మంటలు రేపుతున్న ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం
x

మంటలు రేపుతున్న ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ఎందుకు? ప్రభుత్వం దీనిని ఎందుకు అమలు చేస్తోంది. ప్రతిపక్షాలు ఎందుకు వద్దంటున్నాయి.


ఎన్నికల కొలిమిలో ప్రస్తుతం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కాలుతోంది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చెప్పేందుకు ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చామని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చెబుతుంటే, భూ కబ్జాదారులకు, దళారులకు ఈ చట్టం వరంగా మారిందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

ఈ చట్టం ప్రకారం స్థిరాస్తి హక్కుల రిజిస్టర్, వివాద రిజిస్టర్, కొనుగోలు రిజిస్టర్‌ రూపొందిస్తారు. రిజిస్టర్‌లో నమోదైన విషయాలపై కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు.
ఏపీ భూహక్కుల చట్టం
ఆంధ్రప్రదేశ్‌ భూ హక్కుల చట్టం–2023 అక్టోబర్‌ 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.512 ద్వారా తెలిపింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో ఏపీ భూహక్కుల చట్టం అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం ద్వారా భూ యజమానులు, కొనుగోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఉంటుందని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.
ల్యాండ్‌ టైట్లింగ్‌ అధికారుల నియామకం
ఏపీ భూహక్కుల చట్టం ప్రకారం స్థిరాస్తి హక్కుల రిజిస్టర్‌ రూపొందిస్తారు. దీంతో స్థిరాస్తిని భూయజమాని తప్ప మరొకరు విక్రయించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదని చట్టంలో పేర్కొంది. రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్తులకు శాశ్వత రిజిస్టర్, వివాద రిజిష్టర్, కొనుగోలు రిజిస్టర్‌ రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ఏపీ ల్యాండ్‌ అథారిటీని ఏర్పాటు చేశారు. ఈ అధికారి మండల స్థాయిలో ల్యాండ్‌ టైట్లింగ్‌ అధికారులను నియమించారు.
కోర్టుకు వెళ్లే అవకాశం లేదు
ఇకపై భూమి హక్కులను రిజిస్టర్‌ చేసే బాధ్యత ఈ ల్యాండ్‌ టైట్లింగ్‌ అధికారులకు మాత్రమే ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. పలు దశల తర్వాత భూ యజమానులను శాశ్వత హక్కుదారులుగా టైట్లింగ్‌ అధికారి గుర్తిస్తారు. అనంతరం రిజిస్టర్‌లో వారి వివరాలు నమోదు చేస్తారు. దీనిపై ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదని ప్రభుత్వం తెలిపింది. కానీ ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఆశ్రయించవచ్చు. రాష్ట్ర స్థాయి రెవెన్యూ ట్రిబ్యునల్‌ తీర్పులపై హైకోర్టును ఆశ్రయించవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
ప్పటి వరకు రాష్ట్రంలో ఏమి జరిగింది
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 17వేల గ్రామ పంచాయతీలున్నాయి. 6వేల గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు రీ సర్వే పూర్తి అయింది. ఇంకా 11వేల గ్రామాల్లో రీ సర్వే జరగాల్సి ఉంది. రీ సర్వే పూర్తి అయిన తర్వాత ఆ సందర్భంగా తలెత్తే వివాదాలన్నీ ముందుగా పరిష్కారం చేసుకోవలసి ఉంటుంది.
టైటిల్‌ రిజిస్టర్‌లో ప్రతి భూమికి ఒక యూనిక్‌ నంబర్‌ను (రీసర్వేలోపేర్కొన్న మేరకు) కేటాయిస్తారు. ఆ రిజిస్టర్‌ భూములతో సంబంధం ఉండే ప్రతి విభాగానికి, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా ప్రతి బ్యాంకుకు ఆర్థిక సంస్థలకు అందుబాటులో ఉంటుంది. దీంతో ఆయా సంస్థలు రుణాలిచ్చే సమయంలో ఆ భూమికి సంబంధించిన లావా దేవీలన్నింటినీ ఆ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. కాబట్టి తదుపరి మోసాలకు తావుండదని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుత వివాదం ఏమిటి
ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ద్వారా ప్రభుత్వం కానీ, దళారులు కానీ భూములు లాగేసుకుంటారనే ఆరోపణలు వచ్చాయి. ఆన్‌లైన్‌లో రికార్డులు మార్చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. సివిల్‌ కోర్టులకు ఇకపై భూ వివాదాలు విచారించే అధికారాలు ఉండవనేది ఆరోపణ. ల్యాండ్‌ టైటిల్స్‌ రెవెన్యూ శాఖ ఎలా ఇస్తుందనేది ప్రశ్న. భూములకు సంబంధించిన అన్ని అధికారాలు టైటిల్‌ రిస్ట్రార్‌కే ఇస్తారని, ఆయన ఎమ్మెల్యే, ఎంపీ లేదా అధికార పార్టీ వాళ్లు చెప్పినట్లు ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేస్తారనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి.
చంద్రబాబు ఏమన్నారంటే..
పట్టాదారు పాస్‌ పుస్తకాలపై తన బొమ్మ వేసుకొని భూ యజమానులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్‌ను విమర్శించారు. ప్రజల ఆస్తులను కొట్టేసి భూ దందాలు చేసే వారికి అనుకూలంగా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రూపొందించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని రద్దు చేసి ప్రజలకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోటి వైఎస్‌ఆర్‌జిల్లా కడప నగరాల్లో గురువారం జరిగిన ప్రజాగళం సభల్లో ఆయన మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు.
మంత్రి బొత్సా మాటల్లో..
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ భూ హక్కుదారులకు ప్రయోజనం కలిగేలా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీసుకొస్తున్నాం. దళారి వ్యవస్థ ఉండకూడదని ఈ యాక్ట్‌ను తెస్తున్నాం. ఈ చట్టంపై ఎవరికీ అనుమానాలు వద్దు. ఈ చట్టం కింద జిరాక్స్‌ పేపర్లు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్‌ లేకపోతే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు పెట్టేవారమని చెప్పారు. ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను చట్టం చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సలహాలు, సూచనలు చేసిందని తెలిపారు.
సజ్జల ఏమన్నారో తెలుసా..
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ని తాము తీసుకొని రాలేదని, కేంద్రంలోని బిజెపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. చంద్రబాబు ఏదైనా అడగాలనుకుంటే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని కాదని, బిజెపీని అడగాలని చెప్పారు.
Read More
Next Story