ప్రమాద కరంగా కృష్ణా జలాల హక్కుల సమస్య
x
టి లక్ష్మీ నారాయణ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక.

ప్రమాద కరంగా కృష్ణా జలాల హక్కుల సమస్య

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల హక్కుల సమస్య ప్రమాద కరంగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ సమసగ్ర అధ్యయన వేదిక కన్వీనర్ టి లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.


కృష్ణా జలాల వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి లక్ష్మినారాయణ సోమవారం లేఖ రాశారు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు అసంబద్ధమైన విచారణ జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఈనెల 16,17 తేదీల్లో విచారణ జరుగుతున్నందున ప్రభుత్వం సమర్థులైన న్యాయ వాదులను నియమించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

కృష్ణా జలాల హక్కుల సమస్య ప్రమాదకరంగా పరిణమించింది. ఒక వైపున కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ - 2/ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య (అసంబద్దమైన) విచారణ జరుగుతున్నది. మరొక వైపు ఇదే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ - 2 / బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో ఇచ్చిన తీర్పుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ తో సహా పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టులో విచారణలు జరుగుతున్నాయి. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు అత్యంత కీలకమైనవిగా పరిణమించబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులు వాటిపై ఆధారపడి ఉన్నాయన్న విషయం మీకు విధితమే.

కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు రాజకీయ సంకల్పంతో న్యాయ పోరాటం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మరింత పట్టుదలతో పోరాడుతున్నది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ మరియు సుప్రీం కోర్టు ముందు తెలంగాణ రాష్ట్రం పక్షాన బలంగా వాదనలు వినిపించడానికి ఐదారు మంది న్యాయవాదులతో కూడిన బృందాన్ని 2024 నవంబరులోనే ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం జలవనరుల శాఖ సలహాదారుగా నియమించుకున్నది. ముఖ్యమంత్రి, జలవనరుల శాఖా మంత్రి మరియు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించి, ట్రిబ్యునల్ మరియు సుప్రీం కోర్టు విచారణల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అలసత్వం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. గత ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులు పట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రత్యేక న్యాయవాదుల బృందాన్ని కూడా నియమించలేదు. ట్రిబ్యునల్ మరియు సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ పక్షాన జలవనరులకు సంబంధించిన వ్యాజ్యాలలో వాదనలు వినిపించే న్యాయవాదులకు, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మధ్య సమర్థవంతంగా సమన్వయంచేస్తూ, పటిష్టమైన వాదనలు వినిపించడానికి అవసరమైన సమాచారాన్ని అందించే వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేసుకోకపోతే జరిగే నష్టాన్ని ఊహించడం చాలా కష్టం.

ఈ పూర్వరంగంలో 2025 జూలై 31 వరకు పదవీకాలం ఉన్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణను వేగవంతంగా కొనసాగిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం తన వాదనలను ట్రిబ్యునల్ ముందు వినిపించింది. తదుపరి విచారణ ఈ నెల 16, 17 తేదీలలో ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, సమర్థులైన న్యాయవాదుల బృందాన్ని నియమించి, కృష్ణా జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించడానికి యుద్ధ ప్రాతిపాదికన కార్యాచరణకు పూనుకోవాలని కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు.

- టి. లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్, విజయవాడ. మొబైల్ నెంబర్: 9490952221

Read More
Next Story