జాతీయ జెండా ఓ ఉద్వేగం..ఓ స్ఫూర్తి
x

జాతీయ జెండా ఓ ఉద్వేగం..ఓ స్ఫూర్తి

జాతీయ పతాకాన్ని రూపొందించింది తెలుగువారు కావడం గర్వకారణమని సీఎం చంద్రబాబు అన్నారు.


జాతీయ జెండా ఓ ఉద్వేగం..ఓ స్ఫూర్తి అని సీఎం చంద్రబాబు అన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదం లేకుండా దేశమంత ఒకటే అనే జాతీయ భావన పెంపొందించడమే హర్‌ ఘర్‌ తిరంగా లక్ష్యమని అన్నారు. సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ముందుగా జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పింగళి వెంకయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తిరంగా అంటే కేవలం ఇంటిపై జెండా ఎగరేయడం కాదని, దేశభక్తిని పెంచే సంకల్పమన్నారు. గతంలో ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అనేక కార్యక్రమాలకు నేను హాజరయ్యానని, కానీ హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందాన్నిస్తోందని అన్నారు. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఉద్వేగం కలుగుతుందో అదే మువ్వన్నెల జెండా అని సీఎం అన్నారు.

ప్రపంచంలోనే అతి శక్తివంతమైన జాతీయ జెండాను మన తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య రూపొందించడం మనందరికీ గర్వకారణం. జెండా అంటే కేవలం ఒక వస్త్రం కాదు. మన దేశ గౌరవం. జాతీయ జెండా చూడగానే మనందరిలో ఉద్వేగం, దేశభక్తి కలుగుతుందన్నారు. 1857లో ప్రధమ స్వాతంత్య్ర పోరాటం జరగ్గా అంతకముందే బ్రిటీష్‌ వారిపై తెలుగు వారు పోరాటం చేశారు. బ్రిటీష్‌ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు, తుపాకీ గుళ్లకు గుండె చూపించిన టంగుటూరి, గొట్టిపాటి బ్రహ్మయ్య, సర్దార్‌ గౌతు లచ్చన్న, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య వంటి స్వాతంత్య్ర సమరయోధులు తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టమని చంద్రబాబు పేర్కొన్నారు.
దేశ సమగ్రత విషయంలో భారత్‌ ఎవరికీ తలవంచదని, కార్గిల్‌ యుద్ధం, పహల్గామ్‌ ఘటన జరిగినప్పుడు దేశ ప్రజానీకం ఒక్క తాటిపై నిలిచిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న మన సైనికులకు సెల్యూట్‌ చేస్తున్నా అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ రూపంలో మన దేశానికి సమర్థవంతమైన నాయకత్వం లభించింది. 11 ఏళ్ల మోదీ పాలనలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది. 2028కి 3వ స్థానానికి చేరుతుంది. 2047లో వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి ప్రపంచంలోనే శక్తివంతంగా మనదేశం నిలుస్తుంది. 2047 నాటికి దేశంలో ఏపీ నెంబర్‌ వన్‌ రాష్ట్రం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మనది డెడ్‌ ఎకానమీ అన్నారు. ఎవరిది డెడ్‌ ఎకానమీనో భవిష్యత్‌ నిర్ణయిస్తుంది. మనపై సుంకాలు వేయడం తాత్కాలికమే. మనది గుడ్‌ ఎకానమీ. మన భారతీయుల సేవలు ప్రపంచానికి చాలా అవసరం. తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు 1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. 1995లో ఐటీ విప్లవం వచ్చింది. దాన్ని మనం అందిపుచ్చుకుని ముందుకెళ్లాం. ఐటీని ప్రమోట్‌ చేసేందుకు హైటెక్‌ సిటీ కట్టాం. నేడు ఏపీలో క్వాంటమ్‌ వ్యాలీ తీసుకొస్తున్నాం. యువత ఎక్కువగా ఉండే దేశం మనది. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని స్థిరమైన అభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళదాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
Read More
Next Story