వైజాగ్‌ బీచ్‌కు ‘హోహో’ బస్సులొచ్చేశాయోచ్‌!
x
జెండా ఊపి హోహో బస్సులను ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు

వైజాగ్‌ బీచ్‌కు ‘హోహో’ బస్సులొచ్చేశాయోచ్‌!

పర్యాటకుల కోసం విశాఖ బీచ్‌లో రెండు డబుల్‌ డెక్కర్‌ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ప్రవేశపెట్టారు.

విశాఖ సాగరతీరంలో అందాలను అద్దాల్లోంచి వీక్షించేందుకు వీలుగా డబుల్‌ డెక్కర్‌ బస్సులు అందుబాటులోకి వచ్చేశాయి. చాన్నాళ్లుగా పర్యాటకులను ఊరిస్తున్న ఈ బస్సులు శుక్రవారమే బీచ్‌ రోడ్డెక్కాయి. ఇకపై ఈ బీచ్‌ రోడ్డులో ఇవి రోజంతా చక్కర్లు కొట్టనున్నాయి. హోప్‌ ఆన్‌–హోప్‌ ఆఫ్‌ (హోహో) డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆర్కే బీచ్‌లో జెండా ఊపి ప్రారంభించారు.

ప్రపంచలోని కొన్ని ప్రఖ్యాత నగరాలతో పాటు ఢిల్లీ, ముంబై, గోవా, బెంగళూరు వంటి పర్యాటక ప్రాధాన్యత ఉన్న నగరాల్లోనే తిరుగుతున్న ‘హోహో’ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు తిరుగుతున్నాయి. వీటిని విశాఖ బీచ్‌లోనూ నడపాలన్న ఆలోచన ఈనాటిది కాదు. ఏటా కోటిన్నర మంది పర్యాటకులు ఇతర తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి విశాఖ ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడానికి వస్తుంటారు. ఇక రోజూ వేలాది మంది పర్యాటకులు, సందర్శకులతో సాగరతీరం కిక్కిరిసి పోతూ ఉంటుంది. ఈ విశాఖ సుందరి అందాలను ఆస్వాదించడానికి ఆటోలు, ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుంటారు. అయితే వీటిలో అన్ని పర్యాటక ప్రదేశాలకూ వెళ్లేందుకు అవకాశం ఉండదు. సొంత వాహనాలున్న వారు మాత్రమే వీటిని చుట్టి రాగలుగుతున్నారు. దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు వీటిలో కొన్నింటిని మాత్రమే ఆస్వాదించగలుగుతున్నారు.

సందర్శకులనుద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు

ఈ నేపథ్యంలోనే హోహో బస్సుల్లో నుంచి సాగరతీరం, ఇతర ప్రదేశాలను వీక్షిస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుందన్న ఉద్దేశంతో వీటిని ప్రవేశపెట్టాలని పర్యాటకశాఖ కొన్నేళ్లుగా యోచిస్తోంది. కానీ ఏవేవో కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు కొన్నాళ్ల క్రితం రెండు బస్సులను విశాఖకు పంపారు. అవి బీచ్‌ రోడ్డులో ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. వాస్తవానికి గత మే నెలలోనే వీటిని ప్రారంభించాలని అనుకున్నారు. కానీ అది ఎందుకో వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం విశాఖ పర్యటనకు రావడంతో ఆయనతో ఈ బస్సులను ప్రారంభింపజేశారు. అనంతరం ఆయన మంత్రులు కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌జైన్, మేయర్‌ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ హరేందిరప్రసాద్, పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌లతో కలిసి ఈ డబుల్‌ డెక్కర్‌ బస్సులో కొంతదూరం ప్రయాణించారు. బస్సు నుంచి బీచ్‌లో ఉన్న పర్యాటకులకు సీఎం అభివాదం చేశారు.

బస్సులో నుంచి పర్యాటకులకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి

ఈ బస్సుల సంగతేంటో చూద్దాం..
డబుల్‌ డెక్కర్‌ హోహో బస్సులు చూడచక్కగా ఉంటాయి. ఏసీ సదుపాయంతో రెండంతస్తుల్లో సీట్లుంటాయి. వీటి అద్దాల్లోంచి అందాలను వీక్షిస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ఆర్కే బీచ్‌ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఈ బస్సులు తిరుగుతాయి. పర్యాటకుల ఆదరణను బట్టి త్వరలో మరో రెండు మూడు హోహో బస్సులను ప్రవేశపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు.

టూర్‌కు సిద్ధంగా ఉన్న డబుల్‌ డెక్కర్‌ హోహో బస్సులు

టిక్కెట్టు ధర రూ.250
ఈ డబుల్‌ డెక్కర్‌ బస్సు టిక్కెట్టు ధర ఒక్కొక్కరికి రూ.500గా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో సగం సొమ్మును ప్రభుత్వమే భరిస్తుంది. అంటే టిక్కెట్టు ధర రూ.250 అన్నమాట! ఒక్క టిక్కెట్టుతో 24 గంటల పాటు ఈ బస్సులో ఎన్నిసార్లైనా తిరగొచ్చు. బస్సు తిరిగే రూటులో నచ్చిన చోట దిగి అక్కడ పర్యాటక ప్రాంతాలను చూసి మరో చోటకు ఈ బస్సులో వెళ్లొచ్చు. అందుకు వీలుగా 24 గంటల పాటు టిక్కెట్టు చెల్లుబాటు అయ్యేలా వీలు కల్పించారు.
ఏమేం చూడొచ్చంటే?
హోహో బస్సులో ప్రయాణించే వారు విశాఖ ఆర్కే బీచ్‌ నుంచి ప్రయాణం మొదలెడితే మార్గమధ్యలో సీ హారియర్‌ హెలికాప్టర్‌ మ్యూజియం, ఐఎన్‌ఎస్‌ కురుసుర సబ్‌మెరైన్‌ మ్యూజియం, టీయూ 142 ఎయిర్‌క్రాఫ్ట్‌ మ్యూజియం, తెన్నేటి పార్కు, వైఎస్సార్‌ వ్యూ పాయింట్, ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్కు, రుషికొండ బీచ్, తొట్లకొండ తదితర ప్రదేశాలను వీక్షించవచ్చు. ఈ బస్సుల్లో ఆయా పర్యాటక ప్రదేశాల విశిష్టతలను తెలియజేసేందుకు గైడ్లు కూడా ఉంటారు. ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లేలు కూడా ఉంటాయి. ఇక ఈ హోహో బస్సుల్లో విశాఖ అందాలను వీక్షించడమే తరువాయి.
Read More
Next Story