
తెలుగుదేశం పార్టీలో కొలికపూడి నాలుగో ఎపిసోడ్!
అంతర్గత వివాదాలు, క్రమశిక్షణ చర్యల కోసం కమిటీ సమావేశాలు. ఏపీ లోని టీడీపీ రాజకీయాలపై ఆధారపడిన వారిలో పార్టీ ఐక్యత ఇలా ఉంది.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో అంతర్గత వివాదాలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై ఇటీవల చేసిన తీవ్ర ఆరోపణలు, టికెట్ కోసం 5 కోట్లు తీసుకున్నారని, ఇసుక, లిక్కర్ మాఫియాలకు అవకాశం చేస్తున్నారని బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయాలు పార్టీ అధిష్ఠానాన్ని కలవరపరిచాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన విచారణలో కొలికపూడి తన వైఖరిని వివరించారు. సాయంత్రం 4 గంటలకు చిన్ని కూడా హాజరు కానున్నారు. ఈ పంచాయతీ ఫలితాలు ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఐక్యతకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వానికి కీలకమవుతాయా?
నాల్గోసారి క్రమశిక్షణ కమిటీ ముందుకు
కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీలో 'వివాదాస్పద' ఎమ్మెల్యేగా పేరుపొందారు. 2024 ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత మూడుసార్లు క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. జనవరి 2025లో ఒక ఆదివాసీ మహిళపై దాడి చేశారనే ఆరోపణలు, మార్చి 2025లో పార్టీ సూచనలు ఉల్లంఘించడం, జూలై 2025లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు.. ఇవన్నీ గత కారణాలు. ఇప్పుడు చిన్నిపై ఆరోపణలు చేసి వాట్సాప్ స్టేటస్‌లో 'ప్రూఫ్' పోస్ట్ చేయడం పార్టీకి తలనొప్పిగా మారింది. మంగళవారం జరిగిన విచారణ ఈ చరిత్రకు ముగింపు పలుకుతుందా? లేక మరో హెచ్చరికతోనే ముగుస్తుందా అనేది చర్చ నియాంశమైంది.
కమిటీ విచారణ, ఏ ప్రశ్నలు వేశారు?
టీడీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వర్ల రామయ్య నేతృత్వంలో జరిగిన విచారణలో కొలికపూడి తన వాదనలు వినిపించారు. కమిటీ సభ్యులు ప్రధానంగా ఈ ప్రశ్నలపై దృష్టి సారించారు.
చిన్నిపై చేసిన ఆరోపణలు (టికెట్ కోసం డబ్బు, మాఫియా సంబంధాలు) వాస్తవ పరిస్థితి ఏమిటి? వాట్సాప్‌లో పోస్ట్ చేసిన 'ప్రూఫ్' ఆధారాలు ఏవి?
ఈ బహిరంగ విమర్శలు పార్టీ ఇమేజ్‌కు దెబ్బతీశాయి. మీ వ్యవహారం ఎందుకు ఇలా మారింది?
మీ గత వివాదాలు (ఆదివాసీ మహిళపై దాడి, పార్టీ సూచనలు ఉల్లంఘన) నుంచి ఎటువంటి పాఠాలు తీసుకోలేదా?
కమిటీ సభ్యులు మీడియా, సోషల్ మీడియాలో ఈ విషయాలు రచ్చరచ్చ అవుతున్న నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణకు దెబ్బ తగులుతుందని హైలైట్ చేశారు. పాల్గొన్నవారిలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నక్క అనంద్ బాబు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (చైర్మన్), సీనియర్ నాయకులు షరీఫ్, కొనకల్ల నారాయణ లు ఉన్నారు. కొలికపూడి తన వాదనలు వివరంగా చెప్పినప్పటికీ, కమిటీ వారు రాతపూర్వక వివరణ తీసుకుని, చంద్రబాబు నాయుడుకు నివేదిక సమర్పించనున్నారు.
కమిటీ నిర్ణయం కీలకం
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు కొలికపూడి వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఎన్నికల విజయాలు వ్యక్తిగత సాఫల్యాలు కాదు, పార్టీ బలంతో వచ్చాయి" అని హెచ్చరించారు. కొలికపూడిపై సస్పెన్షన్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. గతంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద లైంగిక వేధింపుల ఆరోపణలపై సస్పెన్షన్ విధించినట్టుగా, కొలికపూడికి కూడా ఇదే జరగవచ్చు. చిన్నికి లేదా హెచ్చరిక లేదా గైడెన్స్ ఇవ్వవచ్చు. కానీ కమిటీ నివేదిక ఆధారంగా చంద్రబాబు చివరి నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయం కూడా "షరమామూలేనా" అనేది కమిటీ చెప్పాల్సి ఉంటుంది అని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఐక్యతకు సవాలు, చంద్రబాబు 'ఐరన్ ఫిస్ట్'
టీడీపీ విజయం తర్వాత అంతర్గత వివాదాలు పెరుగుతున్నాయి. టికెట్ కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలు, ఫ్యాక్షనలిజం, స్థానిక నాయకుల మధ్య పోటీలు... ఇవన్నీ పార్టీని దెబ్బ తీస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఇటీవల ఎమ్మెల్యేలకు "క్రమశిక్ష లేకపోతే పార్టీలో వద్దు వెళ్లండి" అని స్పష్టం చేశారు. ఈ వివాదం కొలికపూడి-చిన్ని మధ్య మాత్రమే కాదు, కృష్ణా జిల్లాలో టీడీపీ బలాల మధ్య ఘర్షణలకు దారి తీసింది. పార్టీ ఐక్యత కాపాడుకోవాలంటే చంద్రబాబు 'ఐరన్ ఫిస్ట్' విధానాన్ని కఠినంగా అమలు చేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్‌లా అంతర్గత గందరగోళాలు పెరిగి, ప్రభుత్వ స్థిరత్వానికి సవాలు అవుతాయి. ఈ పంచాయతీ ఫలితాలు బుధవారం తెలుస్తాయి. కానీ టీడీపీలో క్రమశిక్ష మరింత బలపడితే, పార్టీ భవిష్యత్తుకు మేలు జరుగుతుందనేది పార్టీలో కొందరు నాయకుల వాదన. లేకపోతే మరో 'కొలికపూడి ఎపిసోడ్' పొంచి ఉంటుందనే అసహనం పార్టీ వర్గాల్లో వుంది.

