కేంద్రానికి గురజాడ గుర్తొచ్చారు.. బడ్జెట్ లో ఆంధ్రను మరిచారు..
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ఊసే లేకుండా పోయింది. ఎగువ మధ్య తరగతి వర్గాల నుంచి సంపాదనే ధ్యేయంగా బడ్జెట్ ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను తెలుగు కవితకు ముడిపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. అభ్యుదయ కవి గురజాడ అప్పరావు రాసిన కవితతో కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టిన నిర్మల ఏపీకి రిక్త హస్తం చూపించారు. తెలంగాణ నుంచి ఏపీని విడగొట్టిన తరువాత ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాల్లో ప్రథమ భాగాన నిలిచిన ఆంధ్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని భావించిన ప్రజలను పదేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారు. ఆంధ్రలోని పాలకులు కూడా వారి మోసాలకు వంత పాడుతూ ప్రజలను మభ్యపెట్టి మాయ చేస్తున్నారు. ఇందుకు 2025-2026 బడ్జెట్ నిదర్శనమని పలువురు ఆర్థిక శాస్త్ర నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
కరోనా సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 2021 జనవరి 16న తొలి దశ టీకా కార్యక్రమాన్ని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ కష్ట కాలంలో దేశ ప్రజలంతా పరస్పరం సాయం చేసుకోవాలని పిలుపు నిచ్చారు.
ఈ సందర్భంగా ‘సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడుపడవోయి.. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి...' అని నాడు ప్రధాన మంత్రి గురజాడ కవితను చదివి వినిపిస్తే..
నేడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఆయన పంథాలోనే అడుగులు వేశారు. మేము కష్టాల్లో ఉన్నామని చెప్పదలుచుకున్నారో ఏమో కాని.. ’దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్..’ అంటూ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తీరు చూసిన ఆంధ్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
కేంద్రంలో ప్రభుత్వం కొనసాలంటే బీహార్, ఆంధ్ర ప్రదేశ్ ఎంపీల బలం అవసరం. బీహార్ కు కొన్ని వరాలు ఇచ్చిన నిర్మల ఏపీని పూర్తిగా విస్మరించారు. బీహార్ లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీహార్ కు వరాలు కురిపించారు. తాజా బడ్జెట్లో బీహార్ (Bihar)కు ప్రత్యేక కేటాయింపులు చేశారు. బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. మఖానా వ్యాపారం కోసం రైతుల సౌకర్యార్థం ఈ బోర్డు పని చేయబోతోంది. అలాగే బీహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో యాభై వేల ఎకరాలకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కేనాల్‌కు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అలాగే ఐఐటీ పాట్నాను కూడా విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేందుకు బీహార్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
ప్రస్తుతం బీహార్‌లో జేడీయూతో కలిసి బీజేపీ అధికారాన్ని పంచుకుంటోంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో జేడీయూ కీలక భాగస్వామి. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌ను పక్కన పెట్టిన కేంద్రం.. బడ్జెట్లో కీలక కేటాయింపులు చేసింది. బీహార్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేశారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బడ్జెట్ లో కేంద్రం ఆంధ్రప్రదేశ్ ను మోసం చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు స్పందించాల్సి ఉంది. వారి స్పందన తరువాత ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాల్సి ఉంటుందనే చర్చ మొదలైంది.
పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కనుక కేంద్రమే నిర్మాణాన్ని పూర్తి చేయాలి. దానిపై చేసే ఖర్చును లెక్కవేయడంలో అర్థం లేదు. యువతకు ఉపాధి కల్పించే ఒక్క ప్రాజెక్టును కూడా ఏపీకి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ అనుకుంటే నేరుగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కూలిపోతుంది. అయినా ఏపీని పట్టించుకోవడం లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు కేంద్రంపై దూకుడు పెంచాల్సిన అవసరం ఉంటుందని మేధావులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వలేదు. సీజీఎస్టీ రద్దు చేయాలని కోరినా పట్టించుకోలేదు. కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వటం లేదు. రాజధాని నిర్మాణానికి గ్రాంట్ ఇవ్వలేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయిస్తామన్న నిధులు కేటాయించలేదు. ప్రభుత్వ రంగం నుంచి భారీ ప్రాజెక్టు ఒక్కటి కూడా ఏపీలో లేకపోవడం వల్ల ఆర్థికంగా వెనుకబడి పోతోంది. ఇప్పటికే పది లక్షల కోట్ల అప్పుల్లో ఏపీ కూరుకు పోయింది. అందులో 50 శాతం అప్పులు కేంద్రం భరించాలనే డిమాండ్ ను కేంద్రం పట్టించుకోలేదు. రైల్వే జోన్ అన్నారు. ఇంకా కార్యరూపం దాల్చలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగుల్లో అలజడి తగ్గలేదు. రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చే ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్రం ఇవ్వలేకపోయింది.
కేంద్ర బడ్జెట్ పై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫ్రొఫెసర్ వి అంజిరెడ్డి ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ తో మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రానికి సంబంధించి పెదవి విప్పలేదన్నారు. ఈ బడ్జెట్ ఎగువ మధ్య తరగతి వర్గాల్లో కొనుగోలు శక్తిని పెంచేందుకు ఉపయోగ పడుతుందన్నారు. వారిలో కొనుగోలు శక్తి పెరిగితే దేశానికి ప్రజల నుంచి రాబడులు ఎక్కువగా ఉంటాయనే అంశం మాత్రమే బడ్జెట్ లో కనిపించిందన్నారు. ఏపీలో కేంద్ర పెట్టుబడులు ఎక్కడా లేవన్నారు. ప్రైవేట్ కంపెనీల వస్తువులు ఎగువ మధ్య తరగతి వారు ఎక్కువ కొనుగోలు చేస్తే వచ్చే పన్నులతో ప్రభుత్వాన్ని ముందుకు నడిపించేందుకు వీలు ఉంటుందనేది బడ్జెట్ లో స్పష్టంగా కనిపించిందన్నారు.