కారంచేడు మారణ హోమాన్ని చూసిన చీకటి రోజు.. నేర్చిన పాఠాలెన్నో!
x
Karamchedu Rudhira Ksetram

కారంచేడు మారణ హోమాన్ని చూసిన చీకటి రోజు.. నేర్చిన పాఠాలెన్నో!

ఓ చిన్న రెచ్చగొట్టే చర్య ఇంతటి దారుణానికి దారితీసిందంటే భూస్వామ్య దురహంకారం ఎలాంటిదో గమనించవచ్చు.


1985 జూలై 17.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (AP).. ప్రకాశం జిల్లా చీరాల పట్టణానికి 7 కి.మీ దూరంలో కారంచేడు(ఇప్పుడు బాపట్ల జిల్లా).. భూస్వాములు, బిలియనీర్లు, సినీ ఫైనాన్షియర్లు, వ్యాపారవేత్తలకు నిలయం ఆ ఊరు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వంటి హేమాహేమీలది ఆ ఊరే.
అటువంటి ఊళ్లో భూస్వాములు తెగబడ్డారు. వర్ణించవీల్లేని హింసకు పాల్పడ్డారు. ఆరుగురు దళితులు దారుణంగా హత్యకు గురయ్యారు. ఇరవై మంది గాయపడ్డారు. ముగ్గురు మహిళల్ని చెరిచారు. వందలాది మంది పరారీ అయ్యారు. పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం అయ్యాయి. మరికొన్ని కాలి బుగ్గిపాలయ్యాయి. ఇళ్లల్లోని అణాపైసల్నీ దోచేశారు. ఓ నెల తరువాత.. ఈ ఊచకోతను తాను కళ్లారా చూశానంటూ ఓ ఆడమనిషి బయటికి వస్తే ఆమె ఊపిరే లేకుండా పోయింది. ఇదంతా పట్టపగలు.. అందరూ చూస్తుండగానే జరిగిన మారణహోమం. చరిత్రలో చీకటి రోజు.
కారంచేడు కేవలం ఒక అపఖ్యాతి ఘటనే కాదు, అనేక ఉద్యమాలకు పొలికేక లాంటిది.
1968లో కృష్ణా జిల్లా కంచికచర్లలో ఓ దళితుణ్ణి సజీవదహనం చేస్తే దాన్ని 'వ్యక్తిగత' సంఘటన అన్నారు. కారంచేడులో సామూహిక హత్యాకాండ జరిగింది. ఆ తరువాత నీరుకొండ ఊచకోత (జూలై 1987)లో ఐదుగురు ఎస్సీలు, చుండూరులో (ఆగస్టు 1991) ఎనిమిది మంది దళితులు హత్యకు గురయ్యారు. ముక్కలు, ముక్కలుగా నరికిన మృతదేహాలకు పరీక్ష చేయాల్సిన ఓ వైద్యుడు ఆ దృశ్యాల్ని చూసి మనసు చలించి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చుండూరు మారణకాండ, తత్ఫలితంగా జరిగిన హింసాకాండ దాదాపు 20 మంది మరణాలకు దారితీసింది.
కానీ, కారంచేడు దళిత ఉద్యమం ఖండాతరాలు పాకింది. దళిత మహాసభ పుట్టింది. కోస్తాంధ్రకు చెందిన దళిత మేధావి కత్తి పద్మారావు, తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయవాది, పౌర హక్కుల ఉద్యమ నాయకుడు బొజ్జ తారకం స్థాపించిన AP దళిత మహాసభ ఎస్సీలను ఏకం చేసింది. మొత్తం దళిత చరిత్రలో అదో మైలురాయి.
ఆ ఉద్యమఫలితమే 1989లో SC/ST (అత్యాచారాల నివారణ) చట్టం. కానీ ఉద్యమం త్వరలోనే బలహీనపడి, విడిపోయింది. ఉప-కులాల వారీగా చీలిపోయింది. పాలక వర్గాలు, వారి పార్టీలు ఉద్యమ నాయకులను దగ్గరకు తీసుకుని బుజ్జగింపుల పేరిట కొనుగోళ్లు చేశాయి. ఇదో విషాదం.
మరోపక్క, అప్పటి వరకు కుల ఆధారిత హింసను తిరస్కరించిన కమ్యూనిస్టులు దాని ఉనికిని అంగీకరించడం ప్రారంభించారు. అస్తిత్వ ఉద్యమాలను బలపర్చారు. కులంపై చర్చ మొదలైంది. అప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీలకు పునాది వర్గాలుగా ఉన్న దళితులు పార్టీలకు దూరం కావడం మొదలు పెట్టారు. మరికొందరు దళిత నేతలైతే కమ్యూనిస్టులను అంధులు, మూర్ఖులు, పక్షపాతంతో ఉన్నారనే విమర్శలను గుప్పించారు.
ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అధికారికంగా పర్యటించారు. ప్రజలను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కానీ, కారంచేడులో పోలీసులు బాధితులను రక్షించలేదు. అధికార పార్టీ అండదండలతోనే చాలా రోజుల పాటు నిందితులను అదుపులోకి కూడా తీసుకోలేదు.


మొదట్లో ఈ సంఘటనను 'రెండు కులాల మధ్య ఘర్షణ'గా చూపాలనుకున్నారు. వాస్తవానికి ఇదంతా ఆ గ్రామంలోని కమ్మ కులానికి చెందిన భూస్వాములు, వారి అనుచరులు చేసిన మారణహోమాన్ని- దళితుల- అణచివేతలో భాగంగానే చూడాలి అంటారు ఆనాటి దళిత ఉద్యమ నాయకులు.

ఓ చిన్న రెచ్చగొట్టే చర్య ఇంతటి దారుణానికి దారితీసిందంటే భూస్వామ్య దురహంకారం ఎలాంటిదో గమనించవచ్చు. దళితులు తాగే మంచినీటి చెరువులో ఒక కమ్మ బాలుడు గేదెను కడగడం, కలుషితమైన నీటిని తిరిగి చెరువులోకి వదలడంపై మరో దళిత బాలుడు అభ్యంతరం చెబుతాడు. అక్కడ జరిగిన గొడవలో కమ్మవాళ్ల కుర్రాడు దళితుణ్ణి కొడతాడు. ఒక పేద మహిళ అతనిని రక్షించడానికి ధైర్యం చేసింది. గ్రామంలో ఎక్కువ వ్యవసాయ భూములున్న భూస్వాములకు అది నచ్చలేదు. అవమానంగా భావించి దాడికి తెగబడ్డారు.
పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించలేదు. కుట్రపూరితంగా వ్యవహరించారు. ప్రభుత్వం హంతకులను శిక్షించడానికి నిజాయితీగా పని చేయలేదు. దాంతో కేసు వీగిపోయింది. 28 ఏళ్లతర్వాత ఈ కేసుపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఒక్కరికి మాత్రమే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
అయితే కారంచేడు ఉద్యమం అనేక సామాజిక ఉద్యమాలకు దారి చూపింది. దళితుల ఆత్మగౌరవ పోరాటాలకు బలాన్నిచ్చింది. దళితుల్లో ప్రతిఘటనా చైతన్యాన్ని రగుల్చింది. అనేక సంస్థల ఆవిర్భావానికి దారి ఏర్పడింది. పాలకవర్గాలను రాజకీయంగా నిలదీసే పోరాటాలు నడిపే స్థాయికి వచ్చాయి. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ప్రకటించేంత వరకూ ఈ ఉద్యమ స్ఫూర్తి సాగింది. పూర్తి వివరాలకు కారంచేడు ఉద్యమం, నేర్పిన పాఠాలు ఏమిటీ అనే చర్చా కార్యక్రమాన్ని ఈ లింకులో చూడండి.




Read More
Next Story