విజయవాడ రాజకీయాలతో కోటకు సంబంధం
x

విజయవాడ రాజకీయాలతో కోటకు సంబంధం

విజయవాడ సమీపంలోని కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేసి రాజకీయ ముద్ర వేసుకున్నారు.


కోట శ్రీనివాసరావు 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజలకు సేవ చేశారు. ఆయన సినీ నేపథ్యం, ప్రజాదరణ, హాస్య చతురతతో అసెంబ్లీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే 2004 తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుని సినిమాల్లోనే కొనసాగారు. బీజేపీతో సంబంధం తెగడానికి స్పష్టమైన కారణాలు లేనప్పటికీ, సినీ కెరీర్‌పై ఆసక్తి ఎక్కువగా ఉండటం, రాజకీయ ఆసక్తి తగ్గడం ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.

1999లో బీజేపీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉండేది. కానీ బీజేపీ-టీడీపీ పొత్తు, కోట సినీ నేపథ్యం, ప్రజాదరణ కారణంగా ఆయన గెలుపొందారు. మాజీ ప్రధాన మంత్రి వాజ్ పాయ్ పై సదాభిప్రాయంతో రాజకీయాల్లోకి కోటా వచ్చారు. తెలంగాణలో బీజేపీ నాయకుడు విద్యసాగర్ రావు ద్వారా బీజేపీలో చేరారు.

సినీ నటుడు కావడంతో ఎక్కువగా షూటింగ్ లకు వెళుతూ హైదరాబాద్ లోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చేది. అందువల్ల విజయవాడ రాజకీయ నాయకులతో పెద్దగా సంబంధాలు ఉండేవి కాదని స్థానికులు చెబుతారు. అసెంబ్లీలో బాబూ మోహన్ మంత్రి హోదాలో ఉంటే తాను ఎమ్మెల్యేగా ఉండటం వల్ల కాస్త ఫీలయ్యే వారని, ఆ తరువాత రాజకీయాల నుంచి తప్పుకుని నటనకే పరిమితమయ్యారని కోటాతో పరిచయం ఉన్న వారు చెబుతున్నారు.

కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావుకు విజయవాడలో బంధువులు కూడా ఉన్నారు. అయితే వారి ఇండ్లకు ఎప్పుడూ పోయే వారు కాదని ఆయన కలిసి తిరిగిన టీడీపీ వారు చెప్పారు.

ఆయన అసెంబ్లీలో హుందాగా, హాస్యచతురతతో వ్యవహరించేవారని, ప్రజలకు అందుబాటులో ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. కోట రాజకీయాల్లో విభిన్న శైలిని ప్రదర్శించారు. అసెంబ్లీలో సహచరులతో సరదాగా, హాస్యంగా స్పందించడం ఆయన ప్రత్యేకత. సినీ నటుడిగా ఆయనకు ఉన్న క్రేజ్ రాజకీయ సభల్లో డైలాగులతో ప్రజలను ఆకట్టుకోవడానికి ఉపయోగపడింది.

ఆయన సన్నిహితుడు, సహనటుడు బాబు మోహన్ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పిన ప్రకారం కోట రాజకీయాల్లోకి రావడానికి ఒక సరదా కారణం కూడా ఉంది. బాబు మోహన్ ఎమ్మెల్యేగా గన్‌మెన్‌లతో షూటింగ్‌లకు వెళ్లడం చూసి, కోట కూడా అలాంటి గుర్తింపు కోరుకున్నారని, అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారని చెప్పారు.

1999-2004 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత, కోట 2004 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయలేదు. బాబు మోహన్ మంత్రి అయిన తర్వాత, కోట అసెంబ్లీకి రావడం తగ్గించారని, ఆ తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారని సినీ రంగంలోని వారు చెబుతున్నారు. 2004 తర్వాత కోట శ్రీనివాసరావు రాజకీయాలకు పూర్తిగా దూరమై, తన సినీ కెరీర్‌పై దృష్టి సారించారు. 750కి పైగా చిత్రాల్లో నటించి, తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు.

Read More
Next Story