న్యాయ వ్యవస్థ ఒక పట్టిష్టమైన పిల్లర్‌
x

న్యాయ వ్యవస్థ ఒక పట్టిష్టమైన పిల్లర్‌

ఏపీ హైకోర్టులో జాతీయ జెండాను అవిష్కరించిన చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌


ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ ఒక పట్టిష్టమైన పిల్లరని, సమాజంలో ఉత్పన్నమయ్యే వివిధ సమస్యలు, అంతర్రాష్ట్ర హక్కుల వివాదాలు వంటి సంక్లిష్ట అంశాలను న్యాయవ్యవస్థ ఎంతో సమర్ధవంతంగా పరిష్కరిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. దీంతో న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం విపరీతంగా పెరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈవేడుకలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ పతాకానికి సెల్యూట్‌ చేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చేందుకు ప్రాణాలను సైతం అర్పించిన మహానుభావులకు నివాళులు అర్పించారు. ఈసందర్భంగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో పొందుపర్చిన విధంగా దేశ ప్రజలందరికీ సమాన న్యాయం, సమానత్వం , స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను అందజేయాలనే లక్ష్యంలో భాగంగా న్యాయ వ్యవస్థ ఎంతగానో కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.

స్వరాజ్యం, స్వపరిపాలన భారతీయుల జన్మహక్కు అంటూ నినాదాలు చేస్తూ స్వాతంత్య్ర సాధనకై ఎంతో మంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వలస వాదుల పాన నుండి భారత దేశాన్నికి విముక్తి కలిగించారన్నారు. నేడు అటువంటి మహానుభావుల అందరినీ స్మరించుకుంటూ శిరస్సు వంచి ప్రణామాలు చేయాల్సిన శుభదినం అన్నారు. ఆ మహానుభావులు దేశానికి చెందిన సేవలను ప్రశంసిస్తూ వారి అడుగుజాడల్లో రాష్ట్ర ప్రజలు అందరూ నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. వారి దేశభక్తి, జాతీయవాదం ప్రస్తుత, రానున్న తరాలవారికి ఎంతో స్పూర్తిదాయకం అన్నారు. దేశ సమైఖ్యతను, సమగ్రతను కాపాడేందుకు సరిహద్దుల్లో నిరంతరం పాటుపడుతున్న సాయుధ ధళాల సేవలకు మనం అందరం ఎల్లవేళలా కృతజ్ఞులై ఉండాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు.
ఈ శుభ సందర్భంగా బలమైన, ఐక్యమైన, ప్రగతిశీల భారతదేశ నిర్మాణానికి మనమంతా అంకితమై ఉన్నామనే సంకల్పాన్ని పునరుద్ఘాటించు కోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. భారతదేశం తన సాంస్కృతిక వారసత్వం, ఆధునిక ప్రపంచ ధృక్కోణం, ధృఢమైన ప్రజాస్వామ్య స్తంభాల బలం ఆధారంగా, ప్రపంచ శక్తిగా అవతరించి, తన అభివృద్ధి మార్గాన్ని స్వయంగా సృష్టించుకుంటూ ముందుకు సాగుతోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు.
ఈ వేడుకల్లో భాగంగా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ధనంజయ, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్, బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు ద్వారకానాధ్‌ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె.చిదంబరం తదితరులు మాట్లాడారు. ఈ వేడుకల్లో పలువురు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, ఏపీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పి.సాంబశివ ప్రతాప్,ç ³బ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం.లక్ష్మీ నారాయణ, హైకోర్టు రిజిష్ట్రార్‌ జనరల్‌ పార్థసారధి, పలువురు ఇతర రిజిష్ట్రార్లు, సీనియర్‌ న్యాయవాదులు, బార్‌ అసోసియేషన్, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, ఎపి లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీ, ఎపి జ్యూడీషియల్‌ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read More
Next Story