ జీవనానికి దారి చూపించాలని భావించిన కలెక్టర్ ఎకరం భూమి ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా, నాదెండ్ల మండలం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 10వ తరగతి చదివిన అమూల్య అనే విద్యార్థిని తన అసాధారణ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. పదవ తరగతి పరీక్షల్లో 593 మార్కులు సాధించిన ఈ యువ విద్యార్థిని, పేదరికంతో పోరాడుతూ విద్యాపరంగా ఉన్నత స్థానాన్ని అందుకుంది. కష్టాలను అధిగమించి విజయం సాధించిన ఆమె కథ ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు తీసుకున్న మానవీయ కోణం ఈ కథను మరింత ప్రత్యేకం చేసింది.
పేదరికంలో పుష్పించిన ప్రతిభ
అమూల్య కుటుంబం నాదెండ్ల మండలంలోని తూబాడు గ్రామానికి చెందినది. ఆమె తల్లిదండ్రులు వేములపాటి అనిల్, రూతమ్మ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. నలుగురు కుమార్తెలను పోషించడానికి వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు అనేకం. రోజువారీ కూలీ పనులపై ఆధారపడి జీవిస్తున్న ఈ కుటుంబానికి, అమూల్య విద్యాపరంగా సాధించిన విజయం ఒక వరంగా మారింది. 593 మార్కులతో నరసరావుపేట డివిజన్‌లో మొదటి స్థానం, పల్నాడు జిల్లాలో మూడో స్థానం సాధించిన అమూల్య, తన పాఠశాలకే కాక, గ్రామానికి కూడా గర్వకారణమైంది. అమూల్య అనిల్, రూతమ్మల మొదటి సంతానం. అమూల్య ఇంటికి లెక్టర్ అరుణ్ బాబు వెళ్లారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాలిక చదువు తీరు అడిగి తెలుసుకున్నారు. కుటుంబంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా మనసు పెట్టి చదువు నేర్చుకోవడాన్ని ఆయన అభినందించారు.
అమూల్య విజయం వెనుక ఆమె కఠోర శ్రమ, అంకితభావం, విజ్ఞాన దాహం ఉన్నాయి. పేదరికం, పరిమిత వనరులు ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఆపలేకపోయాయి. ఆమె తల్లిదండ్రులు, ఆర్థిక ఒడిదొడుకుల మధ్య కూడా, తమ కుమార్తె విద్యను కొనసాగించేందుకు అన్ని విధాలా ప్రోత్సహించారు.
కలెక్టర్ అరుణ్ బాబు మానవీయత
అమూల్య విజయం గురించి తెలుసుకున్న పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆమెను సత్కరించడమే కాక, ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులను గమనించారు. అమూల్య తల్లిదండ్రులు కూలీ పనులపై ఆధారపడి జీవిస్తున్న విషయం తెలిసిన తర్వాత, కలెక్టర్ ఒక వినూత్నమైన, హృదయాన్ని తట్టిలేపే నిర్ణయం తీసుకున్నారు. ఆమె కుటుంబానికి ఒక ఎకరం ప్రభుత్వ భూమిని సాగుకోసం కేటాయించారు. ఈ చర్య కుటుంబ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాక, అమూల్య భవిష్యత్ విద్యా అవసరాలకు కూడా దోహదపడుతుంది.
ఈ భూమి కేటాయింపు పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉపయోగ పడుతుంది. కలెక్టర్ ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా ఉపయోగించి, అర్హమైన కుటుంబానికి సాయం అందించడంలో ముందడుగు వేశారని చెప్పొచ్చు.
సమాజంపై ప్రభావం
కలెక్టర్ అరుణ్ బాబు చేసిన సాయం పల్నాడు జిల్లాలోని ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. సామాజిక మాధ్యమాలలో, ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్, ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అనేక మంది ఈ చర్యను "గొప్ప విషయం"గా అభివర్ణించారు. కలెక్టర్ చూపిన సానుభూతిని పలువురు కొనియాడారు. ప్రభుత్వ అధికారులు తమ అధికారాన్ని సానుకూలంగా ఉపయోగించి, సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ఎలా ఉపయోగపడగలరో కలెక్టర్ తీసుకున్న నిర్ణయం చూపించింది.
అమూల్య విజయం, కలెక్టర్ సాయం, ఇతర విద్యార్థులకు, ముఖ్యంగా పేద కుటుంబాల నుంచి వచ్చే వారికి, విద్య ద్వారా తమ జీవితాలను మెరుగు పరచుకోవచ్చనే నమ్మకాన్ని కలిగించాయి. ఇది విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలల పాత్రను కూడా హైలైట్ చేస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో తక్కువ వనరులు ఉన్నప్పటికీ గొప్ప ఫలితాలను అందుకోవచ్చని ఈ బాలిక నిరూపించింది.
పిల్లల చదువుకు పేదరికం అడ్డు కాకూడదు
అమూల్య కథ స్ఫూర్తిదాయకంగా ఉన్నప్పటికీ, ఇది గ్రామీణ భారతదేశంలో పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా బయటపెడుతుంది. వ్యవసాయ కూలీల కుటుంబాలు తరచూ ఆర్థిక అస్థిరతతో పోరాడుతుంటాయి. ఇది వారి పిల్లల విద్యాభ్యాసంపై ప్రభావాన్ని చూపిస్తుంది. అమూల్య వంటి విద్యార్థులు ఈ పరిస్థితుల్లో ఇంతటి విజయం సాధించడం అసాధారణమైన అంశం. కానీ ఇటువంటి కథలు సర్వసాధారణం కావాలంటే విద్యా సంస్థలు మరింత చురుకుగా పనిచేయాలి.
కలెక్టర్ అరుణ్ బాబు చేసిన సాయం ఒక సానుకూల అంశం అయినప్పటికీ, ఒక ఎకరం భూమి కేటాయింపు కుటుంబానికి స్థిరమైన ఆదాయాన్ని ఎలా అందిస్తుందనే దానిపై కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఉదాహరణకు సాగు కోసం అవసరమైన వనరులు (సాగు నీరు, విత్తనాలు, ఎరువులు వంటివి) అందుబాటులో ఉన్నాయా? ఈ సవాళ్లను అధిగమించడానికి అదనపు సాయం ప్రభుత్వం అందిస్తుందా? అనే అంశాలపై స్పష్టత లేనప్పటికీ, కలెక్టర్ చర్య ఒక ఆరంభ బిందువుగా పనిచేస్తుంది. ఇది ఇతర అధికారులకు స్ఫూర్తినిస్తుంది.