
వెలుగోడు మా కొంప ముంచుతోంది, గాలేరుకు నీళ్లు ఆపండి మహాప్రభో!
నంద్యాల కలెక్టర్ కు రాయలసీమ సాగునీటి సాధన సమితీ నేత బొజ్జా దశరథరామిరెడ్డి వినతి..
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి విడుదల చేస్తున్న కృష్ణా జలాలలో సగానికిపైగా కుందూనదిలోనికి విడుదల చేయడం వలన కృత్రిమ వరదలతో రైతుల పంట పొలాలు జలమయం అవుతున్నాయని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా కుందూనదిలోకి విడుదల చేసే నీటిని గణనీయంగా తగ్గించాలని మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని కలిసి పరిస్థితిని వివరించారు. ఈమేరకు వినతి పత్రాన్నీ సమర్పించారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులతో, వరద నీటితో ముంపుకు గురైన పాములపాడు, కోవెలకుంట్ల, పెద్దముడియం మండల రైతు ప్రతినిధులతో కలిసి బొజ్జా దశరథరామిరెడ్డి కలెక్టర్ ని కలిశారు.
అందులో ఆయన ఏమని పేర్కొన్నారంటే..
కుందూనదిలో వరదలతో పాటు, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుండి గోరుకల్లు రిజర్వాయర్ వరకు కృష్ణా జలాలను తీసుకొని పోయే ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 22,000 క్యూసెక్కులకు పెంచారు. అయితే కొన్ని వంతెనలు, ఆక్వడెక్టుల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. దీనివల్ల 10,000 క్యూసెక్కులకు మించి నీటిని తరలించలేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని గమనించకుండా ఏకంగా 13,000 క్యూసెక్కుల నీటిని తరలించడంతో పాములపాడు మండలంలో పొలాలు మునగడం, జోము ఉండటంతో వేలాది ఎకరాలలో రైతులు నష్టపోతున్నారు.
ఈ వరదల వల్ల పంట నష్టపోవడం, ఉప్పలం పొంగడంతో వ్యవసాయానికి పనికిరాకుండా పోవడం, పొలాలు కోతలకు గురవడం తదితర ఇబ్బందుల వలన రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని కలెక్టర్ దృష్టికి బొజ్జా తీసుకొచ్చారు.
కుందూనదిలోకి నీటి విడుదలను తగ్గించాలని కోరారు. ముంపు వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా రెవెన్యూ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని బొజ్జా కోరారు. వెలుగోడు రిజర్వాయర్ స్పిల్వేగేట్ల ద్వారా నిరంతరము గాలేరు నదిలోనికి నీరు విడుదల చేయడం వలన కుందూనది పరీవాహక ప్రాంతంలో వరదలు సృష్టించడమే కాకుండా వెలుగోడు స్పిల్వేగేట్లకు కూడా భద్రత లేని పరిస్థితి కలుగుతున్న నేపథ్యంలో వెలుగోడు రిజర్వాయర్ స్పిల్వేగేట్ల ద్వారా నీటి విడుదలను ఆపాలని కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు.
ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన SRBC రెగ్యులేటర్ ద్వారా కృష్ణా జలాలు SRBC ప్రధాన కాలువకు చేరకుండా కాలువను శాశ్వతంగా మూసివేసి, ఆ కాలువను నిప్పులవాగుకు మళ్లించిన అంశంపై కూడా ప్రభుత్వానికి నివేదిక పంపాలని కలెక్టర్ ని కోరారు. పై అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని కలెక్టర్ - రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధుల బృందానికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్. రెడ్డి, కార్యదర్శి మహేశ్వరరెడ్డి, ప్రచార కార్యదర్శి నిట్టూరు సుధాకర్ రావు, కార్యవర్గ సభ్యులు కృష్ణమోహన్ రెడ్డి, కుందూ పరిరక్షణ సమితి నాయకులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, కడప జిల్లా పెద్దముడియం మండలంలో కుందూనది వరదలతో నష్టపోతున్న రైతుల ప్రతినిధి బసవేశ్వర రైతు సంఘం కార్యదర్శి ఎం సి కొండారెడ్డి, SRBC ప్రధాన కాలువ వరదలతో నష్టపోతున్న పాములపాడు మండల రైతులు వెంకటేశ్వర్లు, చిన్న ఆవులరెడ్డి, కుందూనది వరదలతో నష్టపోతున్న కోయిలకుంట్ల మండలం రైతుల ప్రతినిధి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story