
తంత్రం ఫలించింది.. కూటమి గెలిచింది!
విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం. జీవీఎంసీలో ముగిసిన నాలుగేళ్ల వైసీపీ పాలన. 26న కొత్త మేయర్ ఎన్నిక జరిగే అవకాశం.
తంత్రం ఫలించింది. కూటమి గెలిచింది. అష్టకష్టాలు పడి ఎట్టకేలకు విశాఖ మేయర్ పదవిని కొల్లగొట్టింది. శనివారం జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బొటాబొటీ మెజార్టీతో తీవ్ర ఉత్కంఠ నడుమ నెగ్గింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి కూటమి నేతలు వైసీపీకి చెందిన విశాఖ మేయర్ పదవిని ఎలాగైనా తన్నుకు పోవాలని పథక రచన చేస్తూనే ఉన్నారు. ఇందుకోసం ప్రలోభ పెట్టి కొందరిని, బెదిరించి మరికొందరిని వైసీపీ నుంచి కార్పొరేటర్లను లాక్కున్నారు. 2021లో జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్)కు జరిగిన ఎన్నికల్లో మొత్తం 98 స్థానాలకు గాను, వైసీపీ 59 స్థానాలను గెలుచుకుంది. టీడీపీ 29 మంది, ఇండిపెండెంట్లు నలుగురు, జనసేన ముగ్గురు, బీజేపీ, సీపీఐ, సీపీఐ(ఎం)ల నుంచి ఒక్కొక్కరు గెలుపొందారు. బీసీ జనరల్‌కు రిజర్వు అయిన ఈ మేయర్ పదవిని యాదవ మహిళ అయిన గొలగాని హరివెంకట కుమారికి వైసీపీ పెద్దలు కట్టబెట్టారు. వైసీపీ అధికారం కోల్పోయే వరకు ఆమె పదవికి ఎలాంటి ఢోకా లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీల నేతలు అవిశ్వాసం ద్వారా మేయర్‌ను దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ నాలుగేళ్లు పూర్తయ్యే వరకు అవిశ్వాసం చెల్లుబాటు కాదన్న నిబంధనతో వేచి ఉన్నారు. ఇంతలో వైసీపీ కార్పొరేటర్లకు గాలం వేసి సఫలీ కృతులయ్యారు. కొందరు టీడీపీలో చేరగా, మరికొందరు జనసేన, బీజేపీల్లో చేరారు. కేవలం 29 మంది సభ్యులు మాత్రమే ఉన్న టీడీపీ.. వైసీపీ నుంచి జంప్ చేసిన వారితో బలం పెంచుకున్నారు. కూటమిలో చేరడానికి వైసీపీ కార్పొరేటర్లకు రూ.లక్షల్లో ముడుపులు చెల్లించారంటూ అంతా బహిరంగంగానే చెప్పుకున్నారు. కొన్నాళ్లుగా విశాఖ మేయర్‌ను దించేందుకు కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టుకున్నాక కూటమి నేతలు జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు నోటీసు ఇచ్చారు. దీనిపై ఆయన ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానానికి తేదీని నిర్ణయించారు.
విదేశాల్లో క్యాంపులు..
అవిశ్వాస తీర్మానం నెగ్గించుకునేందుకు కూటమి నేతలు, వీగిపోయేలా చేసేందుకు వైసీపీ నేతలు ఎవరి వ్యూహాలు వారు రచించడంలో మునిగి తేలారు. వీరిలో వైసీపీ నాయకులు తమ కార్పొరేటర్లను తొలుత బెంగళూరు, ఆపై కొలంబోకు, కూటమి నాయకులు తమ వారిని మలేసియాలో విహార యాత్రకు పంపించారు. రెండు, మూడు వారాలుగా కూటమి, వైసీపీ కార్పొరేటర్లు ఇంటిపట్టున లేకుండా విదేశాల్లోనే సకల సౌకర్యాలతో ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కార్పొరేటర్లకు అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరు కావాలని నిర్ణయించి, ఆ మేరకు విప్ జారీ చేసింది. దీంతో క్యాంపులో ఉన్నకార్పొరేటర్లకు శనివారం విశాఖ రాకుండా అక్కడే ఉండిపోయారు. కూటమి కార్పొరేటర్లు మాత్రం శుక్రవారం అర్థరాత్రి మలేసియా నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు.
తీవ్ర ఉత్కంఠ నడుమ అవిశ్వాసం..
జీవీఎంసీలో మొత్తం స్థానాలు 98కి గాను అప్పట్లో వైసీపీ నుంచి గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఇక అప్పట్నుంచి ఆ స్థానానికి ఎన్నిక జరగలేదు. దీంతో ప్రస్తుతం 97 స్థానాలే ఉన్నాయి. వీటితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు మరో 14 మంది ఉన్నారు. మొత్తం 111 మంది సభ్యుల్లో 2/3 వంతు మెజార్టీ ఉంటేనే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది. ఆ లెక్కన 74 మంది సభ్యుల మద్దతు కూటమికి అవసరం. ఆ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి కూటమి నేతలు, చేరకుండా చూడాలని వైసీపీ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు గట్టిగానే చేశారు. కలెక్టర్ శనివారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ సమావేశ మందిరంలో అవిశ్వాసం తీర్మానంపై సమావేశాన్ని నిర్వహించారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 74 మంది సభ్యులు చేతులెత్తడంతో మేయర్‌పై అవిశ్వాసం నెగ్గినట్టు ప్రకటించారు. దీంతో దాదాపు పది నెలలుగా మేయర్ పీఠం మార్పు కోసం కూటమి నేతలుచేస్తున్న ప్రయత్నాలకు తెరపడినట్టయింది. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు.
ఆఖర్లో గట్టెక్కించింది ఆ కార్పొరేటరే..
మేయర్ పై అవిశ్వాసం నెగ్గడానికి అవసరమైన సభ్యుల సంఖ్య ఒకింత తక్కువ కావడంతో కూటమి నేతల్లో కలవరం మొదలైంది. దీంతో అప్రమత్తమై ఆఖరి అస్త్రాలను సంధించారు. వైసీపీకి చెందిన గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీ, కోఆప్షన్ సభ్యడు బెహరా భాస్కరరావు భార్య, కోడలును మూడు రోజుల క్రితం వైసీపీ నుంచి జనసేనలో చేరేలా విజయం సాధించారు. కొన్నాళ్ల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక ఎవరికీ మద్దతు తెలపకుండా తటస్థంగా ఉన్నారు. శుక్రవారం ఆమెతో మంతనాలు జరపడంతో కూటమికి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. శనివారం అవిశ్వాస తీర్మానానికి 74 మంది సభ్యల మద్దతు అవసరం. అయితే ఒక్కరు కూడా ఎక్కువ కాకుండా సరిగ్గా 74 మందే హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తారు. ఫలితంగా కూటమి నేతలు విజయం సాధించగలిగారు. ప్రియాంక గనుక కూటమికి ఓటేయకపోతే అవిశ్వాస తీర్మానం కచ్చితంగా వీగిపోయేదేనంటూ ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు.
కొత్త మేయర్ ఎన్నిక 26న..
జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కొత్త మేయర్‌ను ఈనెల 26న జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అందుకవసరమైన ప్రక్రియను అధికారులు చేపడ్తున్నారు. మరో వైపు వైసీపీకి చెందిన ఇద్దరు డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, సతీష్‌కుమార్‌లపై కూడా అవిశ్వాస తీర్మానానికి ఇప్పటికే కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ హరిందరప్రసాద్‌కు కూటమి నాయకులు నోటీసులిచ్చారు. త్వరలో వారిపై కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
మేయర్ పదవి ఎవరికిస్తారు?
విశాఖ మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గిన నేపథ్యంలో కూటమి కొత్త మేయర్ ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును ప్రతిపాదించారు. ప్రస్తుత మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నాలు మొదలెట్టాక.. పీలాకే ఆ పదవిని కట్టబెడతామని కూటమి నేతలు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఆ హామీతోనే పీలా వైసీపీ కార్పొరేటర్ల కొనుగోళ్లు, విదేశీ ట్రిప్పులకయ్యే ఖర్చులను భరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంతలో యాదవ మహిళను మేయర్ పదవి నుంచి తప్పించి మరో కులానికిస్తే అంగీకరించబోమంటూ యాదవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇటీవల కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో విశాఖ తూర్పు ఎమ్మల్యే వెలగపూడి రామకృష్ణబాబు గొలగాని మంగవేణిని, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మొల్లి హేమలతన మేయర్ పదవికి ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే మొదట్నుంచి ఊరిస్తున్న పీలాకు డిప్యూటీ మేయర్ పదవితోనే సరిపెడతారని అంటున్నారు.
కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారుః కన్నబాబు..
‘విశాఖ మేయర్‌ను పదవీచ్యుతురాలిని చేయడానికి చంద్రబాబు నేతృత్వంలో కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. అయినా చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు 74 మ్యాజిక్ ఫిగర్‌తోనే గెలిచారు. ధర్మాన్ని చెరబట్టారు. గతంలో కొన్నిచోట్ల టీడీపీ వాళ్లు స్థానిక సంస్థల్లో బొటాబొటీతో గెలిచినా మా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నీతి తప్పలేదు. వైసీపీ కార్పొరేటర్లపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా తట్టుకుని ధైర్యంగా నిలబడినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం’ అని మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియాతో అన్నారు.
బెదిరించి గెలిచారుః అమర్నాథ్..
కూటమి నేతలు వైసీపీ కార్పొరేటర్లను బెదిరించి, భయపెట్టి లాక్కున్నారు. సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు. ఇన్నాళ్లూ తమకు 85 మంది సభ్యుల బలం ఉందని తప్పడు ప్రచారం చేసుకున్నారు. తీరా 74 మంది మాత్రమే మద్దతు ఉన్నట్టు తేటతెల్లం అయింది. అధర్మంగా మేయర్‌ను దించేసి.. ధర్మం, న్యాయం గెలిచిందని కూటమి నేతలు చెప్పకోవడం సిగ్గు చేటు. మా సభ్యలందరికీ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయమని విప్ జారీ చేశాం. కానీ 27 మంది విప్‌కు విరుద్ధంగా కూటమికి ఓటేశారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. 27 మంది తమ సభ్యత్వాలను కోల్పోతారు. కలెక్టర్ చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం’ అని మాజీ మంత్రి, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశంలో చెప్పారు.
Next Story