
ఆంధ్రలో తీవ్రమవుతున్న ‘రాజకీయ పోరాటం’
ప్రతిపక్షం ఉద్యమాల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. కూటమి తాము చేసిన కార్యక్రమాలను చెప్పుకునేందుకు సభలు నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మధ్య తీవ్ర పోరుతో ముందుకు సాగుతున్నాయి. ఇవి రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చలకు తెరలేపాయి. ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజా సేవలు, శాఖా సమీక్షలు, పింఛన్ పంపిణీల, ఇతర పథకాల అమలు ద్వారా ప్రజల మద్దతును మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతోంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపట్టి, ప్రతిపక్ష బలాన్ని పెంచుకుంటున్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు 2029 అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికార పక్షం 'సంక్షేమ రాజకీయాలు'తో ప్రజలను ఆకర్షిస్తుండగా, ప్రతిపక్షం 'ప్రజా హక్కులు' బ్యానర్‌తో ఒత్తిడి తీసుకురావడం రాష్ట్ర రాజకీయాలకు కొత్త ఒరవడిని తీసుకొచ్చింది.
అధికార పక్షం ప్రజల మధ్యకు వెళ్లి ఇమేజ్ బిల్డింగ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి 'పేదల సేవలో ప్రజా వేదిక' పేరిట ప్రతినెలా పింఛన్ పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పేదల మద్దతును పొందగలుగుతున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద రూ.48,019 కోట్ల పింఛన్‌లు 16 నెలల్లో పంపిణీ చేసినట్టు సీఎం తన రోజువారీ శాఖా సమీక్షల్లో ప్రకటించారు. విజయవాడలో జరిగిన ప్రజా వేదికలో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ప్రధాన కార్యనిర్వాహకులతో కలిసి ప్రజల సమస్యలను విని, 'ప్రజా సంతృప్తి'ను పాలన పునాదిగా చేసుకున్నారు. 19 శాఖల్లో రోజువారీ మానిటరింగ్, ప్రతి 15 రోజులకు డేటా సేకరణ ద్వారా జవాబుదారీతనాన్ని నెలకొల్పారు.
పవన్ కల్యాణ్ కీలక పాత్ర
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ తీరప్రాంతంలో ఫార్మా యూనిట్లు (బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు) వల్ల సముద్ర కాలుష్యం, మత్స్యకారుల జీవనోపాధి సమస్యలపై అక్టోబర్ 9న పర్యటించి, మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. '100-రోజుల లక్ష్యం' ప్రకటించి, అధికారులు-మత్స్యకారులతో కమిటీ ఏర్పాటు చేసి, కాలుష్య నివారణ, పరిహారం, మౌలిక సదుపాయాలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రూ.323 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించేలా చేశారు. ఈ చర్యలు పవన్ కళ్యాణ్‌కు 'ప్రజా నాయకుడు' ఇమేజ్‌ను మరింత బలపరుస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతిపక్షం ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాలు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ విధానాలను లక్ష్యంగా చేసుకుని, రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలకు హామీ ఇచ్చిన జగన్, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మెడికల్ కాలేజీ ప్రజా-ప్రైవేటు భాగస్వామ్య నమూనాలో నిర్మాణానికి వ్యతిరేకంగా అక్టోబర్ 9న రోడ్ షో, ఆందోళన నిర్వహించారు. తన పాలనలో ప్రారంభమైన 17 మెడికల్ కాలేజీలు (4,910 సీట్లు, 2,360 ఉచిత సీట్లు) పేదలకు వైద్య విద్య, ఆరోగ్య సేవలు అందించడానికి ఉద్దేశించినవి. చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేస్తూ పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేస్తోందని విమర్శించారు. అమరావతి అభివృద్ధికి రూ.2లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, ప్రతి మెడికల్ కాలేజీకి రూ.500 కోట్లు కేటాయించలేక పోతోందని, ప్రైవేట్ వ్యక్తులు పేదలను దోపిడీ చేస్తారని హెచ్చరించారు.
వైఎస్సార్సీపీ వాదనలను కోర్టు ఆదేశం దెబ్బతీసిందా?
ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ 'ఒక్క కోటి సంతకాల సేకరణ' ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమాలు, అక్టోబర్ 28న నియోజకవర్గ స్థాయి ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా స్థాయి ర్యాలీలు, నవంబర్ 24న గవర్నర్‌కు మెమోరాండం సమర్పణ.. కార్యక్రమాలతో ప్రభుత్వ వైఫల్యాలను (కలుషిత ఆల్కహాల్, రైతుల సమస్యలు, ఆరోగ్యం క్షీణత) ఎత్తి చూపనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రజా-ప్రైవేటు భాగస్వామ్య నమూనాను ఆమోదించడం (అక్టోబర్ 8), టెండర్ ప్రాసెస్‌పై స్టే ఇవ్వకపోవడం వైఎస్సార్సీపీ వాదనలను దెబ్బ తీసింది. కోర్టు 'ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రజా-ప్రైవేటు భాగస్వామ్యం అవసరమే'నని స్పష్టం చేసింది.
అధికార వ్యతిరేకత ఎన్నికలను ప్రభావితం చేస్తుందా?
రాజకీయ పరిశీలకులు ఈ పరిస్థితిని 'సేవ వర్సెస్ ఆందోళన' యుద్ధంగా చూస్తున్నారు. అధికార పక్షం ప్రజా సమీక్షలు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల ప్రజా సంబంధాల ద్వారా 'పాలనా ఇమేజ్'ను బలోపేతం చేస్తోందని, ఇది 2029 ఎన్నికల్లో ప్రయోజనకరమవుతుందని విశ్లేషణ. కానీ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్రైవేటీకరణ, అమరావతి ప్రాధాన్యతలు, ఆరోగ్య శాఖ వైఫల్యాలపై ఉద్యమాలతో ప్రతిపక్ష బలాన్ని పెంచుకుంటోంది. ఒక్క కోటి సంతకాల సేకరణ ప్రజల్లో 'ప్రభుత్వ వ్యతిరేకత'ను వారికి అనుకూలంగా మార్చవచ్చని, కానీ హైకోర్టు ఆదేశం వైఎస్సార్సీపీ వాదనలను బలహీనపరుస్తోందని పరిశీలకుల అంచనా.
ప్రతిపక్ష ఉద్యమాలను బలహీన పరిచేందుకు ప్రభుత్వం అడుగులు
ప్రతిపక్షం చేస్తున్న ఉద్యమాలను అణచి వేసేందుకు అధికార కూటమి పోలీసు బలగాలను ఉపయోగిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించే పరామర్శలు, సందర్శనలకు ప్రభుత్వం అనుమతులు సకాలంలో ఇవ్వటం లేదు. ఆంక్షలు విధిస్తోంది. శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందని కొన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అధికార పక్షం కేవలం భయంతోనే జగన్ కార్యక్రమాలకు జనాన్ని రాకుండా అడ్డుకుంటోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మేరుగు నాగార్జున పేర్కొన్నారు.
రాష్ట్రంలో 'అధికార వ్యతిరేకత' పెరుగుతోందని జగన్ పేర్కొన్నారు. అధికార పక్షం సంక్షేమ కార్యక్రమాలతో జగన్ మాటలను ఆక్షేపించాలని ప్రయత్నిస్తోంది. మొత్తంగా రాజకీయాలు మరింత చర్చనియాంశంగా మారుతున్నాయి. ప్రజల మధ్య విభజనను రాజకీయ వేడి పెంచుతోంది.