మార్పియస్ మరింత ప్రియం
x

మార్పియస్ మరింత ప్రియం

మద్యం ధరలు సగానికి సగం తగ్గుతాయని అందరూ భావించారు. కొన్ని బ్రాండ్స్ రేట్లు పెరిగాయి. రూ. 99లకే మద్యం ఇస్తామన్న ప్రభుత్వం ఛీప్ లిక్కర్ ను కూడా రూ. 120 చేసింది.


నూతన మద్యం విధానం మద్యం ప్రియులను నిరాశ పరిచింది. ప్రభుత్వం చెప్పినంతగా ధరలు తగ్గించలేదు. గతంలో ఏ ధరలైతే ఉన్నాయో అవే ధరలు కంటిన్యూ చేసింది. ఉదాహరణకు మాన్సన్ హౌస్ క్వార్టర్ బాటిల్ ధర గతంలో రూ. 220లు ఉంటే ఇప్పుడు కూడా అదే ధరను కొనసాగించారు. అయితే మార్పియస్ క్వార్టర్ బాటిల్ ధర గతంలో రూ. 270లు ఉంటే ప్రస్తుతం దీనిని రూ. 300లు చేశారు. అలాగే కైరాన్ బ్రాంది క్వార్టర్ ధర గతంలో రూ. 270లు ఉంటే ప్రస్తుతం రూ. 300లు చేశారు. రాయల్ రతం బోర్ విస్కీ క్వార్టర్ ధర గతంలో రూ. 600లు ఉంటే ప్రస్తుతం దీని ధరను రూ. 650 చేశారు. చాలా బ్రాండ్స్ ధరలు పెరిగాయి. కొన్ని బ్రాండ్స్ పై క్వార్టర్ కు రూ. 30 నుంచి 50ల వరకు తగ్గించారు. 8పిఎం విస్కీ క్వార్టర్ ధర గతంలో రూ. 220 కాగా ప్రస్తుతం రూ. 230లు చేశారు.

గత ప్రభుత్వం కోట్లలో అవినీతికి పాల్పడిందని, అవినీతిపై దర్యాప్తు జరగాలని, అధిక ధరలు అమ్మి దోచుకున్నారని ప్రస్తుత పాలకులు గగ్గోలు పెట్టారు. చివరకు వీరు చేసిందేమిటంటే గత ప్రభుత్వం ఏమి చేసిందో దానినే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం బ్రాండ్ నేమ్స్ రిలీజ్ చేసింది. అయితే ఆ బ్రాండ్స్ అన్నీ మార్కెట్లోకి వస్తాయో రావోననే అనుమానాలు కూడా ఉన్నాయి. బోర్డులపై మాత్రం రకరకాల బ్రాండ్స్ పేర్లు ఉంటున్నాయి. షాపుల్లో మాత్రం ఆ బ్రాండ్స్ ఉండటం లేదు. ఉదాహరణకు డబుల్ బ్లూ విస్కీ ఫుల్ బాటిల్ 2019కి ముందు రూ. 650లు, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత దాని ధరను రూ. 1,350లు చేశారు. ప్రస్తుతం ఈ బ్రాండ్ లేకుండా పోయింది.

పాలసీ మార్పు అనేది కేవలం ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వారి చేతుల్లోకి వెళ్లడం తప్ప ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. సగానికి సగం ధర తగ్గుతుందని, 2019కి ముందు ఎంత ధర ఉందో ఆ ధరలు అందుబాటులోకి వస్తాయని మద్యం ప్రియులు భావించారు. అయితే వారి ఆశలు నిరాశగానే మిగిలింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఉన్న బ్రాండ్స్ తప్ప పాత బ్రాండ్స్ ఏవీ పెద్దగా కనిపించడం లేదు. గతంలో కూడా పాత బ్రాండ్స్ బోర్డుపై చూపించారు. కానీ షాపుల్లో అవి కనిపించేవి కాదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది.

Read More
Next Story