గిరిజనులను సీఎంలు, రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధానిదే!
x
సీఎం మాఝిని సత్కరిస్తున్న గిరిజన నేతలు

గిరిజనులను సీఎంలు, రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధానిదే!

దేశంలో గిరిజనులకు పెద్ద పీట వేస్తున్నది ప్రధాని నరేంద్ర మోదీయేనని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి అన్నారు.

గిరిజనులను ముఖ్యమంత్రులు గాను, రాష్ట్రపతి గాను చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని ఒడిశా ముఖ్యమంత్రి ఎంసీ మాఝి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించే భగవాన్‌ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పాడేరులో ఏర్పాటు చేసిన ముండా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం గిరిజనులనుద్దేశించి మాఝీ మాట్లాడుతూ ఏమన్నారంటే?


మాట్లాడుతున్న ఒడిశా సీఎం మాఝి

‘భగవాన్‌ బిర్సా ముండా స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక వేత్త కూడా. భవిష్యత్తుకు దిక్సూచి. ఆయన కేవలం 25 ఏళ్లు మాత్రమే జీవించారు. కానీ గొప్ప పోరాట పటిమను కనబరిచారు. ప్రధాని మోదీ.. బిర్సా ముండాకు జాతీయ గౌరవం ఇచ్చారు. ఈరోజు ఆదివాసీ గౌరవ దినోత్సవం జరుపుకుంటున్నాం. మన దేశానికి ఆదివాసీ బిడ్డ అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిలో ఉన్నారు. ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు గిరిజనులను సీఎంలుగా చేసిన ప్రధానికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో గిరిజన తెగలున్నాయి. కొండదొర తెగ వారు అటవీ జీవితం గడుపుతూ సమాజానికి ఎన్నో అటవీ ఉత్పత్తులను అందిస్తున్నారు. సవర తెగ వారు గిరిజన భాషను పరిరక్షిస్తున్నారు. కొండ సవర్లు సమాజానికి మేలు చేస్తున్నారు. మేం 28 లక్షల మంది పీటీజీలకు విద్య, వైద్య సేవలందిస్తున్నాం. 90 వేల మంది గిరిజనుల ఇళ్లకు మంచినీరు ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా సవర, కొండ సవర, గదబ తదితర తెగలకు మేలు చేస్తోంది. ఏకలవ్య పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య అందుతోంది. దేశంలో ఏడు కోట్ల ఆదివాసీలకు ఆరోగ్య మేలు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం 126 జిల్లాల్లో ఉండే నక్సల్స్‌ ప్రభావాన్ని 38 జిల్లాలకు తగ్గించింది. ఫలితంగా గిరిజనులకు ప్రశాంత జీవితం ఇవ్వగలిగింది.’ అని చెప్పారు.

బిర్సా ముండా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఒడిశా సీఎం మాఝి

తెలుగులో నమస్కారాలు అంటూ..
ఒడిశా సీఎం మాఝి తొలుత ‘అందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. పాడేరు మోదకొండమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి. అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి వచ్చిన ఆదివాసీలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
గిరిజనుల ఆరోగ్యానికి ప్రాధాన్యత..
సభలో పాల్గొన్న ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. గిరిజనుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. గిరిజనులు కాలుష్యానికి దూరంగా ఉంటూ ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ.. పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో 21 గ్రామాల్లో ఉన్న సమస్యలను ఒడిశా ప్రభుత్వం పరిష్కరించాలని ఆ రాష్ట్ర సీఎం మాఝిని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ ‘గిరిజనుల అస్తిత్వం కోసం బిర్సా ముండా ప్రయత్నించారు. 1/70 చట్టం, సీపా చట్టాలు బిర్సా ముండా పోరాటం వల్లే వచ్చాయి. ఆంధ్ర వనవాసి కల్యాణ్‌ సహకారంతో ప్రతి గ్రామంలో జన జాతీయ గౌరవ దివస్‌ను నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. సభకు పాంగి రాజారావు అధ్యక్షత వహించగా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడారి ఆనందకుమార్, రాష్ట్ర కార్యదర్శులు సురేంద్ర మోహన్, రెడ్డి పావని, సుజాత తదితరులు హాజరయ్యారు.
Read More
Next Story