సర్కార్‌కి మద్యం కిక్కు..సామాన్యుడికి బతుకు చిక్కు!
x

సర్కార్‌కి 'మద్యం' కిక్కు..సామాన్యుడికి బతుకు చిక్కు!

కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా రూ.543 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయింది.


ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు మునుపెన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయికి చేరాయి. కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో ప్రభుత్వం విక్రయ సమయాన్ని పొడిగించడం, మద్యం లభ్యత పెరగడంతో డిసెంబర్ నెలాఖరున అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే (డిసెంబర్ 29, 30, 31) ఏకంగా రూ.543 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీంతో పాటుగా బాటిల్ పైన రూ. 10 నుంచి రూ. 50 వరకు పెంచి అధిక రేట్ల విక్రయాలకు పాల్పడుతూ నిర్వాహకులు తమ జేబులు నింపుకున్నట్లు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డిసెంబర్ నెలలో వెల్లువలా ఆదాయం

గత ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే ఈసారి మద్యం అమ్మకాలు 8 శాతం వృద్ధిని కనబరిచాయి. డిసెంబర్ నెల మొత్తం మీద రాష్ట్ర ఖజానాకు మద్యం ద్వారా రూ.2,767 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదాయమే పరమావధిగా ప్రభుత్వం విక్రయ వేళలను పొడిగించడం ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

విచ్చలవిడిగా ‘బెల్టు’ విక్రయాలు

అధికారికంగా అనుమతించిన దుకాణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఊరూరా బెల్టు షాపులు వెలియడం వల్ల సామాన్యులకు, యువతకు మద్యం సులభంగా అందుబాటులోకి వస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆదాయం వెనుక సామాజిక సంక్షోభం?

ప్రభుత్వానికి ఆదాయం పెరగడం ఒక ఎత్తయితే, ప్రజారోగ్యం, కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ఇది చూపుతున్న ప్రభావం మరో ఎత్తు. మద్యం వినియోగం పెరగడం వల్ల సామాన్య కుటుంబాల ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటాయని, గృహ హింస, రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని సామాజిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కంటే ఆదాయానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, నియంత్రణ చర్యలు చేపట్టకపోతే సామాజిక సమస్యలు మరింత తీవ్రమవుతాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మద్యం ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుందని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, అది సామాజిక విధ్వంసానికి దారితీయకుండా చూడాల్సిన బాధ్యత కూడా పాలకులపై ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read More
Next Story