ముగ్గురి సామర్ధ్యానికి నిజమైన పరీక్ష రాబోతోందా ?
x

ముగ్గురి సామర్ధ్యానికి నిజమైన పరీక్ష రాబోతోందా ?

ఇప్పుడు గనుక గెలవకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సొస్తుందన్న టెన్షన్ ముగ్గురిలో పెరిగిపోతున్నట్లే ఉంది.


గెలుపుపై ముగ్గురిలోను టెన్షన్ పెరిగిపోతోందా ? వీళ్ళ వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇప్పుడు గనుక గెలవకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సొస్తుందన్న టెన్షన్ ముగ్గురిలో పెరిగిపోతున్నట్లే ఉంది. ఇంతకీ ఈ టెన్షన్ అంతా దేనికోసం ? తొందరలోనే జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ఎన్నికల్లో గెలుపు విషయంలోనే. గెలుపు, ఓటముల్లో మూడుపార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో మూడింటికి సమాన అవకాశాలున్నాయి. అందుకనే టెన్షన్ పెరిగిపోతోంది. 150 డివిజన్ల జీహెచ్ఎంసీలో ప్రస్తుత బలాబలాలను గమనిస్తే పోయిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 55 డివిజన్లలో గెలిచింది. అలాగే బీజేపీ 48 డివిజన్లు, ఎంఐఎం 44 డివిజన్లు, కాంగ్రెస్ 2 డివిజన్లలో గెలిచాయి. ఒకచోట ఇండిపెండెంట్ గెలిచాడు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ నుండి ఫిరాయించేశారు. ఆమెతో పాటు కొందరు కార్పొరేటర్లు కూడా హస్తంపార్టీలోకి దూకేశారు. అయితే ఎంతమంది అన్న విషయంలో పార్టీల్లోనే అయోమయం ఉంది. అందుకనే ఇపుడు జీహెచ్ఎంసీలో పార్టీల బలాబలాలు ఎన్నంటే స్పష్టంగా ఎవరూ చెప్పలేరు. సరే గడచిన ఎన్నికల్లో గెలిచిన డివిజన్లు, పార్టీల బలాబలాలను పక్కనపెట్టేస్తే తొందరలో జరగబోయే ఎన్నికల్లో గెలుపు టార్గెట్ గా మూడు పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. తెలంగాణా మొత్తానికి జీహెచ్ఎంసీ అన్నది గుండెకాయలాంటిదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే మూడుపార్టీలు జీహెచ్ఎంసీలో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

కాంగ్రెస్ పరిస్ధితి ఏమిటి ?

అధికారంలో ఉండటం, రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండటం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. బీఆర్ఎస్, బీజేపీలను ధీటుగా ఎదుర్కోగలిగిన కెపాసిటి రేవంత్ కు ఉంది. కాబట్టే ప్రతిపక్షాల వ్యూహాలకు రేవంత్ ప్రతివ్యూహాలను రచించగలరు. పార్టీ మొత్తం రేవంత్ ఆదేశాలను పాటించక తప్పదు. ముఖ్యమంత్రిగానే కాకుండా పార్టీలో కూడా రేవంత్ తిరుగులేని నేతనే చెప్పాలి. కాబట్టి అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం, అసంతృప్తులను బుజ్జగించటం, ఎలక్షనీరింగ్ తదితరాలన్నింటినీ రేవంత్ సమర్ధవంతంగా చేయగలరు. కాబట్టి రేవంత్ నాయకత్వంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీచేస్తుండటం కచ్చితంగా ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఇదే సమయంలో మైనస్సులు లేవా అంటే ఉన్నాయి.

మైనస్సులు ఏమిటంటే హైడ్రా, మూసీనది సుందరీకరణ పనుల కారణంగా పేదలు, మధ్య తరగతి జనాల్లోని బాధితులు ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపోతున్నారు. జలవనరుల సంరక్షణ, ఆక్రమణల తొలగింపు కోసం రేవంత్ ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటుచేశారు. చెరువులు, కాల్వలు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ లో ఉన్నాయన్న కారణంగా హైడ్రా కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళు, అపార్టమెంట్లు, విల్లాలను కూల్చేసింది. నిజానికి పేదలు, మధ్య, ఎగువమధ్య తరగతి జనాలు ఇళ్ళు, అపార్టమెంట్లను కొనుగోలు చేసేటపుడు ప్రభుత్వ శాఖల అనుమతులున్నాయా లేవా అనిమాత్రమే చూస్తారు. అన్నీరకాల అనుమతులుంటేనే బ్యాంకులు కూడా అప్పులిస్తాయి. రియల్టర్లు, బిల్డర్లు కొనుగోలుదారులను బ్యాంకులు, ఆర్ధికసంస్ధలకు టైఅప్ చేయటంతో అప్పులు చేసి ప్రాపర్టీలను కొంటున్నారు. అలా కొనుగోలుచేసిన వాటిల్లో కొన్నింటిని హైడ్రా కూల్చేయటంతో యజమానుల బాధ వర్ణనాతీతం. బాధితులంతా రేవంత్ ను శాపనార్ధాలు పెడుతున్నారు. వీళ్ళే కాకుండా హైడ్రా తమ ఇళ్ళు, విల్లాలు, అపార్టమెంట్లను ఎక్కడ కూల్చేస్తుందో అనే భయం చాలామందిలో పెరిగిపోతోంది. ఇలాంటి వాళ్ళంతా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లేస్తారని అనుకునేందుకు లేదు.

ఇదే సమయంలో ఆక్రమణల తొలగింపులో హైడ్రాకు మద్దతుగా నిలుస్తున్న జనాలు కూడా ఉన్నారు. కాని మద్దతుదారులకన్నా బాధితుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందనటంలో సందేహంలేదు. హైడ్రా మద్దతుదారులంతా కాంగ్రెస్ కు ఓట్లేసినా వేయకపోయినా బాధితులు కాంగ్రెస్ కు ఓట్లేసేది మాత్రం అనుమానమే. ఒకవైపు హైడ్రా ప్రకంపనలు పెరిగిపోతుంటే మరోవైపు మూసీనది సుందరీకరణ ప్రాజెక్టును ప్రభుత్వం టేకప్ చేసింది. మూరికికూపంగా మారిపోయిన మూసీనదిని సుందరంగా తీర్చిదిద్ది మళ్ళీ మంచినీటి నదిగా మార్చాలన్నది రేవంత్ పట్టుదల. ఇదంతా జరగాలంటే ముందు నదికి రెండువైపులా ఉన్న ఆక్రమణలు, నిర్మాణాలను తొలగించాలి. నిర్మాణాలు, ఆక్రమణల తొలగింపు ప్రక్రియ మొదలుకాగానే నివాసితులంతా ప్రభుత్వంపై తిరగబడ్డారు. బాధితుల్లో కొందరికి ప్రభుత్వం నచ్చచెప్పి ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించి అక్కడికి తరలించింది. అయితే తమ ఇళ్ళను వదిలేసి ఇందిరమ్మ ఇళ్ళు తీసుకుని వెళ్ళిన వాళ్ళ సంఖ్య సముద్రంలో నీటిబింధువంత.

ఎందుకంటే 57 కిలోమీటర్ల మూసీనదికి రెండువైపుల గ్రేటర్ పరిధిలో మలక్ పేట, కార్వాన్, అంబర్ పేట, నాంపల్లి, గోషామహల్, చాద్రాయణగుట్ట, యాకత్ పుర, బహదూర్ పుర అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ 8 నియోజకవర్గాల పరిధిలోని 13 వేల నిర్మాణాలు, ఆక్రమణల్లోని నివాసితుల ఓట్లు సుమారుగా 20 లక్షలుంటాయి. ఇందిరమ్మ ఇళ్ళు తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్య మహాయితే వందల్లోనే ఉంటుంది. దాదాపు 200 ఇళ్ళను అధికారులు కూల్చేశారు. అంటే బాధితుల సంఖ్యతో పోల్చుకుంటే ఖాళీచేసి వెళ్ళిన వాళ్ళ సంఖ్య నామమాత్రం కూడా కాదు. కాబట్టి బాధితులంతా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓట్లేసేందుకే అవకాశాలు ఎక్కువున్నాయి. కాకపోతే కాంగ్రెస్ కు ఒక ప్లస్ పాయింట్ కూడా కనబడుతోంది. అదేమిటంటే పై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోను కాంగ్రెస్ కు పెద్దగా పట్టులేదు. పై నియోజకవర్గాల్లో అయితే ఎంఐఎం లేకపోతే బీజేపీకే ఎక్కువ పట్టున్నది.

పై 8 నియోజకవర్గాల్లో సుమారు 35 డివిజన్లున్నాయి. వీటిల్లో కాంగ్రెస్ ఎంతగా పోరాటంచేసినా గెలుచుకునే డివిజన్ల సంఖ్య తక్కువనే చెప్పాలి. పై డివిజన్లలో ఎంఐఎం గెలిచినా మిత్రపక్షం కాబట్టి కాంగ్రెస్ గెలిచినట్లే అనుకోవాలి. ఈ లెక్కలన్నీ ఆలోచించుకున్న తర్వాతే రేవంత్ మూసీనది సుందరీకరణ ప్రాజెక్టు టేకప్ చేసుండచ్చు.

బీఆర్ఎస్ పరిస్ధితి ఏమిటి ?

నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం అంత వీజీకాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పరిస్ధితి ఏమిటో కారుపార్టీ నేతలకే సరిగా తెలీదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన 39 సీట్లలో 16 నియోజకవర్గాలు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. మామూలుగా అయితే గ్రేటర్ పరిధిలో కారుపార్టీ గట్టిగానే ఉంది. అయితే తాజా రాజకీయ పరిణామాల్లో పార్టీ బలహీనపడిపోయింది. ఎలాగంటే గ్రేటర్ పరిధిలోకి వచ్చే రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఖరతాబాద్, చేవెళ్ళ, పటాన్ చెరు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించేశారు. ఎంఎల్ఏలతో పాటు మద్దతుదారులు కూడా కాంగ్రెస్ లో చేరారు. దాంతో పై నియోజకవర్గాల్లో కారుపార్టీ నీరసించిపోయింది. విషయం ఏమిటంటే పై నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జిలను కూడా బీఆర్ఎస్ నియమించుకోలేకపోయింది. ఇన్చార్జీలుగా ఎవరిని ఉండమన్నా ఎవరూ ఒప్పుకోవటంలేదని సమాచారం.

ఎంఎల్ఏలు, మద్దతుదారులు కాంగ్రెస్ లోకి ఫిరాయించినంత మాత్రాన జనాలందరు వాళ్ళు చెప్పినట్లే హస్తంపార్టీకి ఓట్లేస్తారని అనుకునేందుకు లేదు. ఏదేమైనా ఫిరాయింపు ఎంఎల్ఏలందరు జనబలం ఉన్న వాళ్ళే అనటంలో సందేహంలేదు. వీళ్ళవల్ల కాంగ్రెస్ ఏ మేరకు లాభపడుతుందన్నది పక్కన పెట్టేస్తే బీఆర్ఎస్ కు నష్టం తప్పదనే టాక్ బాగా వినబడుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిందే అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజప్రతినిధులు, సీనియర్ నేతలను గట్టిగా హెచ్చరిస్తున్నారు. హైడ్రా, మూసీ ప్రాజెక్టు బాధుతలంతా తమకే ఓట్లేస్తారని గంపెడంత ఆశలు పెట్టుకున్నారు కేటీఆర్. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

బీజేపీ ప్రభావం ఎంతుంటుంది ?

ఈ విషయంపైన పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంత ప్రభావవంతమైన నేతకాదని అందరికీ తెలుసు. పోయిన ఎన్నికల్లో పార్టీ 48 డివిజన్లలో గెలిచిందంటే పాలపొంగులాంటి వాతావరణం వల్లే. అంతకుముందే దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల్లో గెలవటంతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో అతివిశ్వాసం కూడా బీజేపీకి కలిసొచ్చింది. గ్రేటర్ ఎన్నికలకు ముందు నగరంలో కురిసిన భారీవర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని జనాలు బాగా ఇబ్బందులు పడ్డారు. దాంతో దాని ప్రభావం బీఆర్ఎస్ మీద కనబడింది. ఈమధ్యనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతు గ్రేటర్ పరిధిలో పార్టీ 48 డివిజన్లలో గెలిచినా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎంఎల్ఏ కూడా లేరంటే అందుకు బాధ్యులెవరు ? కారణం ఏమిటని పార్టీ బాధ్యులనే నిలదీశారు. కారణం ఏదైనా బీజేపీ గ్రేటర్ పరిధిలో పెద్దగా పుంజుకోలేదని చెప్పాలి. మంచిజోరుమీదుండి, పార్టీని దూకుడుగా పరుగులు పెట్టిస్తున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను తీసేసి సౌమ్యుడైన కిషన్ను పార్టీ అధ్యక్షుడిని చేయటమే పెద్ద మైనస్ అని పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి.

పార్టీ సభ్యత్వ నమోదులో కూడా పార్టీ ఫెయిలైంది. పెట్టుకున్న 50 లక్షల సభ్యత్వాల టార్గెట్లో కనీసం సగం కూడా చేయలేకపోయింది. వివిధ కారణాల వల్ల పార్టీలోని నేతల్లో చాలమంది స్తబ్దుగా ఉన్నారు. బీఆర్ఎస్ లాగే బీజేపీ కూడా హైడ్రా, మూసీ ప్రాజెక్టు బాధితుల ఓట్లమీదే ఆశలు పెట్టుకున్నది. సో, మూడుపార్టీలకు ప్లస్సులు, మైనస్సులున్న కారణంగా రేవంత్, కేటీఆర్, కిషన్ తరచూ గ్రేటర్ పరిధిలోని నేతలతో పదే పదే సమావేశాలు పెట్టుకుంటున్నారు. మరి అంతిమ విజేతలుగా రేవంత్, కేటీఆర్, కిషన్లో ఎవరు నిలుస్తారన్నది చూడాల్సిందే.

Read More
Next Story