కూటమి పాలన అంతా మోసం.. దగా.. మాయ..!
x
మీడియాతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

కూటమి పాలన అంతా మోసం.. దగా.. మాయ..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలు, వృద్ధులు, వితంతులకు పండగ లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలో రాష్ట్రంలోని వృద్ధులు, భర్తలను కోల్పోయిన మహిళలు దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. వీరిపట్ల మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఈ ఏడాదిన్నర కాలంలో వీరికి, పేదలకు పండగ లేదన్నారు. కూటమి పాలన అంతా మోసం, దగా, మాయ.. అంటూ విరుచుకుపడ్డారు. ఆదివారం సాయంత్రం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయనేమన్నారంటే?

మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నా..
కూటమి పాలకులకు మంచి బుద్ధిని, ఆలోచనని, మానవత్వాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నా. మీ పచ్చ చానళ్లలో రోజూ ఏదో ఒక అంశంపై డిబేట్‌ పెడుతున్నారు కదా? రైతులు, వృద్ధులు, వితంతుల బాధలపై డిబేట్‌ పెట్టండి. దానివల్లనైనా ప్రభుత్వం స్పందిస్తుంది. ఉత్తరాంధ్రలోని చెరుకు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. రైతులు చెరకుకు బదులు మొక్కజొన్న వేస్తున్నారు. మా హయాంలో మొక్కజొన్నను మార్కెట్‌ ధరకు రైతుల నుంచి కొనకపోతే మార్క్‌ఫెడ్‌ ధరకు కొన్నాం. ఇప్పుడు అలా కొనమంటుంటే అదిగో ఇదిగో అంటున్నారు తప్ప కొనడం లేదు.
ఓటెందుకేశామని బాధపడుతున్నారు..
కూటమి పాలనను చూసి ప్రజలు వారికి ఎందుకు ఓటేశామా? అని బాధపడుతున్నారు తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. మున్ముందు పాలకులు తప్పక ఫలితం అనుభవిస్తారు. సూపర్‌ సిక్స్‌ అట్టహాసంగా చెప్పుకుంటున్నారు. అమ్మ ఒడి అందరికీ ఇచ్చారా? ప్రతి పమండలంలోనూ 300–350 మందికి అమ్మ ఒడి ఇవ్వాలి. ఇంకా సగం మంది అంటే 3,4 లక్షల మందికి బకాయిలు ఇవ్వాలి. పీ–4పై ఏడాది పాటు చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగాలు చేశారు. ఇప్పుడు ఆ పీ–4 ఏమయింది? ఎక్కడుంది? దత్తత తీసుకున్న వారికి ఏం ఇచ్చారు? అంతా మోసం దగా మాయ.
ఇదేమి న్యాయం?
జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా పొట్టేళ్లు కోశారని వారిని నడిరోడ్డుపై బహిరంగంగా నడిపించి తీసుకెళ్లారు. మాకు వాహనాలు లేక నడిపించి తీసుకెళ్తున్నారని డీజీపీ చెబుతారా? ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ వ్యక్తే సాక్షాత్తూ శివలింగాన్నే తొలగిస్తే ఏం చేశారు? గతంలో బాలకృష్ణ సినిమా విడుదల వేళ ఆయన కటౌట్‌కు పొట్టేళ్ల తలలు దండలా వేలాడదీశారు. అది తప్పు కాదా? అందుకే ఈ పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించమని, ఆలోచనలు ఇవ్వమని భగవంతుడిని కోరుతున్నాం రాష్ట్రంలో శాంతిభద్రతలున్నాయా? ఈ ఏడాదిన్నరలో హత్యలు, మానభంగాలు, చోరీలు అఘాయిత్యాలు ఎన్ని జరిగాయో చెప్పండి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపేయించానని పబ్లిక్‌గా చెప్పారు. అది అబద్ధమని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు?
భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ మాదే..
భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ మాదే. 2023లో ఈ విమానాశ్రయానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. అవసరమైన అనుమతులు వేగంగా వచ్చేలా కృషి చేశారు. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని 2026 డిసెంబర్‌కి కాకుండా జూన్‌ నాటికే పూర్తి చేయాలని జగన్‌ ఆ వేదికపైనే జీఎమ్మార్‌ అధినేతను కోరారు. ఆ ప్రకారమే ఆయన పూర్తి చేస్తామని మాటిచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని సత్వరమే అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు జీఎమ్మార్‌ అధినేత మల్లికార్జునరావుకు మా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ఎయిర్‌పోర్టు వచ్చాక హైవేకి కనెక్టివిటీ అవసరం. అందుకోసం మా హయాంలో విశాఖ పోర్టు నుంచి ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ రోడ్డు ప్రతిపాదించాం. హైవేపై 12 ఫ్లైఓవర్లు నిర్మించాలని తలపెట్టాం. కానీ ఈ ప్రభుత్వం వాటిని పక్కనపెట్టేసింది.
చంద్రబాబులా ఏ సీఎం చేయలేదు..
దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రైనా విదేశీ పర్యటనకు చెప్పకుండా వెళ్లారా? సీఎం ఫలనా చోటకు వెళ్తున్నానని చెప్పడం రివాజు. తన ఆరోగ్యం బాగు చేయించు కోవడానికనో, స్నేహితుల దగ్గరకనో, సంపాదించిన సొమ్ము దాచుకోవడానికనో, రాష్ట్రంలో పెట్టుబడులు ఎంవోయూలకనో చెప్పొచ్చు కదా? ఏ ఊరు, ఏ దేశం వెళ్తున్నారో చెప్పకుండా వెళ్లిన ఏకైక సీఎం చంద్రబాబే. దీన్ని ఆయన సీఎంగా అర్హుడో కాదో రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమని కోరుతున్నాం’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Read More
Next Story