
పోలీసులు అధికార కూటమి 'తొత్తుల్లా' వ్యవహరిస్తున్నారు
పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలం, రాజయ్యపేట బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వ్యతిరేక పర్యటనకు వెళుతున్న రామచంద్రయాదవ్‌పై జులుం.
రాష్ట్రంలో భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా తాలిబాన్, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలం, రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కోసం జరుగుతున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా, మత్స్యకారులకు మద్దతుగా ఆయన పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే పోలీసులు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందంటూ రాత్రికి రాత్రి నోటీసులు ఇచ్చి, రాజమండ్రి హోటల్‌లో ఆయనను నిర్భందించారు. సిఆర్పీఎఫ్ సిబ్బందిపై కూడా జులుం ప్రదర్శించి, మీడియాను దూరం చేశారు.
రాజయ్యపేటకు బయలుదేరుతుండగా హోటల్‌కు చేరుకున్న రామచంద్రయాదవ్‌ను పెద్ద సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టి బయటికి రానివ్వకుండా అడ్డుకున్నారు. బిసివై నేతలతో వాగ్వివాదానికి దిగి, బలవంతంగా గదిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పర్యటన వాయిదా వేసుకున్నానని చెప్పినా వినకుండా, సమీప ఆలయానికి వెళ్లాలన్నా అనుమతించలేదు. సిఆర్పీఎఫ్ కమాండోలపై దురుసుగా ప్రవర్తించి, వారిని పక్కకు నెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
"తాను రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పర్యటన వాయిదా వేస్తున్నాను, కానీ పోలీసులు అధికార పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం చేస్తున్నారు" అంటూ రామచంద్రయాదవ్ పోలీసుల తీరును తప్పుబట్టారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, "ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు దోపిడీదారులకు తొత్తులుగా మారారు. రైతులు, మత్స్యకారులను అణచివేస్తున్నారు" అని దుయ్యబట్టారు. కరేడు, ఉదయగిరి మైనింగ్ మాఫియా వ్యతిరేక పోరాటాల్లో కూడా అడ్డుకున్నట్లు గుర్తు చేశారు.
బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పేరుతో మత్స్యకారులు, రైతుల భూములను లాక్కునే తప్పుడు ప్రయత్నాలను సహించేది లేదన్నారు. "ఒక్క సెంట్ భూమి కూడా తీసుకోలేరు" అంటూ హెచ్చరించారు. పాయకరావుపేటలో అనేక మంది మత్స్యకారులు, ప్రజాసంఘ నాయకులను అక్రమ అరెస్ట్‌లు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. "అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరు. పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెడతాం" అని హెచ్చరించారు.
కోర్టు అనుమతితో త్వరలో రాజయ్యపేటకు వెళ్తానని, అవసరమైతే కేంద్రం దృష్టికి సమస్య తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. "ప్రభుత్వ భూముల్లో కంపెనీలు ఏర్పాటు చేయాలి, రైతుల భూములు లాక్కోకూడదు. పెట్టుబడిదారులతో లాలూచీ పడకుండా ప్రజల ప్రయోజనాలు చూడాలి" అని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.