
విశాఖలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
పార్టనర్‌షిప్ సమ్మిట్ సూపర్ హిట్టయింది!
విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ 613 ఎంవోయూలు, రూ. 13.25 లక్షల కోట్ల పెట్టుబడులతో సూపర్ హిట్ అయిందని సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు.
విశాఖపట్నంలో శుక్ర, శనివారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సీఐఐ 30వ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో అంచనాలకు మించిన పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వం ఈ సమ్మిట్ ద్వారా 410 ఎంవోయూలతో రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు సమకూరుతాయని అంచనా వేసింది. అయితే అంతకుమించి 613 ఎంవోయూలతో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తడంతో ఈ సమ్మిట్ సూపర్ హిట్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం సదస్సు ముగిశాక ఆయన మీడియానుద్దేశించి మాట్లాడారు.
ఆయన ఏమన్నారంటే?
పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి 4,975 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీ చరిత్రలో ఇంతమంది పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు పాల్గొన్న సందర్భం లేదు. మొత్తం 45 దేశాల నుంచి 640 విదేశీ ప్రతినిధులు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 1,135 మంది. 1,250 మంది పారిశ్రామిక ప్రతినిధులు వచ్చారు. 41 సెషన్లలో 190 మంది స్పీకర్లు పాల్గొన్నారు. 24 ద్వైపాక్షిక, 16 బిజినెస్, ఎనిమిది విదేశీ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాం. ఈ సదస్సులో పెట్టుబడులపైనే కాదు.. తొలిసారిగా నాలెడ్జి ఎక్సే ్చంజిపై కూడా చర్చ జరిగింది.
613 ఎంవోయూలు.. రూ.13.25,715 కోట్ల పెట్టుబడులు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో రాష్ట్రంలో రూ. 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాం. ఈ సమ్మిట్‌లో 613 ఎంయూలు, రూ.13,25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 16,31 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి.
ఏ రంగానికి ఎన్ని పెట్టుబడులంటే..
+ ఎనర్జీ ః 63 ఎంవోయూలు.. రూ.5.33,350 కోట్ల పెట్టుబడులు. 2.66 లక్షల ఉద్యోగాలు
పరిశ్రమలుః 193 ఎంవోయూలు. రూ.2.83,380 కోట్ల పెట్టుబడులు. 5.19 లక్షల ఉద్యోగాలు
ఇన్ఫ్రాస్ట్రక్చర్ః రూ.2,01,750 కోట్ల పెట్టుబడులు.. 3 లక్షల ఉద్యోగాలు
ఐటీః 107 ఎంవోయూలు.. రూ.1.59,457 కోట్ల పెట్టుబడులు 2.96,315 ఉద్యోగాలు
ఏపీసీఆర్డీయేః 41 ఎంవోయూలు.. రూ. 47,011 కోట్ల పెట్టుబడులు.. 41 వేల ఉద్యోగాలు
టూరిజంః 112 ఎంవోయూలు.. రూ.21,036 కోట్ల పెట్టుబడులు.. 1,05,800 ఉద్యోగాలు
ఫుడ్ ప్రాసెసింగ్ ః 35 ఎంవోయూలు రూ.13,800 కోట్ల పెట్టుబడులు.. 47,390 ఉద్యోగాలు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ః 8 ఎంయూలు.. రూ.4,944 కోట్ల పెట్టుబడులు.. 12 వేల ఉద్యోగాలు..
టెక్స్‌టైల్ ః 7 ఎంవోయూలు.. రూ.4,490 కోట్ల పెట్టుబడులు.. 8,450 ఉద్యోగాలు
హెల్త్ః 3 ఎంవోయూలు.. రూ. 4,225 కోట్ల పెట్టుబడులు.. 24 వేల ఉద్యోగాలు
ఎడ్యుకేషన్ః 4 ఎంవోయూలు.. రూ.3,059 కోట్ల పెట్టుబడులు..3 వేల ఉద్యోగాలు.
మల్టీ డిపార్ట్‌మెంట్లు ః రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
1 గిగావాట్ రిలయెన్స్ డేటా సెంటర్..
విశాఖపట్నంలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో నేను ఏడు సార్లు సమ్మిట్లు పెట్టాను. విశాఖలో ఈ సమ్మిట్ సూపర్ హిట్ అయింది. ఇది ఒక చరిత్ర
ఒక సమ్మిట్ పెట్టినప్పుడు ఎంవోయూలకే ప్రాధాన్యం ఇవ్వడం కాదు.. ప్రపంచ నాలెడ్జిని ఇక్కడ చర్చించాలన్న ఆలోచనతో పెట్టాం. దోవోస్ సమ్మిట్‌లో ఎంవోయూలుండవు. భవిష్యత్ ఎలా పోతుందన్న దానిపై చర్చ జరుగుతుంది. అదే మాదిరిగా విశాఖలోనూ చేశాం. ఇక్కడ హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చాం. పెట్టుబడిదార్లను రమ్మని ఎంవోయూలు చేశాం. ఎక్కువ చర్చలకు ప్రాధాన్యం ఇచ్చాం. 650 మంది అంతర్జాతీయ డెలిగేట్లు, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో, వారి నాలెడ్జి షేర్ చే శాం. 500 మంది స్టూడెంట్లను ఎంపిక చేసి వారి ఆలోచనా విధానంలో మార్పు కోసం తీసుకొచ్చాం.
నూరు శాతం గ్రౌండ్ అవుతాయి..
విశాఖ సమ్మిట్‌లో కుదుర్చుకున్న రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాలుస్తాయి. వీటితో పాటు ఇప్పటికే కుదుర్చుకున్న రూ.8.57 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఈ సీరియస్‌నెస్‌తోనే ఎంవోయూలు చేసుకున్నాం. వీటిపై నెలకోసారి సమీక్ష చేస్తాం. మూడున్నరేళ్ల కాల పరిమితిలో ఇవి అందుబాటులోకి తీసుకురావాలని నిర్దేశించాం. మా సంకల్పానికి కేంద్రం కూడా సహకరిస్తోంది. రాష్ట్రంలో పరిశ్రమల ప్రోత్సాహానికి 25 పాలసీలు తెచ్చాం. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను జనవరి నాటికి అందుబాటులోకి తెస్తాం. అక్కడ తయారయ్యే కంప్యూటర్లను ప్రపంచానికి మనమే అందిస్తాం. విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ వస్తోంది. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గూగుల్ వస్తోంది. దాంతో పాటు మరో ఐదారుగురు డేటా సెంటర్లు పెడతామని ముందుకొచ్చారు.
2019–24 ఒక బ్యాడ్ పిరియడ్.
రాష్ట్రంలో 2019–24 వరకు ఒక బ్యాడ్ పీరియడ్. ఆ సమయంలో సోలార్ రంగాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారు. కరెంటు వాడకుండా తొమ్మిది వేల కోట్లు చెల్లించారు. ఆ ఐదేళ్లు రాష్ట్రం చాలా నష్టపోయింది. సింగపూర్‌లాంటి ప్రభుత్వంతో గొడవపడ్డారు. మేం వెళ్లి విశ్వసనీయత పెంచాం. వారు మనకు నాలెడ్జి షేర్ చేయడానికి ముందుకొచ్చారు. ఏపీ ప్రభుత్వంపై విశ్వసనీయత పెంచడానికి ఎస్క్రోని తెస్తున్నాం. వనరులన్నీ వినియోగించుకుంటూ ముందుకు పోతాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఎంవోయూలపై కూడా సానుకూలంగానే సమీక్షిస్తాం. వాటిని కొనసాగిస్తాం.
అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం..
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కర్నూలు ఓవర్వకల్లులో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ పెట్టాం. రాయలసీమలో డ్రోన్ సిటీ, హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఐటీకి అనుకూలతలున్నందున విశాఖను, క్వాంటమ్ కంప్యూటర్ కోసం అమరావతిని ఎంచుకున్నాం. వచ్చే ఏడాది ఇదే తేదీల్లో విశాఖలోనే పార్టనర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తాం.
సూపర్ సిక్స్ సూపర్‌హిట్ చేస్తున్నాం.
మేం పాలనలోకి వచ్చాక అభివృద్ధిప ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేస్తున్నాం. సూపర్ సిక్స్‌లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం. ఇప్పుడు 24 లక్షలు వస్తున్నాయి. రాష్ట్రంలో పదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు, పది ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నాం. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అధికార వికేంద్రీకరణ చేస్తున్నాం. మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.
ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు లాజిస్టిక్స్ డెవలప్ చేస్తాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా, కోస్తాంధ్రను ఆక్వా కల్చర్ హబ్‌గా తయారు చేస్తాం.
విశాఖ ఉక్కుకు రూ.12 వేల కోట్లు ఇప్పించాం..
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటు పరం చేయరు. ప్రైవేటీకరణ జరగదని మీ ఇంటికొచ్చి చెప్పాలా? ఈ ప్లాంట్‌కు కేంద్రం నుంచి రూ.12 వేల కోట్లిచ్చి ఆదుకున్నాం. కరెంటు చార్జీలు, ప్రాపర్టీ ట్యాక్సులను వదులుకున్నాం. స్టీల్ ప్లాంటు బంగారు గని. ప్లాంటు కార్మికులు ప్రొఫెషనల్‌గా పని చేయాలి. అలా పనిచేయకుండా వైట్ ఎలిఫెంట్‌లా మారిస్తే ఎలా? ప్లాంట్ నష్టాల్లోకి ఎందుకొచ్చింది? నష్టాలొస్తే ప్రభుత్వం ఎక్కడి నుంచి డబ్బు తెస్తుంది?
మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానిని ఒప్పించా..
అనకాపల్లి జిల్లాలో ఏర్పాటవుతున్న ఆర్సెలార్ మిట్టల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్లియరెన్స్ కోసం ఉక్కు మంత్రి కుమారస్వామిని కలిశాను. ఆపై ప్రధానిని కలిసి ఒప్పించాను. ఈ ప్లాంట్‌కు భూమి ఇచ్చాం స్లర్రీ పైప్‌లైన్ ద్వారా ముడిసరకు రవాణాకు. క్లియరెన్స్‌ను తెప్పించాం. ఈ ప్లాంట్ ద్వారా రూ.లక్షా 35 వేల కోట్ల పెట్టుబడులొస్తున్నాయి. ఉమ్మడి విశాఖలో అత్యధిక స్టీల్ ఉత్పత్తి దీని ద్వారానే వస్తుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
అందుకే ఏపీ పెట్టుబడులుః లోకేష్
ఏపీలో పెట్టుబడులు ఎందుకు పెట్టాలని కొంతమంది తనను అడిగారని మీడియా సమావేశంలో మంత్రి లోకేష్ చెప్పారు. దానికి తాను.. ఏపీలో అనుభవం ఉన్న నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డబుల్ ఇంజిన్ సర్కారు ఉందని చెప్పానని తెలిపారు. వాటికి సంతృప్తి చెంది పెద్ద ఎత్తున పెట్టుబడులకు ముందుకొచ్చారని పేర్కొన్నారు. తాము మిసైళ్లు లాంటి వారమని, చంద్రబాబు జీపీఎస్ వంటి వారని, ఆయన మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్తున్నామని లోకేష్ చెప్పారు.
Next Story

