కళ్లను కట్టి పడేసే విజయవాడ పూల మార్కెట్
x

కళ్లను కట్టి పడేసే విజయవాడ పూల మార్కెట్

హోల్ సేల్ పూల మార్కెట్లో విజయవాడను మించిన మార్కెట్ లేదు. అన్ని ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తారు. ఇతర రాష్ట్రాలకు కూడా హోల్ సేల్ గా విక్రయిస్తారు.


విజయవాడలోని పూల మార్కెట్ ఎప్పుడూ పూల వాసనతో ఘుమ ఘుమ లాడుతుంటుంది. ఆ ప్రాంతానికి వెళ్లగానే సువాసనలు వస్తుంటాయి. సుమారు 80 ఏళ్లుగా విజయవాడలో పూలు హోల్ సేల్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. వీరి వద్ద రిటైలర్స్ ఎంతో మంది కొనుగోలు చేసి పూలమ్మకుని జీవనం సాగిస్తున్న వారు ఉన్నారు. సుమారు ఎకరం విస్తీర్ణంలో ఈ మార్కట్ ఆర్టీసీ బస్టాండ్ పక్క రైల్వే లైన్ కు పడమటి వైపున ఉంది. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీసును ఆనుకుని ఉన్న ఈ మార్కెట్ ఇక్కడికి వచ్చి 20 ఏళ్లు దాటింది. అంతకు ముందు విజయవాడ వన్ టౌన్ లోని పంజా సెంటర్ లో రోడ్డు పక్కన పూల వ్యాపారం జరిగేది. విజయవాడ ఆంధ్రప్రదేశ్ కు ఒక ముఖ్యమైన రవాణా కేంద్రం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి పూలు వస్తాయి, అలాగే ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తారు. దీనివల్ల ఇది ఒక ముఖ్యమైన పంపిణీ కేంద్రంగా మారింది.

365 రోజులూ వ్యాపారం

పూల వ్యాపారంలో సీజన్ లు ఉంటాయి. ఏ సీజన్ లో పూసే పూలకు ఆ సీజన్ లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సీతాకాలం విజయవాడ చుట్టుపక్కల, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పలు రకాల పూల తోటలు వేసి పంట పండిస్తారు. ఆ తరువాత వేసవి కాలంలో మల్లె పూలు ఎక్కువగా విజయవాడ చుట్టుపక్కల, గుంటూరు జిల్లాల్లో పండిస్తారు. వర్షాకాలంతో పాటు అన్ని కాలాల్లోనూ కర్నాకలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా బెంగళూరు నుంచి పూలు విజయవాడకు దిగుమతి చేసుకుంటారు. ఎక్కవగా బస్సుల్లో వస్తుంటాయని వ్యాపారులు తెలిపారు. పూలు ఎంత దూరం ప్రయాణించినా గాలి తగలకుండా, తడి ఆరకుండా ఉంటే కనీసం రెండు నుంచి మూడు రోజులు బాగుంటాయి. కొన్ని రకాల పూలు ఒక్క రోజుకంటే ఎక్కువ నిల్వ ఉండవు. బెంగళూరు నుంచి వచ్చే పూలు హైబ్రెడ్ రకాలు ఎక్కువగా ఉంటాయి. డెకరేషన్ లు, ఫంక్షన్ లు, పెళ్లిళ్ల సమయాల్లో ఎక్కువగా అమ్ముడు పోతుంటాయి.

సీతాకాలం స్థానికంగానే పూలు పండిస్తారు

రైతులు చలికాలంలో కాలంలో విజయవాడ, గుంటూరు పరిసరాల్లోనే ఎక్కువగా పూలు పండిస్తారు. నవంబరు, డిసెంబరు, జనవరిలో పెద్దవడ్లపూడి, ఇప్పటం, వడ్డేశ్వరం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి, మెల్లంపూడి, మైలవరం నియోజకవర్గంలోని సెంటర్ గూడెం వంటి గ్రామాల్లో పూల పంట సాగు చేస్తారు. వేల ఎకరాల్లోనే సాగవుతుంది. కొన్ని పూలు అంటే కనకాంబరం వంటి రకాలు 365రోజులూ కాపుకు వస్తాయి. ఒకసారి పంట వేసిన తరువాత దఫదఫాలుగా పూలు కోయవచ్చు.

బెంగళూరు నుంచి వచ్చే హైబ్రిడ్ రకాలు

గులాబీలలో అనేక హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. అవి వాటి రంగు, పరిమాణం, సువాసనతో విభిన్నంగా ఉంటాయి. ఇందులో డబుల్ డిలైట్, పీస్, మిస్టర్ లింకన్ ముఖ్యమైనవి. ఆసియాటిక్ లిల్లీలు, ఓరియంటల్ లిల్లీలు, లాంగ్ఫ్లవర్ లిల్లీలు హైబ్రిడ్ రకాల్లో ముఖ్యమైనవి. ఆర్కిడ్ పూలలో కూడా హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. ఫాలెనోప్సిస్, కాట్ల్యా, డెండ్రోబియం. జల్ ఫరా (కేవలం డెకరేషన్), చిక్ బల్లాపూర్, బెంగళూరు నుంచే కాకుండా కోలార్, ఏపీలోని కుప్పం. వి కోట ప్రాంతాల నుంచి పూలు వస్తుంటాయి. చామంతి పూలు కూడా బెంగళూరు నుంచి ఎక్కువగానే వస్తాయి. చేమంతిలో చాలా రకాలు ఉన్నాయి. రంగులు ఉన్నాయి. జిరబర, తార్నేష్, ఆర్కెట్ వంటి పూల రకాలు కేవలం డెకరేషన్ కే వాడతారు. బొకేలు తయారు చేసేందుకు కూడా ఈ పూలు వాడతారు.

స్థానికంగా పండించే పూల రకాలు

ఏపీలో స్థానికంగా పండించే పూలల్లో కనకాంబరం, మల్లె పూలు, సెంటు గులాబీ, నాటు గులాబీ, కాగడాలు, జాజి పూలు, చామంతి, బంతి, లిల్లీ పూల రకాలు ఉన్నాయి. వేసవి కాలంలో మల్లె పూలు బాగా పండిస్తారు. మిగిలిన పూలు చలికాలంలో పండిస్తారు. చామంతిలో ఎనిమిది రకాల రంగులు ఉన్నాయి. బంతి పూలలోనూ రంగులు ఉన్నాయి. బంతి, చామంతి, కాగడాలు వంటి కొన్ని రకాలతో పూల దండలు ఎక్కువగా తయారు చేస్తారు. దండలకు కూడా సభలు, సమావేశాలు, పెళ్లిళ్లు ఎక్కువగా ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది

రోజుకు రూ. 20 లక్షల వ్యాపారం

ఒక రోజు ఎక్కువ జరిగినా, ఒక రోజు తక్కువ జరిగినా సగటున ప్రతి రోజూ విజయవాడలో హోల్ సేల్ పూల వ్యాపారం రోజుకు రూ. 20 లక్షల వరకు జరుగుతుందని విజయవాడ హోల్ సేల్ పూల మార్కెట్ అధ్యక్షులు గుండు అశోక్ తెలిపారు. ఆయన ది ఫెడరల్ విలేకరితో మాట్లాడుతూ ప్రస్తుత వ్యాపారం అన్ని రకాల పూలకు సీజన్ అని చెప్పారు. మల్లె పూలు మినహా మిగిలిన రకాలన్నీ మార్కెట్లో అందుబాటులో ఉంటాయన్నారు. విజయవాడ నుంచి ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం లకు పూలు ఎగుమతి చేస్తామన్నారు. పూలు ఎక్కవ అందుబాటులో ఉంటే ధరలు తగ్గుతాయని, ఉత్పత్తి తగ్గినప్పుడు ధరలు పెరుగుతాయన్నారు. ఒక్కోసారి కేజీ రూ. 50లు మల్లెపూలు అమ్మితే కొన్ని సార్లు అవే రూ. 200లు కేజీ అమ్ముతామన్నారు. మల్లెపూలు ఒక్క రోజుకు మించి ఉండవని, వెంటనే వాడిపోతాయన్నారు. సీతాకాలంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచే ఎక్కవ పూలు వస్తాయన్నారు. అమరావతి ప్రాంతంలో గతంలో పూల తోటలు ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం ఉండవల్లి వద్ద తప్ప అమరావతి ప్రాంతంలో పూలు లేవన్నారు.

రైతులే నేరుగా తెచ్చి అమ్ముకుంటారు

పూల రైతులు పూలు తెచ్చుకుని మార్కెట్లో ఏదో ఒక రూము ఆ రోజుకు అద్దకు తీసుకుని అమ్ముకునే అవకాశం ఉంది. లేదంటే రైతు పూలు వ్యాపారులకు అమ్మి వెళ్లాలంటే కొనుగోలుపై వ్యాపారికి 10 శాతం రైతు డబ్బులు ఇస్తాడని మార్కెట్ అధ్యక్షులు అశోక్ తెలిపారు. ఒక్కో రూములో చేసే వ్యాపారిపై కనీసం 20 మంది స్టాఫ్ ఆధారపడి ఉంటారని, అందువల్లే అమ్మకం దారులు వచ్చిన డబ్బులో 10 శాతం కొనుగోలు చేసిన వ్యాపారికి ఇస్తాడన్నారు. అందులో మార్కెట్ మెయింటెనెన్స్ కూడా ఉంటుందన్నారు.

రోజుకు మూడు టన్నుల మల్లెల వ్యాపారం

మార్కెట్లో మల్లెపూల సీజన్ వచ్చిందంటే దండిగా పూలు వస్తుంటాయి. ప్రధానంగా తాడేపల్లి పరిసరాలు, మైలవరం ప్రాంతం నుంచి మల్లెలు ఎక్కవ వస్తాయి. రోజుకు హైదరాబాద్ కు టన్నుల కొద్ది మల్లె పూలు పంపిస్తుంటారు. మిగిలిన పూలు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువగానే పండిస్తారు. అయితే మల్లె పూలు కాస్త తక్కువ రేటుకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి అమ్ముతుంటామని వ్యాపారులు తెలిపారు. రోజుకు విజయవాడలో మూడు టన్నుల వరకు మల్లెపూల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు తెలిపారు. రిటైల్ వ్యాపారులు కూడా ఎక్కువగా కొనుగోలు చేసి అక్కడక్కడ పెట్టకుని అమ్ముకుంటుంటారని, రైతు బజార్ల వద్ద కూడా పెట్టి వీరు అమ్ముతుంటారని హోల్ సేల్ వ్యాపారులు తెలిపారు. చాలా మంది ఇంటింటికీ తిరిగి అమ్ముతుంటారని, తోపుడు బండ్లపై కూడా పెట్టుకుని అమ్మకుంటుంటారని తెలిపారు. వారంతా ఈ మార్కెట్లోనే కొనుగోలు చేస్తారని తెలిపారు.

కర్నూలు నుంచి కూడా విజయవాడ మార్కెట్ కు..

కర్నూలు, కడప ప్రాంతాల్లో పూలు పండించిన రైతులు కూడా నేరుగా మార్కెట్ కు తెచ్చి అమ్ముతుంటారు. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన పూల రైతు గోసుల శ్రీనివాసులు మార్కెట్లో పూలు అమ్మేందుకు తెచ్చారు. ఆయన చేమంతి పూలు సాగు చేశారు. ఎకరం పొలంలో పండించిన పంటను అమ్మితే ఖర్చులన్నీ పోను రూ. 50వేల వరకు ఉంటాయన్నారు. ఒక్కసారి పంట వేస్తే పూలు కోసిన తరువాత చెట్లు పీకేయాల్సిందేనన్నారు. ఎరువులు, పురుగు మందుల ఖర్చు ఎక్కువవుతోందన్నారు. మార్కెట్లో నాకు తెలిసిన వ్యాపారులు ఉన్నారని, తెచ్చిన పూలు అమ్మిన తరువాత వెళతానని చెప్పారు.

మునిసిపాలిటీ వారే మెయింటెనెన్స్

మార్కెట్ కు స్థలం మునిసిపాలిటీ వారు 2004లో ఇచ్చారు. అప్పటి నుంచి వారే మెయింటెనెన్స్ చూస్తున్నారు. మునిసిపల్ ఆఫీసు ముందు వైపు నుంచి దారి మార్కెట్ కు ఉంది. అలాగే వెనుక వైపున రైల్వే ట్రాక్ పక్క నుంచి కూడా రోడ్డు నిర్మించాలని పూల వ్యాపారుల సంఘం కోరుతోంది. మార్కెట్లో మొత్తం 112 షాపులు ఉన్నాయి. షాపులకు లైసెన్స్ లు తీసుకోవాలి. మార్కెట్ యార్డుకు, లేబర్ లైసెన్స్ లు, షాపు లైసెన్స్ లు తీసుకున్నందుకు సంవత్సరానికి రూ. 5లక్షలు ఖర్చవుతుందని మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ తెలిపారు.

రోజుకు రూ. 500 నుంచి 1000ల వరకు మిగులుతాయి

40 సంవత్సరాల నుంచి మార్కెట్ లో పూల వ్యాపారం చేస్తున్న విజయవాడకు చెందిన వై ప్రసాదరెడ్డి ది ఫెడరల్ తో మాట్లాడుతూ వ్యాపారంలో హెచ్చు థగ్గులు ఉంటాయి. ఒక రోజు రూ. 500లు వస్తే మరొక రోజు వెయ్యి వరకు వస్తాయి. పూల వ్యాపారం బాగానే ఉంది. లోకల్ రకాల పూలు పూజలు, పెళ్లిళ్లకు ఎక్కువగా వాడతారు. హైబ్రిడ్ రకాల పూలు డెకరేషన్ లకు వాడుతారన్నారు. డెకరేషన్ లకు వాడే పూలు కాస్త రేటు ఎక్కువగానే ఉంటాయన్నారు. ఎక్కువైనా తక్కువైనా కొనే వారు లేకపోతే ఎంతకైనా ఇవ్వాల్సిందే పనికి రాకుండా పోతాయన్నారు.

ఐదు వేల మంది జీవనం

ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5వేల మంది పూల వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నట్లు విజయవాడ పూల హోల్ సేల్ మార్కెట్ అధ్యక్షులు గుండు అశోక్ తెలిపారు. వీరిలో ఎక్కువ మంది ఏళ్ల తరబడి జీవితాన్ని పూల వ్యాపారం ద్వారానే గడుపుతున్నారని, వీరందరికీ జీవనోపాధి కల్పిస్తున్న మార్కెట్ కు సౌకర్యాలు మెరుగు పరచాల్సి ఉందన్నారు. తమ వద్ద కొనుగోలు చేసిన వారు ఎక్కువ మంది దుర్గమ్మ గుడి వద్ద పెట్టుకుని పూలు అమ్ముతుంటారని తెలిపారు.

Read More
Next Story