APSEA అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని వెంటాడుతున్న ప్రభుత్వం
x

APSEA అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని వెంటాడుతున్న ప్రభుత్వం

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ఎక్సైజ్ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఎందుకు వెంటాడుతోంది...


సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఎక్సైజ్ పోలీసులు గురువారం రాత్రి 11 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. మద్యంతో తోటి ఉద్యోగులకు మందు పార్టీ ఇచ్చారనే నేరంపై పోలీసులు అరెస్ట్ చేశారు. మందు పార్టీ ఇచ్చిన వారిని అరెస్ట్ చేస్తారా? ఏమి జరిగింది. ఎందుకు ఈ విధంగా జరుగుతోందనే చర్చ సచివాలయ ఉద్యోగుల్లో మొదలైంది.

వెంకట్రామిరెడ్డి ఎవరు?

సచివాలయంలో న్యాయ శాఖ ఉద్యోగిగా కాకర్ల వెంకట్రామిరెడ్డి ఉన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు న్యాయ శాఖ నుంచి గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని సాక్షి పత్రిక రిపోర్టర్లకు అందించారనే ఆరోపణలతో కాకర్ల వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేశారు. చాలా రోజులు సస్పెన్షన్లో ఉన్నారు. ఆ తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పట్లో సచివాలయ ఉద్యోగుల సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అప్పటి వరకు అధ్యక్షునిగా ఉన్న మురళి ని ఓడించి వెంకట్రామిరెడ్డి గెలిచారు. సచివాలయ ఉద్యోగుల్లో ఆయన బలం పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సహకారం కూడా వెంకట్రామిరెడ్డికి లభించిందని చెప్పొచ్చు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వెంకట్రామిరెడ్డిపై వైఎస్సార్సీపీ కార్యకర్తగా కూటమి ప్రభుత్వం భావించింది. ఆయన వైఎస్సార్సీపీ గెలుపు కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారని ఉద్యోగం నుంచి తిరిగి సస్పెండ్ సస్పెండ్ చేసింది. ప్రస్తుతం వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్ లో ఉన్నారు.

గురువారం రాత్రి ఏమి జరిగింది?

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తన తోటి ఉద్యోగులకు ఫోన్ లు చేసి తాను పార్టీ ఇస్తున్నానని పిలిపించారు. వెంకట్రామిరెడ్డి చెప్పిన ప్రకారం తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్స్ లోకి పలువురు ఉద్యోగులు, ఆయన స్నేహితులు వచ్చారు. వీరంతా డిన్నర్ చేసేందుకు రెడీకాగా మద్యం తీసుకునే అలవాటు ఉన్న వారికి మందు పార్టీ ఉందని చెప్పి ఐదు ఫుల్ బాటిల్స్ మద్యం తీసుకొచ్చారు. మద్యంతో పార్టీ జరుగుతుందని వెంకట్రామిరెడ్డి వ్యతిరేక వర్గం వారు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు రాత్రి 11 గంటలకు వెంకట్రామిరెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం వెంకట్రామిరెడ్డి పోలీస్ కష్టడీలో ఉన్నారు.

పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారు...

సచివాలయంలోని క్యాంటిన్ పాలక వర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్యాంటిన్ కో ఆపరేటివ్ చట్టం కింద రిజిస్టర్ కావడంతో సచివాలయ ఉద్యోగులు పాలక వర్గంగా ఉంటారు. గత పాలక వర్గానికి గడువు ముగియడంతో కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఎన్నికల్లో డైరెక్టర్ లుగా 28 మంది పోటీ చేస్తున్నారు. వారిలో 11 మంది వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన వారు. తన వర్గం వారిని గెలిపించుకునేందుకు సచివాలయం ఉద్యోగుల సంఘంలో ముఖ్యులను పిలిపించి పార్టీ అరేంజ్ చేశారు. రాత్రి పూట కావడం వల్ల మందు తాగే వారి కోసం మరో వైపు వారికి ప్రత్యేకించి సిట్టింగ్ ఏర్పాటు చేశారు. అనుమతి లేని గార్డెన్ లో మందు పార్టీ ఎలా చేసుకుంటారని ప్రశ్నిస్తూ వెంకట్రామిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉద్యోగుల్లో అలజడి మొదలైంది.

కావాలనే ప్రభుత్వం కక్షకట్టి అరెస్ట్ చేయించింది...

తమ నాయకుడిని ఇప్పటికే సస్పెండ్ చేశారు. క్యాంటిన్ ఎన్నికల సందర్భంగా డిన్నర్ ఏర్పాటు చేస్తే అదేదో పెద్ద నేరమని వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన సచివాలయ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడు అన్నీ తెలిసి కూడా అరెస్ట్ చేయడం అంటే ప్రభుత్వం కావాలని కక్షపూరితంగానే చర్యలు చేపట్టిందని సచివాలయ ఉద్యోగ సంఘం నాయకులు పలువురు చెప్పారు. తాము ఉద్యోగులమైనందున తమ పేర్లు రాయోద్దని వారు కోరారు. ప్రస్తుతం బ్రాంది షాపుల వద్ద మందు నిలబడి తాగుతున్నారు. కొన్ని చోట్ల మినీ బార్లుగా బ్రాంది షాపులు మారాయి, గ్రామాల్లో బెల్ట్ షాపులు వెచ్చల విడిగా వచ్చాయి. వారిని మాత్రం ఏమీ పట్టించుకోని ప్రభుత్వం వెంకట్రామిరెడ్డి డిన్నర్ పార్టీ ఇస్తూ మద్యం అలవాటు ఉన్న వారికి తెప్పిస్తే తప్పయిందా? అని ప్రశ్నించారు. హోటల్ లో మద్యం తీసుకునేందుకు అనుమతి లేనందున తాము అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తాడేపల్లి పోలీసులు వెంకట్రామిరెడ్దిని అరెస్ట్ చేసిన విషయాన్ని ఇంతవరకు ధృవీకరించలేదు. సాధారణంగా ఎక్సైజ్ పోలీసులు ఎవరినైనా అదుపులోకి తీసుకుంటే స్థానిక పోలీసులకు అప్పగిస్తారు. ఇక్కడ ఆ వ్యవహారం జరిగిందో లేదో కూడా తెలియని పరిస్థతి ఉంది.

ప్రభుత్వానికి వెంకట్రామిరెడ్డి ఎందుకు టార్గెట్...

వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశాడని, 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రభుత్వ రహస్యాలు సాక్షి పత్రికకు అందించాడని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేశాడని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే సచివాలయంలో కూటమి ప్రభుత్వం, వైఎస్సార్సీపీ అనుకూల వర్గాలు ఉన్నాయి. ఇది ఈనాటిది కాదు. గత ప్రభుత్వాల హయాంలోనూ సచివాలయ ఉద్యోగ సంఘంలో కొందరు టీడీపీకి అనుకూలం కాగా మరికొందరు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటూ వచ్చారు. అప్పట్లో ప్రభుత్వాలు కక్ష పూరిత చర్యలకు ఎప్పుడూ పాల్పడలేదని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.

Read More
Next Story