వీడియోతో ఆ ఘాతుకం వెలుగులోకి
x

వీడియోతో ఆ ఘాతుకం వెలుగులోకి

వేరే మహిళ మోజులో పడి భార్యను కట్టేసి గొడ్డును బాదినట్టు బాదిన భర్త.


మరో మహిళతో వివాహేతర సంబంధంలో మునిగి తేలుతున్న ఓ భర్త తన భార్య పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. కడవరకు తోడుంటానని బంధుమిత్రులు, పంచభూతాల సాక్షిగా పెళ్లాడిన భర్త మరో మహిళ మోజులో పడి చిత్ర హింసలకు గురి చేశాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డు చెబుతుందనే కసితో ఆమె చేతులను తాళ్లతో రెండు గుంజలకు కట్టేసి కొరడాతో ఇష్టమొచ్చినట్లు చావబాధాడు. ఈ ఘోరాన్ని మొబైల్‌తో వీడియో తీయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలం కలుజువ్వలపాడు ఎస్టీ కాలనీకి చెందిన గురునాథ్‌ బాలాజీ అనే వ్యక్తికి చాలా రోజుల క్రితమే పెళ్లైంది. అతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే ఉపాధి కోసం అతను నాలుగేళ్ల క్రితం చీరాలకు వలస వెళ్లాడు. తన భార్య పిల్లలను మాత్రం సొంతూరు కలుజువ్వలపాడులోనే ఉంచాడు. అప్పుడప్పుడూ అక్కడకు వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో తాను పని కోసం వలస వచ్చిన చీరాలలో మరో మహిళతో గురునాథ్‌ శివబాలజీకి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి తన భార్య పిల్లలను చూసేందుకు రావడం తగ్గించాడు. ఎప్పుడో ఒక సారి వచ్చి వెళ్లేవాడు, తన పిల్లలను, భార్యను పట్టించుకునే వాడు కాదు. అంతేకాకుండా అలా వచ్చిన సమయంలో తన భార్యను అకారణంగానే బెదిరించడం, కొట్టడం చేసేవాడు. కూలీ, నాలీ చేసుకుని తన పిల్లల కోసం దాచుకున్న డబ్బులను తన భార్య బలవంతంగా లాక్కుని వెళ్లేవాడు. ఈ రకమైన దాడులు ఈ మధ్య కాలంలో ఆమె మీద ఎక్కువయ్యాయి. తన ప్రియురాలిని తన ఊరికి తీసుకొని రావాలనే ఆలోచనలో ఎప్పటి నుంచో ఉన్న గురునాథ్‌ దానికి అడ్డు చెప్పకుండా ఉండేందుకు తన భార్య మీద విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతూ వచ్చాడు.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం గురునాథ్‌ సొంతూరులోకి ఎంట్రీ ఇచ్చాడు. తన మేనల్లుడితో పాటు తన ప్రియురాలిని కూడా వెంటబెట్టుకొచ్చాడు. అనంతరం తన భార్యను కలుజువ్వలపాడు గిరిజన కాలనీలోనే స్థానికంగా ఉన్న జగనన్న కాలనీలోని ఓ గృహంలోకి తీసుకెళ్లాడు భర్త గురునాథ్‌. అక్కడకు వెళ్లిన తర్వాత ఒక మృగంలా మారిపోయాడు. అప్పటికే ప్రియురాలి మోజులో పీకల్లోతులోకి కూరుకుని పోయిన అతనికి ఆమె తన భార్య అని, తనకు నలుగురు పిల్లలు ఉన్నారనే విషయాన్ని మర్చి పోయాడు. తన ప్రియురాలి కోసం వాళ్లందరిని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. తన ప్రియురాలి మీద ఉన్న మోజు తన భార్య పట్ల ద్వేషంగా మారింది. అప్పటికే కోపంతో ఊగిపోతున్న గురునాథ్‌ తన భార్య మీద దాడికి దిగాడు. తన భార్య చేతులను తాళ్లతో రెండు గుంజలకు కటేసి గొడ్డును బాదినట్లు చితక బాదాడు. ఆ దెబ్బలను తట్టుకోలేక కేకలుపెట్టి అల్లాడి పోతున్నా ఆమెను వదిలి పెట్టలేదు. ఇంకా రెచ్చిపోయి దాడికి తెగబడ్డాడు.
ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకున్న ఆమె స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి అదే రోజు ఈ దారుణాన్ని తీసుకెళ్లింది. స్పందించిన ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు కూడా స్పందించారు. ఓ పోలీసు కానిస్టేబుల్‌ వచ్చి బాధితురాలి ఫొటోలు కూడా తీసుకెళ్లాడు. అయితే తన భర్తపైన కేసు నమోదు చేయడం వంటి చర్యలేమీ తీసుకోలేదని బాధితురాలు వాపోయింది.
అయితే అప్పటి వరకు ఈ దారుణం ప్రపంచానికి తెలియదు. ఈ దారుణం జరుగుతున్న సమయంలో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి దీనిని తన మొబైల్‌లో వీడియో తీశాడు. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఈ వీడియో వైరల్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో దీనిపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన గురునాథ్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇంత దారుణం జరుగుతుంటే దాడికి పాల్పడుతున్న భర్త నుంచి ఆమెను కాపాల్సి పోయి వీడియో తీయడం ఏంటనే ప్రశ్నలతో కూడి కామెంట్లు పెడుతున్నార ఆ వీడియోను చూసిన నెటిజన్లు. పోలీసుల తీరు పట్ల కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.
Read More
Next Story