విజన్‌ డాక్యుమెంట్‌పై కలెక్టర్లకు సీఎం ఏమి క్లారిటీ ఇస్తారు
x

విజన్‌ డాక్యుమెంట్‌పై కలెక్టర్లకు సీఎం ఏమి క్లారిటీ ఇస్తారు

బుధవారం, గురువారం రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు.


విజన్ డాక్యుమెంట్ పై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఏమి క్లారిటీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌కు తెరతీసింది. కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లకు చంద్రబాబు ఇచ్చినంత ప్రాధాన్యత గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. ఐదేళ్ల సమయంలో ఒకే ఒక సారి కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌ను నిర్వహించారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లల్లో నిర్వహించారు. అది కూడా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద నిర్మించిన ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సును నిర్వహించిన జగన్‌.. ప్రజావేదిక అక్రమ కట్టడమని, కాన్పెరెన్స్‌ పూర్తి అయిన తర్వాత దానిని కూల్చివేయాలని ఆదేశించారు. తర్వాత దానిని పడగొట్టి విమర్శలు మూటగట్టుకున్నారు. ఆ తర్వాత కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లు లేకుండా పోయాయి.

2014–19 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సారి కూడా క్రమం తప్పకుండా కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లను నిర్వహించేందుకు ప్లాన్‌ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే ఒక సారి కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌ను నిర్వహించి సీఎం చంద్రబాబు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు మరో సారి నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అమరావతి సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో వీటిని ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్ర విజన్‌–47 డాక్యుమెంట్‌పైన కలెక్టర్లకు క్లారిటీ ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు చేపట్టిన ప్రజాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం చర్చించనున్నారు. దీంతో పాటుగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక తీసుకొచ్చిన నూతన పాలసీలు, వాటి అమలు తీరుపైన కూడా చర్చించనున్నారు. ఆర్జీజీఎస్, గ్రామ, వార్డు సచివాలయాలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌పైన చర్చించనున్నారు. వ్యవసాయం, పశుసంవర్థక, ఉద్యాన, పౌరసరఫరాలు, అటవీ, జలవనరులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు అన్ని శాఖలపైన సమగ్రమైన చర్చించి కలెక్టర్లకు ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలపైన కూడా చర్చించి కలెక్టర్లు, ఎస్పీలకు దిశా నిర్థేశం చేయనున్నారు.
Read More
Next Story