ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ఏ పార్టీకి ఆయుధం
x

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ఏ పార్టీకి ఆయుధం

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ఈ ఎన్నికల్లో ఆయుధంగా మారింది. అధికార పార్టీ చట్టం మంచిదని చెబుతుంటే భూములు లాక్కునే చట్టమని ప్రతిపక్షం చెబుతోంది.


ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ఆయుధంగా మారింది. పొలం యజమానికి భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకేనని అధికార వైఎస్సార్‌సీపీ చెబుతుంటే, దళారులు, ప్రభుత్వంలో ఉండే పెద్దలు దోచుకోడానికేనని ప్రతిపక్షాలు ఓటర్లకు చెబుతున్నాయి. ప్రతి వేదికపై ప్రతిపక్షాలు ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం గురించి మాట్లాడుతున్నారు. ఆ చట్టంలో ఉన్న లోపాలపై వివరిస్తున్నారు. తప్పులని ప్రతిపక్షాలు భావిస్తున్న వాటిని మాత్రమే చెబుతూ మంచిని మరుగున వేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతున్నారు. ఈ చట్టం గురించి చంద్రబాబుకు ఏమీ తెలియదని, రైతులను రెచ్చగొట్టేందుకు ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు, లోకేష్‌లపై కేసు నమోదు
ప్రభుత్వం చేస్తున్న మంచిపనిని చెడ్డపనిగా చెప్పి ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం వల్ల జగన్‌ రైతుల భూములు లాక్కుంటారని ప్రచారం చేయడాన్ని ఎన్నికల నియమావళికి వ్యతిరేకమని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తాడేపల్లిలోని సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఐవీఆర్‌ సర్వే ద్వారా ఫోన్‌కాల్స్‌ ప్రతి సెల్‌ఫోన్‌ వినియోగదారునికి వెళుతున్నాయని, దీనిని వెంటనే నిరోదించాలని ఆ ఫిర్యాదులో కోరారు. దీంతో సీఐడీ సైబర్‌క్రైం పోలీసులు శనివారం రాత్రి 10.45 గంటలకు కేసు నమోదు చేశారు. సెక్షన్‌ సెక్షన్‌ 154 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియా నిర్వాహకులను నిందితులుగా పేర్కొన్నారు. వెంటనే విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాలని ఇప్పటికే సీఐడీని ఎన్నికల సంఘం ఆదేశించింది.
మొదలైన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం అమలు
ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం అమలు కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోంది. ఈ చట్టం కింద భూమి రికార్డులు పూర్తిగా డిజిటలైజ్‌ చేసి భూమి హక్కుదారులకు సర్వహక్కులు ఉండేలా చర్యలు తీసుకుని టైటిల్‌ ఖరారు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పర్యవేక్షణ జిల్లా కలెక్టర్‌లు, ఆర్డీవోలు, తహశీల్దార్‌లు చేస్తారు. అన్ని అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుని పరిశీలించి పరిష్కరించిన తరువాతనే హక్కు పత్రాలు ఇస్తారు. అప్పటికీ ఏవైనా సమస్యలు ఉంటే ఈ చట్టం అమలు కోసం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్‌కు వెళ్లొచ్చు. ఆ తరువాత ఉన్నత న్యాయస్థానానికి వెళ్లే విధంగా చట్టం రూపొందించారు. ఇప్పటికే మూడింట ఒక వంతు సర్వే పూర్తయింది. ఈ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తుందని చంద్రబాబు ఇప్పటికే పలు సార్లు ప్రకటించారు.
Read More
Next Story