నెల్లూరు రాజకీయం మహా హాట్ గురూ!
x
నెల్లూరు మేయర్ స్రవంతి

నెల్లూరు రాజకీయం మహా హాట్ గురూ!

వైసీపీ మేయర్ స్రవంతి వాట్సాప్ రాజీనామా చెల్లుతుందా? గెల్చామంటున్న టీడీపీ


నెల్లూరు (Nellore) నగరంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఇన్నాళ్లూ వైసీపీలో కీలక పాత్ర పోషించిన కార్పొరేటర్లు టీడీపీ పంచన చేరడంతో మేయర్ పదవికి పొట్లూరు స్రవంతి రాజీనామా చేశారు.

వైసీపీ జిల్లా నాయకుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాక్షన్‌లోకి దిగిన గంటల వ్యవధిలోనే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి రియాక్షన్ మొదలు పెట్టారు. సీఎం జగన్ వద్ద వైసీపీలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లు.. గంట వ్యవధిలోనే తిరిగి టీడీపీలో చేరారు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ యాక్షన్ అంతగా సఫలీకృతం కాలేదు.
ఫలితంగా ఆదివారం ఉదయం మేయర్‌ పదవికి పొట్లూరు స్రవంతి రాజీనామా చేశారు. శనివారం రాత్రే రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆమె ఆదివారం ఉదయం స్వయంగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు రాజీనామా పత్రాన్ని అందిస్తానని చెప్పారు. కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో వాట్సప్‌లో పంపారు. వాట్సప్‌ రాజీనామా చెల్లుతుందా లేదా అనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.
ఈ నెల 18న అవిశ్వాస తీర్మానంపై చర్చకు కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు స్రవంతి ప్రకటించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 54మంది కార్పొరేటర్లు ఉండగా.. అందరూ వైసీపీ వారే. మేయర్‌ కాకుండా.. మిగిలిన 52 మందిలో 42 మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు.
తాజాగా.. నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పల శ్రీనివాస్ యాదవ్.. సైకిల్ ఎక్కారు. రాష్ట్ర మంత్రి నారాయణ ఆయన్ను పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. 37వ డివిజన్ కార్పొరేటర్ అయిన శ్రీనివాసులు యాదవ్.. నగర వైసీపీ అధ్యక్షుడిగా, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. ఈనెల 18 న మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి ముందు మంత్రి నారాయణ సమక్షంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లూ టీడీపీలో చేరారు.
నగర అధ్యక్షుడే పార్టీ మారడంతో అయోమయంలో పడిపోయిన పలువురు వైసీపీ నేతలు.. శ్రీనివాస్ యాదవ్ బాటే పట్టారు. మంత్రి నారాయణ చేస్తున్న అభివృద్ధి కారణంగానే తాము తెలుగుదేశంలోకి వచ్చామని చెప్తున్నారు. ఇక.. శనివారం మంత్రి నారాయణ సమక్షంలో 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా కూడా తెలుగుదేశంలోకి చేరారు.
ఈ విషయమై వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన శ్రీనివాసులు యాదవ్ స్పందిస్తూ.. 'మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీలో చేరాను. నేను వైసీపీలో ఉన్నప్పటికీ మంత్రి నారాయణ నాకు అనేక రకాలుగా సాయం చేశారు. ఎప్పుడూ పార్టీ మారాలని నన్ను అడగలేదు. నేనే స్వచ్ఛందంగా వైసీపీని వీడి టీడీపీలో చేరాను. మిగిలిన 11 నెలల పదవీ కాలంలో నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను పార్టీ మారడం వెనుక ఎవరి ప్రోద్బలం లేదు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం గెలిచి తీరతాం' అని పేర్కొన్నారు.
పార్టీ మార్పు పై టీడీపీ అధికార ప్రతినిధి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. నెల్లూరుకు స్రవంతి మేయర్‌గా ఎప్పుడూ వ్యవహరించలేదు. రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరు. అని మంత్రి నారాయణ చెప్పారు. కార్పొరేటర్లు స్వచ్ఛందంగా పార్టీ మారి నగర అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించారు. వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారి భాష వల్లే జనం 11 సీట్లకు పరిమితం చేశారు. కేవలం అభివృద్ధి కోసమే కార్పొరేటర్లు పార్టీ మారుతున్నారు' అని చెప్పుకొచ్చారు.
Read More
Next Story