పోలీసు శాఖలో మొదలైన కొత్త లొల్లి
x

పోలీసు శాఖలో మొదలైన కొత్త లొల్లి

స్పెషల్ పోలీసు(Special police) సిబ్బందిని వరుసగా 26 రోజులు పనిచేయించుకుని కేవలం నాలుగు రోజులు మాత్రమే సెలవులిచ్చి ఇంటికి పంపుతున్నారట.


తెలంగాణా పోలీసు శాఖలో కొత్త లొల్లి మొదలైంది. అదేమిటంటే స్పెషల్ పోలీసు(Special police) సిబ్బందిని వరుసగా 26 రోజులు పనిచేయించుకుని కేవలం నాలుగు రోజులు మాత్రమే సెలవులిచ్చి ఇంటికి పంపుతున్నారట. గతంలో నెలకు 8 రోజుల సెలవులను రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం నాలుగురోజులకు తగ్గించిందని పెద్ద లొల్లి మొదలైపోయింది. ఈ విషయమై స్పెషల్ పోలీసులు ఎవరూ గోల చేయలేదు. ఇపుడు గోలచేస్తున్నదంతా పోలీసుల భార్యలు మాత్రమే. రోజుకొక ఊరిలో పోలీసుల భార్యలు రోడ్డెక్కి గోల చేస్తున్నారంటేనే వీళ్ళ వెనకాల ఎవరున్నారో ? వెనక ఉన్నవాళ్ళ పొలిటికల్ అజెండా (Political Agenda)ఏమిటో అర్ధమైపోతోంది. పోలీసులు(Police) మూడురోజుల క్రితం నల్గొండ(Nalgonda)లో రోడ్డెక్కగానే వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS working President) కేటీఆర్(KTR) తో పాటు నేతలు చాలామంది వాళ్ళకి మద్దతుగా నిలబడ్డారు. దాంతో విషయం కాస్త రాజకీయ రంగుపులుముకుంది.

గురువారం ఉదయం సిరిసిల్ల(Sircilla)లో కూడా స్పెషల్ పోలీసుల భార్యలు ఇదే రకమైన గోలతో రోడ్డుమీదకు వచ్చి నానా రచ్చ చేశారు. ఈరోజు ఒక యువతి ప్రభుత్వాన్ని ఉద్దేశించి వేసిన కొన్ని ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఏ ఉద్యోగికి అయినా నెలలో నాలుగు ఆదివారాలు+ రెండో శనివారం సెలవు దినాలుగా ఉంటాయి. అదే పద్దతిలో స్పెషల్ పోలీసులకు కూడా నెలకు నాలుగురోజులు సెలవులున్నాయి. 26 రోజులు పనిచేయించుకుని నాలుగు రోజులు మాత్రమే సెలవులిస్తున్నారని పోలీసుల భార్యలు అడగటమే విచిత్రంగా ఉంది. కేసీఆర్ హయాంలో సెలవులు 8 రోజులుంటే ఇపుడు నాలుగు రోజులకు కుదించారని పోలీసుల భార్యలు మండిపోతున్నారు. నిజానికి అప్పట్లో కేసీఆర్ వీళ్ళకు 8 రోజులు సెలవులు ఎలాగిచ్చారో అర్ధంకావటంలేదు.

ఇక రెండో పాయింట్ ఏమిటంటే తమ భర్తలతో లోపల మట్టిపని, కూలీపని, చెత్త ఏరే పనులు చేయిస్తున్నారంటు గోలచేశారు. తమ భర్తలు పోలీసులా లేకపోతే కూలీలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలీసు శాఖలోని కొన్ని విభాగాల్లో హెడ్ క్వార్టర్స్, శిక్షణా కేంద్రాలు లాంటి కొన్ని ప్రాంతాల్లో పనులు చేయించటం చాలా సహజం. మట్టిపనులు, మొక్కలు నాటటం, చెట్ల కొమ్మలను ట్రిమ్మింగ్ చేయటం లాంటి పనులను కానిస్టేబుళ్ళ, హెడ్ కానిస్టేబుళ్ళతోనే చేయిస్తుంటారు. ఇలాంటి పనులే మిలిట్రీలో కూడా చేయించటం అందరికీ తెలిసిందే. మట్టిపనులు, చెత్త ఏరే పనులు చేయించినంత మాత్రాన పోలీసులు కూలీలు ఎందుకవుతారు ? మూడో పాయింట్ ప్రభుత్వ ఉద్యోగి అన్న కారణంగానే తాము వివాహం చేసుకున్నాము కాబట్టి తమ భర్తలు తమతోనే ఉండాలని పదేపదే డిమాండ్లు చేశారు.

ఎంత ప్రభుత్వ ఉద్యోగం అయినంత మాత్రాన తమ భర్తలు తమతోనే ఉండాలని భార్యలు డిమాండ్ చేయటం ఏమిటో అర్ధంకావటంలేదు. భర్తలు ఉద్యోగాలు చేయాలా లేకపోతే ఇంట్లో వీళ్ళపక్కనే ఉండాలా ? మారుమూల ప్రాంతాలకు పోలీసులను బదిలీ చేసినపుడు వివిధ కారణాలతో కుటుంబాలను పోలీసులు పట్టణాల్లోనే వదిలేసి తాము మాత్రమే తమకు పోస్టింగ్ ఇచ్చిన మారుమూల ప్రాంతాలకు వెళ్ళటం చాలా మామూలు. ఈ పద్దతి పోలీసు శాఖలోనే కాదు అన్నీ శాఖల్లోను జరుగుతున్నదే. పనిచేసే ప్రాంతంలో సౌకర్యాలు లేనపుడు సౌకర్యాలున్న ప్రాంతంలో కుటుంబాలను వదిలి తాము మాత్రం పోస్టింగ్ ఇచ్చిన ప్రాంతంలో డ్యూటీ చేయటం చాలా మామూలే కదా. పోలీసు శాఖలో ఖాళీలు భర్తీ చేయని కారణంగా ఉన్న సిబ్బందిపైన భారం పడుతోందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నదే. ఈ ఆరోపణ ఒక్క పోలీసు శాఖలోనే కాదు చాలా శాఖల్లో ఉన్నదే.

అత్యసర సేవలు అందించే వైద్య, ఆరోగ్యం, ఫైర్ సర్వీస్, ప్రజారోగ్యం, శానిటేషన్ లాంటి శాఖల్లాంటిదే పోలీసు శాఖ కూడా. ఇందులోని సిబ్బందిని పెళ్ళి చేసుకునే ముందు వాళ్ళ డ్యూటీలు, పనివేళల విషయం గురించి తెలుసుకుని ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగి అని తాము వివాహం చేసుకున్నామని చెబుతునే తమ భర్తలు తమతోనే ఉండాలని ఇపుడు రోడ్డెక్కటం ఆశ్చర్యంగా ఉంది. పోలీసు శాఖలో మావోయిస్టుల(Maoists) ను ఏరివేసే విభాగాల్లో ఒకటైన గ్రే హౌండ్స్ (Grey Hounds)లో పనిచేసే సిబ్బంది రోజుల తరబడి అడవుల్లోనే కూంబింగ్ (Combing)పేరుతో తిరుగుతుంటారు. అదికూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ డ్యూటీ చేస్తుంటారు. అలాంటి డ్యూటీలు చేసే సిబ్బందికి ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన వెసులుబాట్లు, అలవెన్సులు ఇవ్వటం అందరికీ తెలిసిందే. ఇలా గ్రేహౌండ్స్ వింగ్ లో పనిచేసే సిబ్బంది భార్యలు కూడా స్టేట్ పోలీసుల భార్యలు రోడ్డెక్కినట్లే రోడ్డెక్కితే అప్పుడు ప్రభుత్వం పరిస్ధితి ఏమిటి ? హేమిటో కంపు రాజకీయాలు ఎక్కువైపోయి ప్రతిదీ రాజకీయం అయిపోతోంది.

Read More
Next Story