కూటమి ప్రభుత్వానికి బుద్దీ, జ్ఞానం లేవు
x

కూటమి ప్రభుత్వానికి బుద్దీ, జ్ఞానం లేవు

సంఖ్యాబలం లేకపోయినా పోటీకి దిగారు అంటూ అధికార కూటమి పక్షంపై వైఎస్‌ జగన్‌ ఫైరయ్యారు.


అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు బుద్దీ, జ్ఞానం రెండూ లేవని మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ద్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను. పార్టీలో కూడా అలాగే ఉండాలని ఆశించాను. ఇటీవల 57 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలిచింది. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపుతో గెలిపించారు. కూటమి ప్రభుత్వ బెదిరింపులు, ప్రలోభాలకు తలొగ్గలేదు. మిమ్నల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. మీరు చూపించిన తెగువ,స్ఫూర్తికి మీ అందరికీ హేట్సాఫ్‌ అంటూ జగన్‌ ప్రశంసించారు.

తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా కనీసం గెలవడానికి కావాల్సిన సంఖ్యా బలం లేదు. అయినా మభ్యపెట్టి, భయపెట్టి, ఆందోళనకు గురిచేసి, ప్రలోభాలు పెట్టి.. ఏకంగా పోలీసులను వాడుకుని దౌర్జన్యాలు చేస్తూ ఎన్నికలు నిర్వహించారు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబుకు నిజంగా బుద్దీ, జ్ణానం రెండూ లేవంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో బలం లేనప్పుడు ఎవరైనా పోటీ చేయకుండా హుందాగా వదిలేయాలి. కానీ చంద్రబాబు అలా చేయకుండా, నేను ముఖ్యమంత్రిని, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. నాకు బలం ఉన్నా లేకపోయినా ప్రతి పదవీ నాకే కావాలి, ఎవరినైనా నేను భయపెడతాను, కొడతాను, చంపుతాను, ప్రలోభపెడతాను అని అహంకారంతో వ్యవహరిస్తున్న తీరును మనం చూస్తున్నామని, ఇది ధర్మమేనా? న్యాయమేనా? అన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు.
చంద్రబాబు పాలనలోకి వచ్చి దాదాపు 11 నెలలు అవుతుంది. ఎక్కడైనా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే.. తాను చేసిన మంచి పనిని చూపించి.. నేను ఈ మంచి పని చేశాను అని ప్రజల దగ్గరకు ధైర్యంగా వచ్చి, చిరునవ్వుతో వారి ఆశీర్వాదం తీసుకునేటట్టు ఉండాలి. కానీ చంద్రబాబు పాలనలో సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌ గాలికి ఎగిరిపోయాయి. మోసాలుగా మిగిలాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాక మునుపు మీ జగన్‌ పాలనలో.. ప్రతి నెలా ఏదో ఒక బటన్‌ నొక్కే పరిస్థితి ఉండేది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక మేలు జరిగింది. నాలుగువేళ్లు నోట్లోకి పోయేయి. చంద్రబాబు వచ్చిన తర్వాత నాలుగు వేళ్లు నోట్లోకి పోవడం మాట అటుంచి.. ఉన్న ప్లేటును కూడా తీసేశారని ధ్వజమెత్తారు.
స్కూళ్లు నాశనం అయిపోయాయి. ఇంగ్లిషు మీడియం గాలికెగిరిపోయింది. నాడు నేడు పనులు ఆగిపోయాయి. టోఫెల్‌ క్లాసులు తీసేశారు. మూడో తరగతి నుంచి టోఫెల్‌ పీరియడ్లు పెట్టి మన పిల్లలను గొప్పగా చదివించాలని ఆరాటపడే ఆలోచనలూ గాలికెగిరిపోయాయి. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌ లేదు. ఎనిమిదో తరగతి పిల్లలకు ప్రతి సంవత్సరం ట్యాబులు పంపిణీ ఆగిపోయిందని మండిపడ్డారు. మరోవైపు వైద్యం పరిస్థితి అలాగే ఉంది. మామూలుగా ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. 11 నెలలకు నెట్‌ వర్క్‌ ఆసుపత్రులకు రూ.3500 కోట్లు బకాయిలు పెట్టారు. చివరకు ఆరోగ్యశ్రీ కింద నెట్‌ వర్క్‌ ఆసుపత్రుల్లో పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయని మండిపడ్డారు.
వ్యవసాయం గురించి అందరికీ తెలిసిందే. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతన్న పూర్తిగా దళారులకు అమ్ముడుపోయి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పెట్టుబడి సహాయం కింద జగన్‌ పీఎం కిసాన్‌ తో కలిపి రూ.13,500 ఇస్తున్నాడు. మేం వస్తే పీఏం కిసాన్‌ కాకుండా రూ.20 వేలు ఇస్తామని నమ్మబలికారు. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత జగన్‌ ఇచ్చిన అమౌంట్‌ లేదు. ఆర్బీకేలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటలబీమా పూర్తిగా ఎత్తివేశారు. ఇన్‌ పుట్‌ సబ్సిటీ లేదు. రైతులకు పెట్టుబడి సాయం కింద డబ్బులు లేకపోగా.. వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేనిపరిస్థితుల్లో రాష్ట్రం ప్రయాణం చేస్తోందన్నారు. మరోవైపు వాలంటీర్‌ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. స్కీములూ లేవు. ఉన్నదల్లా రెడ్‌ బుక్‌ రాజ్యాంగమే. విచ్చల విడిగా అవినీతి జరుగుతోంది. పోలీసులను అధికార పార్టీ కాపలాదారులుగా వాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని దారుణమైన పరిస్థితుల్లో నడిపిస్తున్నారని మండిపడ్డారు.
కష్ట సమయంలో ఉన్న కార్యకర్తకు ఒక్కటే చెబుతున్నాను. ఈ కష్ట కాలంలో మీరు చూపించిన ఈ స్ఫూర్తికి, ఈ నిబద్ధతకు మీ జగన్‌ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు. రాబోయే రోజులు మనవే. ఈ సారి అధికారంలోకి వచ్చినప్పుడు మీ జగన్‌ కార్యకర్తల కోసం కచ్చితంగా అండగా ఉంటాడు. జగన్‌ 2.0 లో కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటాను. కార్యకర్తల కోసం జగన్‌ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్‌ చేసి చూపిస్తాడ అంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబునాయుడు మోసాలు క్లైమాక్స్‌ కి చేరాయి. పీ–4 అని కొత్త మోసం తీసుకొచ్చాడు. పీ–4 విధానం అంటే సమాజంలో ఉన్న 20శాతం పేదవారి బాగోగులు అన్నింటినీ 10 శాతం సంపన్నులకు అప్పగిస్తాడంట. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో అర్దం కావడం లేదంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
అసలు చంద్రబాబుకు రాష్ట్రంలో ఎన్ని తెల్లరేషన్‌ కార్డులు ఉన్నాయో తెలుసా?. రాష్ట్రంలో 1.61 కోట్ల ఇళ్లు ఉంటే 1.48 కోట్ల వైట్‌ రేషన్‌ కార్డులు ఉన్నాయి. అంటే 90 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో కేవలం 8.60 లక్షల మంది మాత్రమే ఆదాయపన్ను కడుతున్నారు. 25 లక్షల మంది ఐటీ ఫైల్‌ చేస్తున్నారు. అంటే 8.60 లక్షల మందికి 1.48 కోట్ల తెల్ల రేషన్‌ కార్డు దారులను అప్పగించాలి. అక్కడ కూడా మోసం చేస్తున్నారు. కేవలం 20 శాతం అంటున్నారు. చంద్రబాబు చెప్పిన దానికి కనీసం 1000 మంది ముందుకు రారు. చంద్రబాబు చెప్పింది అవాస్తవమని, జరగదని అందరికీ తెలుసు. ఆయన డ్రామాలు ఆడుతున్నాడని ప్రజలకు తెలుసు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన మాట్లాడినప్పుడు మీటింగ్‌ లో నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. అయినా నేను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అన్నట్టు అబద్దాలు మీద అబద్దాలు చెప్పుకుంటూ పోతున్నారు. చంద్రబాబుకి తెలిసే మోసం చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు.
సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ ఎందుకు అమలు చేయడం లేదు అంటే.. రాష్ట్రం అప్పులు రూ.10లక్షల కోట్లు అంటారు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ డాక్యుమెంట్లలోనే రాష్ట్రం అప్పు రూ.6.50 లక్షల కోట్లు అని చూపించారు. అందులో రూ.3.13 లక్షల కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయేనాటికి ఆయన చేసిన అప్పులు అని తెలుసు. కానీ రాష్ట్రాన్ని భయంకరంగా చూపించాలని రూ.10 లక్షలు కోట్లు అని చెబుతున్నారు. మరో రెండు రోజుల పోతే రూ.12 లక్షల కోట్లు అని రూ.14 లక్షల కోట్లు అని చెబుతారు. కారణం సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలు ఎగ్గొట్టడానికే ఈ దిక్కుమాలిన అబద్దాలు చెబుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
Read More
Next Story