
మాయామేయ జగంబు, నిత్య రాజకీయ రంగస్థలంబు
పుట్టినరోజు శుభాకాంక్షలు... తర్వాత విమర్శల వరద. ఏమిటీ వైచిత్యం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికపై మరోసారి మాయా లీలలు ప్రదర్శనకు వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రత్యర్థి నాయకులు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి ప్రముఖులు ఎక్స్ ప్లాట్‌ఫాం ద్వారా తమ ఆశీస్సులను అందజేశారు. పైకి ఇది సౌజన్యపూర్వక చర్యగా కనిపించినప్పటికీ, ఇందులోని అనిత్యతను, మాయను పరిశీలిస్తే, పురాణ కథల్లోని హరిశ్చంద్రుడి మాటలు గుర్తుకు వస్తాయి.
"మాయతో నిండిన ఈ జగత్తు శాశ్వతమైనదని భ్రమపడి, నా ఇల్లు, నా కొడుకు తో ప్రాణం ఉన్నంతవరకు ఈ శరీరంతో ఆనందంగా గడిపాను. కానీ ఇప్పుడు ఈ శరీరం కట్టెలతో కాలిపోతుంటే, నా భార్య, కొడుకు కూడా నన్ను కాపాడటానికి రావడం లేదు" అని హరిశ్చంద్రుడు పలికిన మాటలు జీవితం తాత్కాలికతను తెలియజేస్తాయి. అదేవిధంగా రాజకీయాల్లోని ఈ శుభాకాంక్షలు కూడా మాయా రూపాలేనా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది.
చంద్రబాబు నాయుడు తన ఎక్స్ పోస్ట్‌లో "వైఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని మనస్ఫూర్తిగా రాశారు. అదే సమయంలో విజయసాయి రెడ్డి కూడా "మా ప్రియతమ నాయకుడు జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీవెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలి" అంటూ భక్తి భావంతో పోస్ట్ చేశారు. షర్మిల కూడా సమానంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మాటలు పైకి ప్రేమాభిమానాలతో నిండినట్లు కనిపిస్తాయి. కానీ రాజకీయ విశ్లేషకులు ఇందులోని ద్వంద్వత్వాన్ని గుర్తుచేస్తున్నారు. ఎన్నికల సమయంలో తీవ్ర విమర్శలు చేసిన వారే, జన్మదినానికి ఆశీస్సులు అందజేయడం రాజకీయ మాయా జాలానికి నిదర్శనం. హరిశ్చంద్రుడి మాటల్లో చెప్పాలంటే రాజకీయ శరీరం 'కాలిపోతుంటే' ఈ శుభాకాంక్షలు ఎంతవరకు నిలబడతాయి? ప్రత్యర్థులు నిజంగా కాపాడటానికి వస్తారా, లేక మరిన్ని విమర్శలతో విరుచుకుపడతారా?
ఒక్క సారి ఊహించండి... రాజకీయ రంగస్థలంపై ఒక నాయకుడు తన 'ఇల్లు' అంటే పార్టీ ని, 'కొడుకు' అంటే అనుచరులు ను శాశ్వతమని భ్రమపడి ఆనందిస్తాడు. కానీ అధికారం అనేది అనిత్యమైనప్పుడు, ఆ శరీరం 'కట్టెలతో కాలిపోతుంటే', ఈ శుభాకాంక్షలు చేసినవారు దూరంగా ఉండటమే చూస్తాము.
షర్మిల, జగన్ సోదరీసోదరులు అయినప్పటికీ, రాజకీయ ప్రత్యర్థిత్వం వల్ల శుభాకాంక్షలు కూడా తాత్కాలికమే. చంద్రబాబు నాయుడు విషయంలో అయితే గత వివాదాలు గుర్తుచేస్తే ఈ ఆశీస్సులు మాయా భ్రమలే. విజయసాయి రెడ్డి వంటి సన్నిహితుల శుభాకాంక్షలు సహజమే కానీ, మొత్తం చిత్రం చూస్తే రాజకీయాలు ఒక మాయా జగత్తు అని తెలుస్తుంది.
ఉదయం జన్మదిన కేక్ కట్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పిన వ్యక్తి, మధ్యాహ్నానికి "నీ పాలనలో రాష్ట్రం నాశనమైంది" అంటూ ప్రెస్ మీట్ పెడతాడు. ఇది రాజకీయమా లేక హాస్య చిత్రమా? ప్రజలు నవ్వుకుంటున్నారు. కానీ ఈ 'డబుల్ యాక్టింగ్' వెనుక ఉన్న సందేశం ఏమిటి? పాలకులు పాలితులకు ఇస్తున్న సలహా ఏమంటే... "పైకి స్నేహం చూపించు, మనసులో కత్తి దాచు!" అని. నటులు సినిమాల్లో నటిస్తారు, కానీ రాజకీయ నాయకులు జీవితంలో నటిస్తారు. అందుకే వారిని 'ప్రొఫెషనల్ యాక్టర్స్' అని పిలవాలేమో!
ఈ సంఘటనలు రాజకీయ నాయకులు ప్రజలకు ఇస్తున్న సందేశాన్ని ప్రశ్నిస్తున్నాయి. పైకి స్నేహం, మనసులో ద్వేషం. ఇది హరిశ్చంద్రుడి మాటల్లో చెప్పాలంటే, జగత్తు మాయతో నిండినదనే సత్యాన్ని గుర్తుచేస్తుంది. ప్రజలు ఈ 'మాయా డ్రామా'ను చూసి వినోదపడుతున్నారు. కానీ లోతుగా ఆలోచిస్తే, రాజకీయాలు కూడా అనిత్యమైనవే. శుభాకాంక్షలు ఒక రోజు మాత్రమే, విమర్శలు శాశ్వతమా? ఈ ప్రశ్నలు రాజకీయ సంస్కృతిపై మరిన్ని చర్చలకు దారి తీస్తాయి.

