జగన్‌ ఇచ్చిన భూములను తిరిగి తీసుకున్న ప్రభుత్వం
x

జగన్‌ ఇచ్చిన భూములను తిరిగి తీసుకున్న ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌ హయాంలో చేపట్టిన ప్రతి పనిని తవ్వి తీస్తోంది.


ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం శారద పీఠానికి ఇచ్చిన భూములను తిరిగి వెనక్కు తీసుకుంది. ఆ మేరకు విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని పెందుర్తి శారదా పీఠానికి జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు భీమునిపట్నం మండలం కొత్తవలస గ్రామంలో కేటాయించిన 15 ఎకరాల భూములను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. నామమాత్రపు రేట్లకు జగన్‌ ఈ భూములను కేటాయించారని, దీంతో వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా భూ కేటాయింపులకు సంబంధించిన ఆర్డర్స్‌ను రద్దు చేసింది. ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా యంత్రాంగం ఈ అంశంపై దృష్టి సారించింది. ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసిన అధికారులు ఆ భూముల్లో హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇదే విషయాన్ని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ హరేంద్రప్రసాద్‌ స్పష్టం చేశారు. భీమునిపట్నం మండలం కొత్తవలస గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌లు 102/2లో 7.70 ఎకరాలు, 103లో 7.30 ఎకరాలు కలిపి మొత్తం 15 ఎకరాలను గతంలో జగన్‌మోహన్‌రెడ్డి శారదా పీఠానికి కేటాయించారు. ఇక్కడ భూములు రేట్లు అధికంగానే ఉంటాయి. బహిరంగ మార్కెట్‌లో ఎకరం భూమి దాదాపు రూ. 15 కోట్ల వరకు పలుకుతోంది. ఈ లెక్కన జగన్‌ ఇచ్చిన 15 ఎకరాలకు కలిపి రూ. 225 కోట్ల వరకు ఉంటుంది. అయితే ఈ భూములను అతి తక్కువ ధరలకు జగన్‌ కేటాయించారు. ఎకరం భూమి కేవలం రూ. 1లక్ష చొప్పున 15 ఎకరాలను కలిపి రూ. 15లక్షలకు కేటాయించారు. దీనిని కూటమి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

Read More
Next Story