రైతులపై రసాయన ఎరువుల ప్రభావం!
x
ఫైల్ ఫొటో

రైతులపై రసాయన ఎరువుల ప్రభావం!

రసాయనిక ఎరువులు లేకుండా పంటలు పండటం లేదు. రసాయన ఎరువులు, పురుగు మందుల ప్రభావం రైతుల ఉసురు తీస్తోంది.


ఆంధ్రప్రదేశ్‌లో రసాయనిక ఎరువుల వాడకం రైతుల జీవన విధానాన్ని, ఆర్థిక స్థితిని, పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తోందో తెలిస్తే ఆశ్చర్య పోతారు. రాష్ట్రంలోని వ్యవసాయం ఎక్కువగా వరి, పత్తి, చెరకు, ఇతర వాణిజ్య పంటలపై ఆధారపడి ఉంది. ఈ పంటలు అధిక దిగుబడి ఇవ్వాలంటే రసాయనిక ఎరువుల వాడకం అనివార్యంగా మారిందని రైతులు అంటున్నారు. అయితే ఈ వాడకం వల్ల రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోవడం, అనారోగ్యాలకు గురికావడం, ఆర్థిక ఒత్తిడి కారణంగా బలవన్మరణాలకు పాల్పడడం, భూసారం క్షీణించడం వంటివి ప్రధానమైనవి.

రసాయనిక ఎరువుల వాడకం.. రైతులపై ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో రసాయనిక ఎరువుల వాడకం రైతులను బాగా దెబ్బతీస్తోంది. మొదటగా ఈ ఎరువులు భూమి సారాన్ని క్రమంగా నాశనం చేస్తాయి. నత్రజని (N), భాస్వరం (P), పొటాష్ (K) వంటి పోషకాలను అధికంగా వాడడం వల్ల భూమిలో సూక్ష్మజీవులు నశిస్తాయి, దీర్ఘకాలంలో దిగుబడి తగ్గుతుంది. ఈ ఎరువుల ధరలు ఎక్కువ కావడంతో రైతులు అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఆర్థిక ఒత్తిడి పెరిగి, కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2022లో జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 917 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో అప్పుల భారం ప్రధాన కారణంగా చెప్పారు.

ఏడు జిల్లాల్లో అధిక వాడకం

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు, విశాఖపట్నం వంటి ఏడు జిల్లాల్లో రసాయనిక ఎరువుల వాడకం దేశ సగటు (90 కిలోలు/హెక్టారు) కంటే ఎక్కువగా ఉంది (138 కిలోలు/హెక్టారు). దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.

ఈ జిల్లాల్లో వరి, చెరకు, పత్తి వంటి అధిక దిగుబడి పంటలు ఎక్కువగా పండిస్తున్నారు. ఈ పంటలకు ఎక్కువ పోషకాలు అవసరం కావడంతో రసాయనిక ఎరువులపై ఆధార పడతున్నారు. గోదావరి, కృష్ణా నదీతీర ప్రాంతాల్లో నీటి పారుదల సౌకర్యం ఉండటంతో ఏడాది పొడవునా రెండు లేదా మూడు పంటలు పండిస్తారు. దీనికి ఎక్కువ ఎరువులు అవసరం అవుతున్నాయి. ఎరువులు, పురుగుమందుల విక్రేతలు రైతులను ఎక్కువ వాడమని ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల వారి లాభాలు పెంచుకుంటున్నారు. సమతుల్య ఎరువుల వాడకం గురించి రైతులకు సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

2024-25 వాడకంలో పెరుగుదల

ప్రభుత్వ లెక్కల ప్రకారం రసాయనిక ఎరువుల వాడకం ఏపీలో 2023-24 లో దేశ సగటు కంటే 82 శాతం అధికంగా నమోదైంది. దేశంలో ఎకరాకు సగటున 56 కిలోల రసాయన ఎరువులు వాడుతుంటే ఏపీలో మాత్రం ఎకరాకు 102 కిలోలు వాడుతున్నారు. అందులో మరీ ఎక్కువగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వాడుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఎకరాకు 214శాతం నుంచి 346 శాతం వాడుతున్నారు. రాష్ట్రంలో 10 లక్షల మంది రైతులు 12.15 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని రైతు సాధికార సంస్థ నివేదికలు ఇచ్చింది. అయినా రసాయన ఎరువుల వాడకం ఈ స్థాయిలో ఎందుకు ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆగస్టు 2024లో ఆంధ్రప్రదేశ్‌కు రబీ సీజన్ కోసం 22.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఎక్కువ భాగం రసాయన ఎరువులే (యూరియా, DAP, NPK వంటివి). 2023-24 డేటా ఆధారంగా, ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సరానికి సుమారు 20-22 లక్షల టన్నుల రసాయన ఎరువులు రైతులు వినియోగించారు.

ప్రకృతి వ్యవసాయంలో అడ్డంకులు

ప్రకృతి వ్యవసాయం (APCNF) (Andhra Pradesh Community Managed Natural Farming) ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ, రైతులు దీన్ని అవలంబించడంలో ఆసక్తి చూపడం లేదు. దీనికి కారణాలు ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు సరైన సమాచారం అందడం లేదు. రసాయనిక ఎరువులతో తక్షణ దిగుబడి రాగా, ప్రకృతి వ్యవసాయంలో ఫలితాలు కనిపించడానికి సమయం పడుతుంది. గ్రామాల్లో సాంప్రదాయ రైతులు, ఎరువుల వ్యాపారులు ప్రకృతి వ్యవసాయాన్ని వ్యతిరేకిస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులకు సరైన మార్కెట్, ధరలు లేకపోవడం కూడా కారణంగా చెప్పొచ్చు.

రసాయన ఎరువుల వాడకానికి కారణాలు

ఎరువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీల వల్ల రైతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరగడంతో దేశీయంగా ఉత్పత్తి, వినియోగం పెంచారు. ఆహార ధాన్యాల డిమాండ్ పెరగడంతో దిగుబడి పెంచేందుకు ఎక్కువ ఎరువులు వాడుతున్నారు.

అప్పులు, బలవన్మరణాలు

రసాయనిక ఎరువుల వాడకం వల్ల రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఎరువులు, పురుగుమందుల ఖర్చులు పెరగడం, దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడం వల్ల ఆదాయం తగ్గుతోంది. ఈ పరిస్థితి రైతులను మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇది రసాయనిక వ్యవసాయ విధానాల వైఫల్యాన్ని సూచిస్తోంది.

అధికారిక లెక్కలు

NCRB 2022 డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 917 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2023లో ఈ సంఖ్య 16 శాతం తగ్గుదల నమోదైంది. 2024-25కి ఇంకా డేటా లేనప్పటికీ, సమాన ఒత్తిడి కొనసాగుతున్నందున వెయ్యి మంది వరకు చనిపోయి ఉండొచ్చని అంచనా. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తొమ్మిది నెలల కాలంలో 39 మంది రైతులు చనిపోయినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించడం విశేషం.

అనధికారిక లెక్కలు

అనధికారిక నివేదికలు (మీడియా, NGOలు) తరచూ ఎక్కువ సంఖ్యను చూపిస్తాయి. ఎందుకంటే అధికారిక లెక్కల్లో రైతు, కార్మికులు లేదా కౌలు రైతుల ఆత్మహత్యలు కొన్నిసార్లు చేరవు. 2024-25లో ఈ సంఖ్య 1200 వరకు ఉండవచ్చని అనధికారిక అంచనాలు సూచిస్తున్నాయి.

రసాయన ఎరువుల వల్ల నీటి కాలుష్యం, గాలి కాలుష్యం పెరిగి, రైతులు మరియు వారి కుటుంబాల్లో ఆరోగ్య సమస్యలు (ఉదాహరణకు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటివి) పెరుగుతున్నాయి. రసాయన ఎరువుల వాడకం వల్ల పంటల్లో రసాయన అవశేషాలు పేరుకుపోయి, మార్కెట్‌లో ధరలు తగ్గడం జరుగుతోంది.

బలవన్మరణాలకు ప్రధాన కారణాలు

పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం.

పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు అవకాశాలు అందుబాటులోమ లేవు. మార్కెటింగ్ సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది.

తెగుళ్లకు నష్ట పరిహారం ఇచ్చేది లేదు. ఇది కూడా ప్రకృతి విపత్తుగా ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది.

పకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టం అంచనా వేసే పద్ధతి మారాల్సి ఉంది. కొంత పంటకు మాత్రమే పరిహారం ఇస్తున్నారు. నష్టపోయిన పంటకు పూర్తిగా పరిహారం అందించాలి.

కౌలు రైతులు ఆంధ్రప్రదేశ్ లో 16 లక్షల మంది వరకు ఉన్నట్లు రైతు సంఘాల వారు చెబుతున్నారు. కౌలు రైతులకు చట్టం ఉంది. కౌలుకు భూములు ఇచ్చే వారు అధికారికంగా అగ్రిమెంట్స్ ఇవ్వటం లేదు. అందువల్ల కౌలు రైతులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉండటం లేదు. ఇక పెట్టబడి సాయం అంటూ ఏమీ ఉండటం లేదు. కౌలు దారుల్లో ఎక్కువ మంది సామాజికంగా వెనుకబడిన వారే ఉంటున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 130 మంది కౌలు రైతులు చనిపోయినట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ తెలిపారు.

అప్పుల కారణంగా ఇంట్లో భార్యా భర్తలు, పిల్లల మధ్య గొడవలు వస్తున్నాయి. ఇవి కూడా ఆత్మహత్యలు చేసుకునేందుకు కారణం అవుతున్నాయి.

విత్తన కొనుగోలు ఖర్చు ఎక్కువ అవుతోంది. కొందరు వ్యాపారులు రైతులను మోసగించి నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. అలాంటప్పుడు చేసిన శ్రమ అంతా వృధా అవుతోంది.

పురుగు మందులపై కంట్రోల్ ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. పంటలకు పురుగు పట్టిందని డిమాండ్ పెరగగానే మార్కెట్లో పురుగు మందులు బ్లాక్ చేసి ధరలు పెంచి ఇష్టానుసారం అమ్ముతున్నారు. రైతులు కొనుగోలు చేయక తప్పటం లేదు. అందుబాటులో ఉన్న వ్యవసాయ అధికారులు వీరి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు.

వరి గడ్డికి రేటు లేకుండా పోయింది. గతంలో పశువుల మేత కోసం గడ్డిని పశువుల యజమానులు కొనుగోలు చేసే వారు. ప్రస్తుతం మిషన్ ద్వారా వరి కోత కోయించడంతో గడ్డి పనికి రాకుండా పోతోంది.

పత్తి, మిర్చి పంటల్లో రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఉత్పత్తి పెంపుకు హైబ్రిడ్ విత్తనాలు వాడటం వల్ల ప్రజలకు ఆహారం కొరత లేకుండా ఉంటుందని అధికారులు ప్రోత్సహిస్తున్నారు. కానీ రైతులకు గిట్టుబాటు ధరల విషయంలో అధికారుల నుంచి ఎటువంటి ప్రోత్సాహం ఉండటం లేదు.

ఏపీలో రైతు సంఘాల లెక్కల ప్రకారం 1.20 కోట్ల మంది వ్యవసాయ దారులు ఉన్నారు. కేవలం దేవాలయ భూములు కౌలుకు చేసే రైతులు 16.50 లక్షల మంది ఉన్నట్లు కౌలు రైతుల సంఘం అధ్యక్షులు కెవివి ప్రసాద్ తెలిపారు.

రైతుల బలవన్మరణాలపై ప్రభుత్వం ఏమి చెబుతోంది?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా అప్పులు, పంట నష్టం, ఆర్థిక ఒత్తిడిని గుర్తిస్తున్నాయంటోంది. రుణమాఫీ పథకాలు, PM-KISAN వంటి ఆదాయ సహాయ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (ZBNF) పథకాన్ని 2024 నాటికి పూర్తిగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. ఎరువులు, విత్తనాలు, విద్యుత్‌పై సబ్సిడీలు కొనసాగిస్తోంది.

రైతు సంఘాల నాయకులు ఏమంటున్నారు?

రైతు సంఘాల నాయకులు (ఉదాహరణకు భారతీయ కిసాన్ యూనియన్ వంటి సంస్థలు) ఈ సమస్యలపై ఇలా అంటున్నారు. రసాయన ఎరువుల సబ్సిడీలు ఎరువు కంపెనీలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చుతున్నాయి. ప్రయోజనాలు రైతులకు దక్కడం లేదు. రైతులకు స్థిరమైన ఆదాయం, మార్కెట్ ధరల హామీ అవసరం. రుణమాఫీ సరిపోవడం లేదు. సేంద్రియ వ్యవసాయానికి ప్రభుత్వం మరింత శిక్షణ, ఆర్థిక సహాయం ఇవ్వాలస్సిందిగా కోరుతోంది.

రైతుల అప్పుల బాధలు తీరాలంటే ఏమి చేయాలి?

పశుపోషణ, ఉద్యానవనం వంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను ప్రోత్సహించడం. రసాయన ఎరువుల ఖర్చును తగ్గించేందుకు సేంద్రియ వ్యవసాయానికి ఆర్థిక, సాంకేతిక సహాయం అందించడం. అధిక వడ్డీ రేట్లతో కూడిన అనధికారిక రుణదాతలపై నియంత్రణ, బ్యాంకుల ద్వారా సులభ రుణాలు అందుబాటులోకి తేవాల్సి ఉంటుది. కనీస మద్దతు ధర (MSP)ను అమలు చేయడం, మార్కెట్‌లో రైతులకు న్యాయమైన ధరలు లభించేలా చూడడం. పంట నష్టం జరిగినప్పుడు తక్షణ ఆర్థిక సహాయం అందించే ప్రభావవంతమైన పంట భీమా పథకాలు సక్రమంగా అమలు చేయాల్సి ఉంది.

వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం

వ్యవసాయ అధికారులు రైతులకు సరైన సూచనలు ఇవ్వలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖలో సిబ్బంది కొరత కారణంగా శిక్షణా కార్యక్రమాలు సరిపడా నిర్వహించకపోవడం సాధ్యం కావడం లేదు. గత ఐదు దశాబ్దాలుగా రసాయనిక వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధానాలు అమలులో ఉండటం వల్ల ప్రకృతి వ్యవసాయంపై దృష్టి తగ్గిపోయింది. ఎరువుల కంపెనీల ఒత్తిడి వల్ల అధికారులు రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడంలో వెనుకాడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రసాయనిక ఎరువుల అతివాడకం రైతులను సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడం ద్వారానే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయితే దీనికి రైతులు, ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాలి.

Read More
Next Story