కొలిక్కిరాని ‘బూడిద’ వివాదం!
x

కొలిక్కిరాని ‘బూడిద’ వివాదం!

రాయలసీమ ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నుంచి వెలువడే బూడిద (వెట్‌ డ్రై యాష్‌) కోసం తాడిపత్రి, జమ్మలమడుగు నేతలు తలపడుతూనే ఉన్నారు.


బీజేపీ, టీడీపీ నేతల బూడిద గొడవ రాయలసీమ ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌ దద్దరిల్లేలా చేస్తోంది. ఒక వైపు డేగ ఉంటే మరో వైపు నల్ల డేగ ఉంది. దీంతో రెండు వర్గాలు మొహరించి ముఖ్యమంత్రిని సైతం లెక్కచేయడం లేదు. ఈ బూడిద సమస్యను పరిష్కరిద్దామని జమ్మల మడుగు నుంచి ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి నుంచి జెసి ప్రభాకర్‌ని సీఎంఓకు రమ్మని సీఎం కబురంపారు. ఆదినారాయణరెడ్డి అయితే వచ్చారు కాని ప్రభాకర్‌రెడ్డి మాత్రం రాలేదు. ఆయన ఒపీనియన్‌ను ఒక లేఖ ద్వారా పంపించారు. ఇప్పుడే ఎందుకు ఈ సమస్య వచ్చింది. ఇంతకు ముందు ఏమైందనే సందేహాలు కూడా పలువురికి రావొచ్చు. ఎన్నో ఏళ్లుగా ఒకరే డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు మాకు కూడా కావాలని పట్టుబట్టడంతో వివాదం చెలరేగింది.

నాకు రావాల్సిందే...
ఇప్పటి వరకు నువ్వు తీసుకున్నావు. ఇక చాలు, నాకు రావాల్సిందేనని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబట్టారు. ఇప్పటి వరకు ఈ బూడిదను జెసి ప్రభాకర్‌ రెడ్డి తీసుకెళుతున్నారు. మా పరిధిలో ఉన్న బూడిదను ఇకపై మేము తీసుకుంటామంటూ ప్రభాకర్‌రెడ్డికి సంబంధించిన వాహనాలు వెల్లకుండా ఆపివేశారు. దీంతో వివాదం చెలరేగింది. పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇరు వర్గాలకు సర్థి చెప్పాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
ప్రభాకర్‌రెడ్డి ఏమంటారు..
జెసి ప్రభాకర్‌రెడ్డి ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నుంచి బూడిదను తీసుకెళ్లేందుకు లైసెన్స్‌ తీసుకున్నారు. ఇప్పటి ఆయన లారీల్లో బూడిదను సిమెంట్‌ కంపెనీలకు తోలుతున్నారు. ఇప్పటికే సుమారు 15 సిమెంట్‌ కంపెనీలతో ఒప్పందం కుదిరింది. అందువల్ల నేను తీసుకుపోవాల్సిందేనని ప్రభాకర్‌రెడ్డి పట్టుబడుతున్నారు.
ఇరువురికీ ట్రాన్స్‌పోర్టు వ్యాపారాలు
ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి, తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్‌ జెసి ప్రభాకర్‌ రెడ్డికి ట్రాన్స్‌పోర్టు వ్యాపారాలు ఉన్నాయి. వందల కొద్ది లారీలు నిత్యం ఏదో ఒక సరుకును తోలుతూనే ఉంటాయి. ప్రభాకర్‌రెడ్డి లారీలను ఆదినారాయణరెడ్డి ఆపివేయడంతో మొదలైన వివాదం కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి కూడా ధర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నుంచి డ్రైయాష్‌ తీసుకు వెళ్లేందుకు అనుమతులు పొందాల్సి ఉంటుంది. నామినల్‌ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. డ్రైయాష్‌ను సిమెంట్‌ కంపెనీలు టన్ను రూ. 410లకు కొనుగోలు చేస్తున్నాయి. అదే బయటి వారు అయితే రూ. 530లకు కొనుగోలు చేస్తున్నారు. వీరి వద్ద ఉండే పనివాళ్లకు ఇది కల్పతరువుగా మారింది. నిత్యం పని లేదనకుండా ఇక్కడి నుంచి ఈ బూడిదను రవాణా చేసి డబ్బులు ఎప్పటికప్పుడు సిమెంట్‌ కంపెనీల నుంచి తీసుకోవచ్చు. సిమెంట్‌ కంపెనీలే కాకుండా ఇటుకలు తయారు చేసే పరిశ్రమ వారు కూడా ఈ బూడిదను కొనుగోలు చేస్తున్నారు.
సీఎం వద్ద కూడా ఎడతెగని పంచాయతీ
ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డిలను ముఖ్యమంత్రి సచివాలయానికి నవంబరు 29వ తేదీ రావాల్సిందిగా ఆదేశించారు. ఆదినారాయణ రెడ్డి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన వివరణ ఇచ్చారు. అయితే ప్రభాకర్‌రెడ్డి మాత్రం రాలేదు. విద్యుత్‌ ప్రాజెక్టు కడప జిల్లా కలమళ్ల వద్ద ఉన్నందున అక్కడి వేస్ట్‌ను తాము తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, జెసి ప్రభాకర్‌రెడ్డి దూకుడు తగ్గించాలని ముఖ్యమంత్రిని ఆదినారాయణరెడ్డి కోరారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు ఆదినారాయణరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయన వైఎస్సార్‌సీపీలో గెలిచి టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. అందువల్ల ఆ సన్నిహితత్వంతో మీరు చెప్పినట్లు వినడానికి నేను సిద్ధమని సీఎం వద్ద ఆదినారాయణ రెడ్డి చెప్పినట్లు సమాచారం.
ఈ విషయంలో వెనక్కి తగ్గని ప్రభాకర్‌రెడ్డి
తాను ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రభాకర్‌ రెడ్డి చెబుతున్నారు. ప్రస్తుతం పవర్‌ ప్రాజెక్టు వద్ద పోలీసు బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. జెసి వాహనాలను ఆదినారాయణరెడ్డి వర్గం ఆపేసింది. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పది మంది పేదవారు బతుకుతారని ఇరు వర్గాల వరు చెబుతున్నారు. నిజానికి పేదల కంటే పెద్దలు బతికేందుకు ఈ బూడిద బాగా ఉపయోగ పడుతుందని చెబుతున్నారు. అక్కడి నుంచి ఎంత తీసుకు వెళుతున్నారో సరైన లెక్కలు కూడా ఉండటం లేదు. లారీల్లో అనుకున్న లోడ్‌ కంటే కాస్త ఎక్కువగానే నింపి సరఫరా చేస్తున్నారు. సీఎం తీసుకునే నిర్ణయంపై సమస్య ఆధారపడి ఉంది.
Read More
Next Story