మొంథా తుపాను.. మాకు నేర్పిన పాఠాలెన్నో...
x
ఉప్పాడ వద్ద ఆనకట్టను కోసేస్తున్న సముద్రం

మొంథా తుపాను.. మాకు నేర్పిన పాఠాలెన్నో...

ఏపీలో తుపాను ప్రభావం ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ టీమ్ కు పలు అనుభవాలు నేర్పింది. తుపాను సమయంలో సముద్ర తీరంలో తిరుగుతూ రిపోర్టు చేయడం నాకు మొదటి అనుభవం.


అక్టోబర్ 27, 2025 సోమవారం సాయంత్రం... మొంథా తుపాన్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. మీడియాలో హోరెత్తుతోంది. ఇంతలో 'ది ఫెడరల్' తెలుగు రాష్ట్రాల ఎడిటర్ 'జింకా నాగరాజు' గారి నుంచి ఫోన్... 'ఎక్కడున్నారు? అర్జంటుగా కాకినాడ వెళ్లాలి. వెంటనే బయల్దేరండి' అని ఆదేశం. ఉన్నపళంగా 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' టీమ్ విజయవాడ నుంచి బయలుదేరి కాకినాడ కు రాత్రి 10.30 గంటలకు చేరుకుంది. ఇక అక్కడి నుంచి మా టీమ్ కి ప్రకృతి ప్రళయం ఎలా ఉంటుందో తెలిసింది. ఆ ప్రకృతి ఎన్నో పాఠాలు నేర్పింది...

మంగళవారం ఉదయాన్నే హోటల్ రూము నుంచి ఉప్పాడ తీరం వరకు ప్రయాణించి, తుపాను ప్రభావాన్ని ప్రత్యక్షంగా ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ టీమ్ పరిశీలించింది. ఉప్పాడ తీరానికి వెళుతూ పిఠాపురంలో టిఫిన్ చేస్తుండగా తాటాకు పాకలో చూరు నీరు పడి చొక్కా మరకలు పడిన అనుభవం కూడా ఈ ప్రయాణంలో భాగమే. ఉప్పాడలో వైఎస్ఆర్ బొమ్మ సర్కిల్ వద్ద పోలీసు చెక్ పోస్టు అడ్డుపడినా, జర్నలిస్టులుగా పరిచయం చేసుకుని తీరం చేరుకున్నాం. ముందుగా అక్కడి పరిస్థితిని ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ఛానల్ కు ఒక న్యూస్ బులిటిన్ అందించాము. ఆ తరువాత తీర ప్రాంతం అంతా కలియతిరిగాము. ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని వివరిస్తూ ఐదు న్యూస్ బులిటిన్స్ ఛానల్ కు అందించాము. రాత్రి ఎనిమిదిన్నరకు పోలీసులు సముద్రం వైపు వెళ్లనివ్వకపోవడంతో ఒక హోటల్ వద్ద కాసేపు కూర్చుని వర్షంలోనే బయలుదేరి కాకినాడ కు తిరిగి చేరుకున్నాం. విపరీత గాలికి కారు ఊగిపోయినా, టీమ్ పట్టుదల కోల్పోలేదు.

బుధవారం ఉదయం మళ్లీ ఉప్పాడ చేరి, అలల తాకిడి తగ్గిన వైనాన్ని వీడియో రికార్డు చేశాం. స్థానికుల సహాయంతో అన్ని ప్రాంతాలను సందర్శించాం. చిత్రాడలో లారీ డ్రైవర్లతో మాట్లాడి, ప్రతి ఇంటికీ ఒక డ్రైవర్ ఉన్న ప్రత్యేకత తెలుసుకున్నాం. తాడేపల్లిగూడెం నుంచి ఉప్పాడ మీదుగా విజయవాడ చేరుకునే వరకు పంట నష్టాన్ని పరిశీలించాం.


ఉప్పాడ తీరం వద్ద పడవలు లంగర్ వేసిన ప్రాంతంలో వీడియో చేస్తూ...

మొంథా తుపాన్ బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలను బీభత్సానికి గురిచేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ, మూలపేట వంటి గ్రామాల్లో మత్స్యకారుల జీవితాలు తలకిందులయ్యాయి. ఈ గ్రామాలు తీరాన్ని ఆనుకుని ఉంటాయి. తుపాను ముందు మూడు రోజులు, తరువాత మరో మూడు రోజులు సముద్రంలోకి వెళ్లలేకపోయిన జాలర్లు ఉపాధి కోల్పోయి నిరాశలో మునిగారు. ఈ విపత్తు ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' టీమ్, మానవీయ కోణంలో ఈ దృశ్యాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ, అధికారుల చర్యలు, ప్రజల ఆవేదనలను లోతుగా అన్వేషించి వీడియోల ద్వారా ప్రజలకు అందించింది.


తుపాను హెచ్చరికతో తీరం బయట ఆపివేసిన ఉప్పాడ మత్స్యకారుల పడవలు

ఉపాధి కోల్పోయిన జాలర్లు

తుపాను ప్రభావం తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులను కనీసం వారం రోజుల పాటు ఉపాధి లేకుండా చేసింది. సముద్ర అలలు విపరీతంగా ఎగసిపడుతుండటంతో, పడవలు లంగరు వేసి మత్స్యకారులు ఆపివేయాల్సి వచ్చింది. ఉప్పాడ గ్రామానికి చెందిన సుమారు 7 వేల పడవలు తీరం వెంబడి నిలిచిపోయాయి. తుపాను సమయంలో జాలర్లు తమ వలలను బాగుచేసుకుంటూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లి భోజనం చేసి వస్తూ కనిపించారు. మంగళవారం తుపాను హడావుడి వల్ల పునరావాస కేంద్రాలు, మత్స్యకారులు స్వయంగా నిర్మించుకున్న షెల్టర్ల నుంచి ఎవరూ బయటకు రాలేదు. మత్స్యకారుల ముఖాల్లో బాధ స్పష్టంగా కనిపించింది. కొందరు ఆడ వాళ్లు సముద్రునికి మొక్కులు తీరుస్తూ, దేవుని దయ కోసం ప్రార్థిస్తున్న దృశ్యాలు హృదయాన్ని తాకాయి.

అక్టోబర్ 28న ఉప్పాడ తీరం వెంబడి అలలు ఎగసిపడుతుండటంతో, స్థానికులు, కాకినాడ నుంచి ఎక్కువ మంది చూసేందుకు వచ్చారు. ఇక మీడియా హడావుడి ఎలాగూ ఉంది. సందర్శకులు మాత్రం ఒకరితో ఒకరు చర్చించుకుంటూ, భయంతో పాటు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తీరాన్ని ఆనుకుని ఉన్న ఇళ్లు సముద్ర అలల తాకిడికి కొన్ని సముద్రంలో కలిసిపోయాయి. "తుపాను సమయంలో అలలు ఇలా విపరీతంగా వస్తాయి" అని స్థానికులు చెప్పారు. మూలపేట పోర్టులో ఎగసి పడుతున్న అలలను చూస్తూ ఒక పక్క ఆనందం, మరో పక్క అక్కడి నుంచి వీడియోలో ఏమి చెప్పాలనే ఆలోచన కాసేపు మనసును కలవర పరిచేలా చేశాయి.

మొదట ఉప్పాడ తీరంలో ఎగసి పడుతున్న అలల ముందు నిలబడి అక్కడి పరిస్థితిని వీడియో ద్వారా వివరించాను. ఆ సమయంలో అలలు పైకి ఎగసి నెత్తిపై నుంచి అవతలికి దూకుతున్నాయి. అయినా జియో ట్యూబ్ (గతంలో ప్రభుత్వం సముద్రపు అలలు ముందుకు రాకుండా నిర్మించిన ఆనకట్ట)పై నిలబడి చలికి వణుకుతూనే వీడియో తీశాము. ఆ తరువాత మూలపేట హార్బర్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే సెక్యూరిటీ వారు అంగీకరించ లేదు. పనులు చేపట్టిన కంపెనీ వారితో మాట్లాడిన తరువాత లోపలికి వెళ్లేందుకు అంగీకరించారు.

హార్బర్ లో నిర్మిస్తున్న టవర్స్ పై సముద్రపు నీరు అప్పుడప్పుడే ఒక మీటర్ ఎత్తు వరకు లేచాయి. హార్బర్ నిర్మాణం ప్రస్తుతం జరుగుతోందని, ఇంకా నిర్మాణం జరగాల్సి ఉందని అక్కడి వారు చెప్పారు. హార్బర్ లో సముద్ర తీరం వద్ద అక్కడక్కడ పెద్ద భవనాలు నిర్మించారు. హార్బర్ అలల తాకిడిని తట్టుకునేందుకు కిలో మీటరు దూరంలో సముద్రంలో నిర్మంచిన ఆనకట్ట కూడా చాలా వరకు తుపాన్ ప్రభావానికి మునిగిపోయింది. 'ది ఫెడరల్' టీమ్ పట్టుదలతో అక్కడి పరిస్థితిని పరిశీలించింది. హార్బర్ లోని పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియోను ఛానల్ ద్వారా అందించింది.


మూలపేట హార్బర్ వద్ద వీడియో చెబుతూ...

చలి, గాలి, వర్షం, హడావుడి...

మొంథా తుపాను వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవించాయి. మబ్బులు అల్లుకు పోయి ఒకసారి చీకటి పడినట్లు కనిపించింది. చలి గాలులు, సన్నటి వర్షం, ఒక్కోసారి భారీ వర్షం కురిసాయి. ఒక సారి ఎండ, మరో సారి విపరీత మైన గాలి వీచింది. జర్కిన్ వేసుకుంటే ఒక సందర్భంలో ఉక్కపోత, చమటలు పట్టాయి. మంగళవారం ఉదయం కాకినాడ రేంజ్ డీఐజీ ఉప్పాడ తీరాన్ని సందర్శించారు. పోలీసుల హడావుడి ఎక్కువగా ఉంది. కాకినాడ నుంచి పిఠాపురం మీదుగా ఉప్పాడకు వెళ్తుండగా, గాలి-వర్షం విపరీతంగా ఉండటంతో గొడుగు కూడా గాలికి కొట్టుకుపోయింది.

మంగళవారం రాత్రి సమయంలో వర్షం కురుస్తూ చెట్లు విరిగిపడ్డాయి. ముందస్తు చర్యల్లో భాగంగా కరెంటు ఆపివేయడంతో చీకటి ఎక్కువైంది. పునరావాస కేంద్రాల వద్ద మాత్రం జనరేటర్లతో లైటింగ్ ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రంతా జాగారం చేసిన ప్రజలు, అర్ధరాత్రి తరువాత విపరీత మైన గాలి-వర్షం శబ్దాలతో భయపడ్డారు. రేకుల షెడ్లు కొన్ని చోట్ల లేచిపోయాయి. మట్టి గోడలు కూలిపోయాయి.


పంట నేలపాలైన వివరాలు చెబుతున్న చాగొల్లుకు చెందిన రైతు బద్దిరెడ్డి అప్పారావు

పంట నష్టం, రైతుల నిరాశ

తుపాన్ ప్రభావం తగ్గిన పరిస్థితిని వీడియో ద్వారా వివరిస్తూ ఉప్పాడ నుంచి బయలుదేరి తిరిగి మధ్యాహ్నం కు కాకినాడ చేరుకున్నాము. ఇక హోటల్ రూము ఖాళీ చేసి విజయవాడ వైపు బయలుదేరాము. అప్పటికే టిఫిన్ టైం దాటిపోయింది. సర్పవరం సెంటర్ లో ఉన్న ఒక హోటల్ వాళ్లు దోశ మాత్రమే ఉందన్నారు. పన్నెండున్నరకు మనిషికో దోశ తిని నేను, కెమెరా మెన్ రవి, కారు డ్రైవర్ శేఖర్ కలిసి సామర్లకోట రోడ్డు, రాజానగరం రోడ్డు, తంగిడి గ్రామం మీదుగా చిత్రాడ గ్రామానికి చేరుకున్నాము.

అక్కడ లారీ డ్రైవర్లతో కాసేపు మాట్లాడాము. చిత్రాడ లో ప్రతి ఇంటికీ ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ ప్రత్యేకత గురించి తెలుసుకుని అక్కడి నుంచి బయలు దేరాము. తాడేపల్లిగూడెం మీదుగా పంగిరి, చాగొల్లు, నిడదవోలు, బ్రాహ్మణగూడెం, కోరిమామిడి, అప్పారావుపేట, భీమడోలు గ్రామాల మీదుగా ప్రయాణం చేశాము. చాగొల్లు లో దెబ్బతిన్న వరి పొలాలు, అరటి తోటలు పరిశీలించాము. చాగొల్లు లోని వరి పొలంలో రైతుతో మాట్లాడితే వరి చాపలా చుట్టేసిందని, వారం రోజులు ఉంటే కంకులు మొలకెత్తుతాయని చెప్పారు. ఇప్పుడు కోద్దామంటే ఈ నీళ్లలో సాధ్యం కాదన్నారు. ప్రభుత్వ సాయం గురించి రైతు బద్దిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ అంతా వారి దయ అంటూ ఆకాశం వైపు చేతులు చూపించి నిరాశ వ్యక్తం చేశారు.

మరో రైతు సైకిల్ పై పొలం వద్దకు కారు ముందు నుంచి వచ్చి రోడ్డు పై నుంచి పడిపోయిన వరి పొలాన్ని చూస్తూ బాధపడుతున్నారు. పెద్దాయనా ఈ పొలం ఎవరిది అని అడిగితే నాదేనండి అన్నాడు. ఏంటి ఇలా అయింది అంటే తుపాన్ కు పూర్తిగా నేల వాలింది. ఇది పనికొచ్చే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణగూడెం కు చెందిన ఈ రైతు ఎంతో బాధను వ్యక్తం చేశారు. ఇలా ప్రతి గ్రామంలోనూ పంట నష్టం ఎక్కువగానే జరిగింది. ప్రధానంగా వరి, అరటి తోటలు నేల వాలాయి.

రోడ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాకినాడ నుంచి తాడేపల్లిగూడెం వరకు ఉన్న రింగ్ రోడ్డులో 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించటానికి రెండు గంటలు పట్టింది. రోడ్డంతా ఎక్కడ చూసినా గోతులు, గుంటలు పడి నీటితో నిండిపోయి వాహనదారులను ఆందోళనకు గురిచేశాయి.

సంక్షోభ సమయంలో పని చేయడం ఓ అనుభూతి. అదే నిజమైన జర్నలిజం. హడావిడిగా రాసే చరిత్ర... అటువంటి హిస్టరీ రాసే అవకాశం లభించడం కూడా ఓ గొప్ప అనుభమే. ఆ అవకాశం కల్పించిన మా యాజమాన్యానికి, సంపాదక వర్గానికి, ప్రత్యేకించి మా చీఫ్ ఎడిటర్ శ్రీనివాసన్, ఎడిటర్ జింకా నాగరాజు గార్లకు కృతజ్ఞతలు.

Read More
Next Story