
అసమానతలు అలానే ఉన్నాయి
సమాజంలోని అసమానతలు పోవాలంటే ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అన్నారు.
స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అవుతున్నా భారత దేశంలో అసమానతలు అలానే ఉన్నాయని మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అన్నారు. సమాజంలోని ఆర్ధిక అసమానతలు పోవాలంటే ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ భవన ప్రారంగణంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించిన తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈసందర్భంగా చైర్మన్ మోషేన్ రాజు మాట్లాడుతూ ముందుగా 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్ళు అవుతున్నా ఇంకా సమాజంలోని అసమానతలు తొలగిపోలేదని అందుకు కారణం అందరికీ ఇంకా పూర్తి స్థాయిలో విద్యా వైద్య సౌకర్యాలు అందకపోవడమే అని పేర్కొన్నారు. కావున విద్యా వైద్య సేవలను పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికీ అందే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. విద్య ద్వారానే ప్రతి ఒక్కరికీ విజ్ణానం పెంపొంది, వారి హక్కులను వారు తెలుసుకుని వాటి సాధనకై కృషి చేయడం ద్వారా ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.