
దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసం
స్వర్గీయ రాఘవాచారి సంపాదకీయాల నాల్గవ సంపుటిని విజయవాడలో ఆవిష్కరించిన సీపీఐ నారాయణ.
వామపక్ష పార్టీలు విలీనం కావాల్సిన అవసరం ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అభిప్రాయపడ్డారు. అక్షర శస్త్రధారి చక్రవర్తుల రాఘవాచారి జాతీయ అంశాలతో కూడిన సంపాదకీయాల నాల్గవ సంపుటి పుస్తకావిష్కరణ సభ విజయవాడ సిద్దార్థ ఆడిటోరియంలో సి రాఘవాచారి ట్రస్ట్ అధ్వర్యంలో శనివారం నిర్వహించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన నారాయణ మాట్లాడుతూ సమకాలీన రాజకీయాలు, పరిస్థితులకు రాఘవాచారి సంపాదకీయాలు సాక్ష్యాలుగా నిలుస్తాయన్నారు. సంపాదకీయం రాయడం అంత సులువు కాదని అన్నారు. రాఘవాచారి రాజకీయ నాయకుడు కాదు కానీ, రాజకీయ నాయకులకే గురువు లాంటి వారని అభివర్ణించారు. నాడు ఆయన కంటే సీనియర్ సంపాదకులైన పొట్లూరి స్వయంగా రాఘవాచారిని ఓ సభలో ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. వరుసగా రాఘవాచారి సంపాదకీయాలను సంపుటిలుగా పుస్తకాలు తీసుకువస్తున్న రాఘవాచారి ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు.
దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను పాలకులు భ్రష్టు పట్టిస్తున్నారని నారాయణ విమర్శించారు. తమిళనాడు గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలను గుర్తు చేశారు. రాష్ట్రపతిని రబ్బర్ స్టాంప్‌గా మార్చేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వాలకు అనుకూల తీర్పులు ఇచ్చిన వారికి రాజ్యసభ సభ్యత్వాలు, గవర్నర్ పోస్టులు ఇవ్వడాన్ని చూస్తున్నామన్నారు.
రాజకీయాల్లో విలువలు కనుమరుగవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును ఉపరాష్ట్రపతి తప్పుబట్టడమంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. అదే ప్రతిపక్షాలు గానీ, వామపక్షాలు గానీ అలా మాట్లాడితే దేశద్రోహులు అంటూ కేసులు నమోదు చేస్తారన్నారు. వ్యవస్థలకు, ప్రభుత్వానికి మధ్య ఉండాల్సిన లక్ష్మణ రేఖ ఎగిరిపోయిందన్నారు.
సీబీఐ, ఈడీ, నీతి ఆయోగ్ తదితర స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు ప్రధాని మోదీ గుప్పిట్లో ఉండిపోయాయని, రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటోందని అన్నారు. దేశంలో ఒకటి, రెండు శాతం ఉన్న వర్గ ప్రజానీకానికి సైతం సమానహక్కులు ఉండాలని రాజ్యాంగంలో అంబేద్కర్ రాశారన్నారు. ప్రస్తుత పాలకుల ఫాసిస్టు ధోరణిల కారణంగా భారతదేశం చీలిపోయే పరిస్థితి వస్తోందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారే ధ్వంసం చేస్తున్నారని, భవిష్యత్తులో ఉత్తర, దక్షిణ భారతదేశం అంటూ విభజనవాదం వచ్చే ప్రమాదం ఉందన్నారు.
ప్రధాని మోదీ పరపతి తగ్గిపోతోందని, అందుకే మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని, అందువల్ల వామపక్షాల ఐక్యత కాకుండా సీపీఐ, సీపీఎం కలవాల్సిన సమయం ఆసన్నమైందని నారాయణ అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ రాఘవాచారితో స్నేహం చేస్తే వదులుకోలేరని అన్నారు. పార్టీలో తన ఎదుగుదల సమయంలోనే ఆయన విశాలాంధ్ర ఎడిటర్‌గా వచ్చారన్నారు. ఎంతపెద్ద విషయాన్నైనా సులభంగా చెప్పే తత్వం రాఘవాచారిదని అన్నారు. అన్ని అంశాలపై అవగాహన గల వారు చాలా అరుదుగా ఉంటారని అన్నారు. ప్రత్యర్ధులు కూడా ఆయనను గౌరవిస్తారని, రాఘవాచారి రాసిన సంపాదకీయాలకు కాలానుగుణ్యత ఉందన్నారు. యూనివర్సిటీల్లో కులతత్వం, అంగట్లో చదువుల తల్లి వేలం, రాజకీయ రంగంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయని, వాటిని మళ్లీ అచ్చువేసి చదువుకోవచ్చని అన్నారు. కేంద్రంలోని బీజేపీ 2014 ఎన్నికల్లో చెప్పిన ఏ హామీ అమలు చేయకపోగా పూర్తిగా ఆర్‌ఎస్‌ఎస్ అజెండా అమలు చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యం బతకాలంటే సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని, భేషజాలను పక్కన పెట్టి వామపక్షాలు కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఐక్యత గళం వినిపించాలని, తద్వారా పైస్థాయిలో చర్చలు జరగాలన్నారు.
సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తను రాఘవాచారి వద్ద శిష్యరికం చేశానన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు ఆయన గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని, మేథోసంపత్తిని ప్రశంసించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ గొప్ప ప్రజ్ఞాశాలి రాఘవాచారి అని కొనియాడారు. ఆయన సంపాదకీయాలు రిఫరెన్స్‌గా ఉపయోగ పడతాయన్నారు. అనేక అంశాలపై ఆయన రాసిన సంపాదకీయాలను నేటితరం సద్వినియోగం చేసుకోవాలన్నారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ విశాలాంధ్రకు రాఘవాచారిని కిరీటంగా అభివర్ణించారు. ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. ఆరోగ్యం సహకరించకపోయినా రాఘవాచారిపై ఉన్న గౌరవంతో కార్యాక్రమానికి హాజరైనట్లు తెలిపారు.
ముందుగా దారిదీపం సంపాదకులు డీవీవీఎస్ వర్మ సంపుటిని పరిచయం చేశారు. లోతైన విశ్లేషణ, ముందు చూపుతో రాఘవాచారి సంపాదకీయాలు రాశారని, ఆయనకు అన్ని రంగాల్లో ప్రవేశం ఉందన్నారు. పుస్తకం తీరు తెన్నులను వివరించారు. రాఘవాచారి సంపాదకీయాల క్యూఆర్ కోడ్‌ను విశాలాంధ్ర డిప్యూటీ జనరల్ మేనేజర్ మనోహర్ నాయుడు ఆవిష్కరించారు. అతిథులకు మాలతి స్వాగతం పలకగా సభకు ట్రస్ట్ సభ్యుడు బుడ్డిగ జమిందార్ అధ్యక్షత వహించారు. వామపక్షాల ఐక్యతపై ట్రస్ట్ అధ్వర్యంలో సెమినార్‌లు నిర్వహిస్తామని జమిందార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కేంద్ర కార్యవర్గసభ్యురాలు అక్కినేని వనజ, విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి హరినాథ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజయ్, సీపీఐ ఎన్టీఆర్, విజయవాడ నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, జి కోటేశ్వరరావు, డాక్టర్ సురేశ్, రాఘవాచారి సతీమణి, ట్రస్ట్ చైర్మన్ కనపర్తి జోత్స్న, కుమార్తె డాక్టర్ అనుపమ ప్రసంగించారు. తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి కళాకారులు చంద్రనాయక్, పిచ్చయ్య, నజీర్ అభ్యుదయ గీతాలు ఆలపించారు.